అరకు పర్యటనలో గిరిజన సమస్యలు గాలికొదిలి విద్వేష రాజకీయాలా?

సీఎం చంద్రబాబు తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధుల ధ్వజం

వైయ‌స్ జగన్‌ హయాంలో అమలు చేసిన వైద్య సేవలకే ‘స్టిక్కర్ సంజీవని’

సీట్లు తగ్గించి పాడేరు మెడికల్‌ కాలేజీ నిర్వీర్యం

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యేలు మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

వైయ‌స్ఆర్‌సీపీ అమలు చేసిన వైద్య సేవలకే సంజీవని పేరుతో చంద్రబాబు కొత్త స్టిక్కర్
మండిపడ్డ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

అల్లూరి సీతారామరాజు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనను పూర్తిగా విస్మరించి మత రాజకీయాలు, విద్వేష ప్రచారానికి తెరలేపారని వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, వైద్యం, విద్య, రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి మాట్లాడకుండా.. భార్యాభర్తల వ్యక్తిగత సమస్యలను పార్టీకి, మతానికి ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి శనివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తారు.

సంజీవని కాదు.. అదొక ‘స్టిక్కర్ సంజీవని’

వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో గిరిజనుల ముంగిటకే వైద్యాన్ని తీసుకెళ్లేందుకు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, ఆరోగ్య భద్రత, టెలిమెడిసిన్‌ వ్యవస్థలను ప్రవేశపెట్టారని నాయకులు గుర్తుచేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన అవే సేవలకు పేర్లు మార్చి ‘సంజీవని’ అంటూ కొత్త స్టిక్కర్లు వేసుకోవడమేనా పరిపాలన అని ప్రశ్నించారు. పని జగన్‌మోహన్‌ రెడ్డిది అయితే పేరు చంద్రబాబుదా, సేవ జగన్‌ది అయితే స్టిక్కర్‌ బాబుదా అని ఎద్దేవా చేశారు. కేవలం పేరు మార్చుకున్నంత మాత్రాన సంజీవని అయిపోదని, ప్రజలను బతికించేది నిజమైన వైద్య సేవలేనని స్పష్టం చేశారు.

గిరిజన ప్రాంతాలకు వెళ్లి మత రాజకీయాలు, డైవర్షన్‌ డ్రామాలు

చంద్రబాబు రాజకీయ జీవితమంతా అవకాశవాదమేనని, అవసరాలకు తగ్గట్టు మాటలు మార్చడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. మతం గురించి మాట్లాడే ముందు తమ పాలనలో ఆలయాల్లో జరిగిన ఘటనలు, భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సూపర్‌ సిక్స్‌ హామీలు ఎందుకు అమలు కాలేదు? ప్రజల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు మతాన్ని, వ్యక్తిగత వివాదాలను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిజన ద్రోహిగా మారిన కూటమి ప్రభుత్వం

గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

వాలంటీర్‌ వ్యవస్థ రద్దు: మారుమూల గిరిజన గూడాల్లో ఇంటి వద్దకే పెన్షన్‌ అందించిన వాలంటీర్‌ వ్యవస్థను తీసేసి వృద్ధులను కష్టాలపాలు చేయడంతో పాటు గిరిజన యువతకు ఉపాధి లేకుండా చేశారు.

ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతులకు మొండిచేయి: కేంద్రం ఇవ్వకపోయినా నాడు వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం ఆర్వోఎఫ్‌ఆర్‌ (ROFR) అటవీ పట్టాదారులైన గిరిజన రైతులకు వైయ‌స్‌ఆర్‌ రైతు భరోసా అందించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సాయాన్ని తగ్గించి గిరిజన రైతుల పొట్ట కొట్టింది.

మెడికల్‌ కాలేజీల నిర్వీర్యం - ప్రైవేటీకరణ కుట్ర: మారుమూల ఏజెన్సీ ప్రజల కోసం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం పాడేరులో మెడికల్‌ కాలేజీని నిర్మిస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం మెడికల్‌ సీట్లు తగ్గించి గిరిజన వైద్య విద్యను దెబ్బతీస్తోంది. పార్వతీపురం మెడికల్‌ కాలేజీ భవిష్యత్తుపై సందిగ్ధత సృష్టించి ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది.

సెల్‌ టవర్ల కనెక్టివిటీ నిర్లక్ష్యం: గత ప్రభుత్వ హయాంలో ఏజెన్సీలో నెట్‌వర్క్‌ సమస్యను పరిష్కరించేందుకు భారీగా సెల్‌ టవర్లు ఏర్పాటు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఎన్ని టవర్లు ఏర్పాటు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.

అరకు కాఫీపై క్రెడిట్‌ చోరీ: చంద్రబాబు రాజకీయ జీవితం కంటే అరకు కాఫీ చరిత్ర చాలా పురాతనమైనదని, అలాంటి అరకు కాఫీ ఘనతను కూడా తానే సాధించినట్లు చెప్పుకోవడం క్రెడిట్‌ రాజకీయాల పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలో గిరిజన ప్రజలు అడుగుతున్నది మత విద్వేషాలు కాదని, తమకు దక్కాల్సిన అభివృద్ధి, ఉపాధి, నాణ్యమైన వైద్య సేవలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. పథకాలకు పేర్లు మార్చడం, ప్రకటనలకే పరిమితం కావడం మాని, ఏజెన్సీ ప్రాంతాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పునరుద్ధరించాలని, గిరిజనుల హక్కులను కాపాడాలని వైయ‌స్ఆర్‌సీపీ పక్షాన కోరారు.
 

Back to Top