పోలాకి: రాజ్యాంగబద్ధమైన స్థానిక సంస్థల పదవులను కూటమి ప్రభుత్వం అణచివేస్తోందని నరసన్నపేట నియోజకవర్గ వైయస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య ధ్వజమెత్తారు. పోలాకి మండల పరిషత్ కార్యాలయం ఎదుట వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. పోలాకి మండలంలో జిల్లా పరిషత్ నిధులతో మంజూరైన రూ.24 లక్షల అభివృద్ధి పనులకు గ్రామ పంచాయతీల తీర్మానాలు ఇవ్వకుండా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని కృష్ణచైతన్య తెలిపారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి అభివృద్ధి పనులను నిలిపివేయడం సరికాదన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తీర్మానాలు వెంటనే ఇచ్చి అభివృద్ధి పనులకు సహకరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ములపేట పోర్టు తమ హయాంలోనే వచ్చిందంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రచారం చేసుకోవడం సరికాదని కృష్ణచైతన్య అన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో రూపుదిద్దుకున్న అభివృద్ధి ఫలాలను కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని మండిపడ్డారు. జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువులు, సాగునీరు అందించడంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి పెట్టాలని, ఆ బాధ్యత నిర్వర్తించలేకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ నాయకులు పాల్గొన్నారు.