విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని పెంచేసి, నిత్యవసరాల ధరలతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ సిటీ కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుది 'విజనరీ పాలన' కాదని, ప్రజల నడ్డి విరిచే 'బాదుడే బాదుడు పాలన' అని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు జీడీపీలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో ఉంచుతామని చెబుతున్నారని, కానీ ప్రజల దృష్టిలో జీడీపీ అంటే గ్యాస్ (G), డీజిల్ (D), పెట్రోల్ (P) రేట్లను పెంచడంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశారని ఎద్దేవా చేశారు. మెడికల్, ఎడ్యుకేషన్ మాఫియాతో ప్రభుత్వం కుమ్మక్కైందని, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రజలు అప్పుల పాలవుతున్నారని ఆరోపించారు. గిరిజనుల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా వైఎస్ జగన్ గారు కృషి చేశారని, కానీ చంద్రబాబు అరకు పర్యటనకు వెళ్లి వైఎస్సార్సీపీ పథకాలకు స్టిక్కర్లు వేసుకుని 'క్రెడిట్ చోరీ'కి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే... ధరల పెరుగుదలపై కనీసం సమీక్ష లేదు వెన్నుపోటు కూటమి పాలనలో కూరగాయలు, నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు ఏమీ కొనలేక, తినలేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే, ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, కేరళ కంటే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ పై 31 శాతం స్టేట్ వ్యాట్ తో పాటు, రూ.4 అదనపు వ్యాట్, రోడ్ డెవలప్‌మెంట్ సెస్ కింద మరో రూపాయి వసూలు చేస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి లేదా స్టేట్ టాక్స్‌లు తగ్గించి ధరలు ఎందుకు దించలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. వైఎస్ జగన్ హయాంలో ధరల నియంత్రణ గత మా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ గారు ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి వినియోగదారులకు అండగా నిలిచారు. మహారాష్ట్రలో వర్షాల వల్ల టమాటా ధరలు పెరిగినప్పుడు, మా జగన్ ప్రభుత్వం కిలో రూ.150 పెట్టి రైతుల వద్ద కొనుగోలు చేసి, వినియోగదారులకు కేవలం రూ.50లకే సబ్సిడీపై అందించింది. ఐదేళ్లలో 8,460 టన్నుల టమాటాలను, రూ.69 కోట్లతో 94,335 క్వింటాళ్ల ఉల్లిపాయలను కొనుగోలు చేసి తక్కువ ధరకే ప్రజలకు మేము అందించాం. ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని కిలో రూ.11లకే ఇచ్చాము. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రూ.7,758 కోట్లు వెచ్చించి ప్రజలకు సబ్సిడీపై సరుకులు అందించాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ధరల నియంత్రణపై కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదు. గిరిజనుల ఖాతాలో బాబు క్రెడిట్ చోరీ గిరిజనుల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మా వైఎస్ జగన్ గారు ఎంతో కృషి చేశారు. కానీ, చంద్రబాబు అరకు పర్యటనకు వెళ్లి మా వైఎస్సార్సీపీ పథకాలకు స్టిక్కర్లు వేసుకుని 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారు. ఆయన చెబుతున్న 'సంజీవని' పథకం గేమ్ చేంజర్ కాదు, అది కేవలం 'నేమ్ చేంజర్' మాత్రమే. మా జగనన్న హయాంలోనే వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, టెలీమెడిసిన్, డిజిటల్ హెల్త్ కార్డ్స్ తీసుకొచ్చాము. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచిన విషయం గుర్తుందా? అరకు కాఫీని నేనే కనిపెట్టానని చంద్రబాబు గారు చెప్పడం చాలా హాస్యాస్పదం. 1920ల్లో బ్రిటిష్ కాలం నుంచే అరకు కాఫీ ఫేమస్ అన్న విషయం మీకు తెలియదా? గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో పాటు మా జగనన్న ఇచ్చిన రైతు భరోసాను వెన్నుపోటు కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జగనన్న పాడేరులో 150 సీట్లతో మెడికల్ కాలేజీని నిర్మిస్తే, చంద్రబాబు వాటిని 50 సీట్లకు కుదించారు. పార్వతీపురం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారు. ఇందుకు గాను ఆయన గిరిజనులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. మత రాజకీయాలు మానుకోవాలి పెరిగిన నిత్యావసరాల ధరలు, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మానవత్వమే మతం. రాజకీయాల కోసం, ఓట్ల కోసం మతాలను, కులాలను వాడుకునే అవకాశవాద రాజకీయం చంద్రబాబుకే చెల్లింది. గతంలో విజయవాడలో 22 గుడులను కూల్చేసిన చరిత్ర కూడా చంద్రబాబుదే. ఈ కూటమి పాలనలో సింహాచలంలో గోడ కూలి భక్తులు చనిపోయినా, కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగినా, పెదకాకానిలో మంగళసూత్రాలు చోరీకి గురైనా అదంతా ఆయన ప్రభుత్వ అసమర్థతే. తక్షణమే నిత్యవసరాల ధరలను నియంత్రించాలి. లేకపోతే ప్రజల తరఫున మా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని వరుదు కళ్యాణి హెచ్చరించారు.