వెలిగొండ ప్రాజెక్టుపై చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ 

నిర్వాసితుల‌కు న్యాయం చేయ‌కుండా ప్రారంభోత్స‌వాలా?

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల తీవ్ర ఆగ్ర‌హం

మార్కాపురంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు 

పునాదులు వైఎస్సార్‌వి.. ప్రచారం బాబుది

వెలిగొండ ప్రాజెక్టు కోసం చంద్రబాబు చేసింది శూన్యం

70 శాతం పనులు పూర్తి చేసింది వైఎస్సార్, జగనన్న ప్రభుత్వాలే

నిర్వాసితుల జీవితాలతో ఆడుకుంటున్న వెన్నుపోటు కూటమి 

అర్ధరాత్రి హుకుం జారీ చేసి ప్రజలను రోడ్డున పడేస్తారా?

ప్యాకేజీలు ఇవ్వకుండా, హడావుడి ప్రారంభోత్సవాలు ఎందుకు?

ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు 

మార్కాపురం: ప్రకాశం జిల్లావాసుల చిరకాల వాంఛ అయిన వెలిగొండ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మార్కాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేవలం శిలాఫలకాలకే పరిమితమైన చంద్రబాబు, ఇప్పుడు ప్రాజెక్టు తానే పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు, 2004 వరకు అధికారంలో ఉన్నా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని గుర్తుచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. ఆధునిక యంత్రాలను రప్పించి, ప్రాజెక్టు పనులను పరుగులు తీయించిన ఘనత వైఎస్సార్‌దేనని స్పష్టం చేశారు. ఆయన హయాంలోనే దాదాపు 70 శాతానికి పైగా టన్నెల్ పనులు పూర్తయ్యాయని లెక్కలతో సహా వివరించారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసి, సొరంగాలను జాతికి అంకితం చేసిందని పేర్కొన్నారు. కానీ, పద‌హారేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేవలం ఆరు కిలోమీటర్ల టన్నెల్ మాత్రమే తవ్వారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్ వర్క్స్, టన్నెలింగ్ పనుల్లో చంద్రబాబు పాత్ర శూన్యమని మండిపడ్డారు. కేవలం 21 కిలోమీటర్ల మేర ఉన్న ఫీడర్ కెనాల్‌కు రూ.450 కోట్లు ఖర్చు చేసి, అదేదో మొత్తం వెలిగొండ ప్రాజెక్టును తామే పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిప‌డ్డారు. అత్యంత కీలకమైన తీగలేరు కెనాల్‌ పూర్తి కాకుండా మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాలకు నీళ్లు ఎలా ఇస్తారని నాయకులు ప్రశ్నించారు. 2014-19 మధ్యకాలంలో ఫీడర్ కెనాల్ పేరుతో అప్పటి టీడీపీ కాంట్రాక్టర్లు కుమ్మక్కై, జీవోలు మార్చుకుని రూ.630 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాగ్ నివేదికలే స్పష్టం చేశాయ‌ని చెప్పారు. అప్పట్లో నాణ్యతా లోపంతో వరదలకు కొట్టుకుపోయిన ఆ కాలువకు ఇప్పుడు కేవలం కాంక్రీట్ లైనింగ్ పనులు చేస్తూ, ప్రాజెక్టు ప్రారంభోత్సవం అని హడావుడి చేస్తున్నారని వివ‌రించారు.

మరోవైపు, ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల వెన్నుపోటు కూట‌మి ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించకుండానే, వారిని ఇళ్ల నుంచి గెంటేయడం దారుణమన్నారు. పోలీసుల పహారాలో నిర్వాసితుల మెడపై కత్తి పెట్టి ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం నిర్వాసితులకు ప్రకటించిన ప్యాకేజీని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. గృహ ప్రవేశాలు చేసుకోకముందే, అర్ధరాత్రి నోటీసులు ఇచ్చి ప్రజలను రోడ్డున పడేయడం పాలకుల దుర్మార్గానికి నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కట్టిన భవనాల్లో కలెక్టరేట్ పెట్టుకున్నారే తప్ప, నిర్వాసితులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. తక్షణమే నిర్వాసితులందరికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టు ప్రారంభించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెడితే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని నాయకులు హెచ్చరించారు. 

నాయ‌కులు ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే... 

శంకుస్థాప‌న త‌ప్ప చంద్ర‌బాబు చేసిందేమీ లేదు
- కె.పి. కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో చంద్రబాబు కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారు. 1995 నుంచి 2004 వ‌ర‌కు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ. 25 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 2004లో మార్కాపురం వచ్చి మళ్లీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే దోర్నాల సమీపంలో కొత్తూరు వద్ద మొదటి టన్నెల్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏకంగా రూ. 3,464 కోట్లు మంజూరు చేశారు. మొదటి టన్నెల్ సరిపోదని ఇంజనీర్లు చెప్పడంతో, ఆర్థిక మంత్రి రోశయ్య గారితో మాట్లాడి రెండో టన్నెల్ కూడా మంజూరు చేయించారు. వైఎస్సార్ హయాంలోనే మొదటి టన్నెల్‌లో 16.8 కిలోమీటర్లు, రెండో టన్నెల్‌లో 10 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పనులు పక్కనపెట్టి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఫీడర్ కెనాల్స్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఈయన వ్యవహరిస్తున్న తీరు వల్ల వెలిగొండ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి కాదు. ప్రాజెక్టులో 75 శాతం పనులు రాజశేఖరరెడ్డి గారి హయాంలోనే పూర్తయ్యాయని ప్రజలు గమనించాలని కోరుతున్నాను.

ప్ర‌భుత్వానికి నిర్వాసితుల ప‌ట్ల మాన‌వ‌త్వం లేదు
- జంకె వెంక‌ట‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఈ ప్రభుత్వం ఏమాత్రం మానవత్వం లేకుండా నిర్వాసితులను రోడ్డున పడేయడం చాలా దారుణం. ఆరు నెలల ముందు నోటీసులు ఇచ్చి, ఇళ్ల పట్టాలు అందజేసిన తర్వాతే వారిని ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా హుకుం జారీ చేసి సాయంత్రానికి ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు లేక, కనీస సౌకర్యాలు లేక వృద్ధులు, పిల్లలు, మూగజీవాలతో ఆ కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్యాకేజీలు ఇచ్చి, వాళ్లు ఇళ్లు కట్టుకునేంత సమయం ఇవ్వకుండా హడావుడిగా ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు?. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వమే రూ. 3500 కోట్లు ఇచ్చి విదేశాల నుండి యంత్రాలు తెప్పించి ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది. ఆ పనుల పుణ్యమా అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టును ప్రారంభిస్తూ నీళ్లు వదలడానికి సిద్ధమయ్యారు. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జగన్ గారు నీళ్లు వదలడాన్ని తాత్కాలికంగా డిలే చేశారు. ప్రాజెక్టు ప్రారంభించాలంటే గేట్లు ఎత్తి నీళ్లు వదలాలి కానీ, ఇప్పుడు ఎక్కడినుంచి నీళ్లు తెచ్చి ఆర్భాటం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. కనీస ప్యాకేజీలు ఇవ్వకుండా జిల్లా ప్రజలను వేధిస్తూ డబ్బా కొట్టుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

వెలిగొండ ప్రాజెక్టు వైఎస్సార్‌, జ‌గ‌న్‌ల క‌ష్ట‌మే
- బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే

పశ్చిమ ప్రకాశం జిల్లాకు పునాది లాంటి వెలిగొండ ప్రాజెక్టును 2004 వరకు చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పాదయాత్రలో ఈ ప్రాంత దుస్థితిని చూసి ప్రాజెక్టు నిర్మాణానికి చలించిపోయారు. ముఖ్యమంత్రి అయిన పదో నెలలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, రూ. 1650 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పనుల తీరును స్వయంగా పరిశీలించి, మొదటి టన్నెల్ ఈ ప్రాంతానికి సరిపోదని ఆయన గుర్తించారు. స్థానిక నాయకుల కోరిక మేరకు అక్కడికక్కడే రెండో టన్నెల్‌ను కూడా మంజూరు చేస్తూ రూ. 3,456 కోట్లు కేటాయించారు. రాజశేఖరరెడ్డి గారి హయాంలోనే 2009 నాటికి దాదాపు 70 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పూర్తిగా నీరుగార్చాయి. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక పెండింగ్ పనులను పూర్తి చేసి టన్నెల్స్ కు తుది రూపు తీసుకొచ్చారు. ఎద్దులు బండి లాగితే వెనుక ఉన్న కుక్క ఆయాసపడినట్లుగా, వైయ‌స్ఆర్‌సీపీ చేసిన పనికి బాబు క్రెడిట్ కొట్టేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఏ ప్రాజెక్టు చూసినా అది వైఎస్సార్ వేసిన పునాదేనని సభా ముఖంగా తెలియజేస్తున్నాను.

తండ్రీకొడుకులే 82 శాతం పనులు పూర్తి చేశారు
- అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే

మూడు దశాబ్దాల పశ్చిమ ప్రకాశం ప్రజల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్య ఎంతో పోరాటం చేశారు. 1996 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి కూడా తీయలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అధికారంలోకి వచ్చాకే అమెరికా, జర్మనీల నుంచి ఆధునిక టన్నెల్ బోరింగ్ యంత్రాలను తెప్పించారు. 37 కిలోమీటర్ల టన్నెల్‌లో రాజశేఖరరెడ్డి 20 కిలోమీటర్లు, జగన్ గారు 11 కిలోమీటర్లు పూర్తి చేశారు. తండ్రీకొడుకులే 82 శాతం పనులు పూర్తి చేయగా, చంద్రబాబు కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే తవ్వారు. వైఎస్ జగన్ గారు రెండు టన్నెళ్లను జాతికి అంకితం చేస్తూ, నిర్వాసితులకు న్యాయం చేశాకే నీళ్లు వదులుతామని స్పష్టంగా చెప్పారు. కనీసం నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ. 905 కోట్ల రూపాయల ప్యాకేజీని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదు. ఇంకా రూ. 3,500 కోట్ల రూపాయల పనులు పెండింగ్‌లో ఉండగా, ప్రాజెక్టు పూర్తయిందని ప్రజలను ఎలా మోసం చేస్తారు?. డిజైన్ ప్రకారం 4,45,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినప్పుడే ఈ ప్రాజెక్టు నిజంగా పూర్తయినట్లు లెక్క. ఫీడర్ కెనాల్స్ ద్వారా హడావుడిగా నీళ్లు వదులుతూ, రైతుల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు.

చంద్ర‌బాబుది శిలాఫ‌ల‌కాల రాజ‌కీయమే
- తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే

వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో 30 ఏళ్ల కాలంలో చంద్రబాబుది కేవలం శిలాఫలకాల రాజకీయమే. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తవ్విన టన్నెల్ కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే. హెడ్ వర్క్స్, టన్నెలింగ్ లాంటి క్లిష్టమైన పనులను వదిలేసి, కాలువల తవ్వకాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రోజుటి వరకు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన 7వేల‌ కోట్లలో బాబు ఖర్చు చేసింది కేవలం రూ. 2,100 కోట్లు మాత్రమే. జగన్ గారు టన్నెల్స్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే తప్పబట్టిన వారు, ఇప్పుడు నీళ్లు వదలడాన్ని ఎలా సమర్థించుకుంటారు?. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు దాటుతున్నా 300 మీటర్ల టన్నెల్ పనులను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అర్హత ఉన్న నిర్వాసితులందరికీ పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారో సమాధానం చెప్పాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు కల్పించాల్సిన కనీస కాలవ్యవధిని కూడా తుంగలో తొక్కారు. కాగ్ నివేదికల ప్రకారం గతం నుంచీ చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలకు పాల్పడింది. రాజశేఖరరెడ్డి గారు చేసిన 70 శాతం పనులకు కనీసం ధన్యవాదాలు చెప్పకుండా ప్రాజెక్టు ప్రారంభించడం అన్యాయం.

తీగ‌లేరు కెనాల్ ప‌నులు పూర్తికాకుండా నీళ్లు ఎలా ఇస్తారు? 
- కందుల నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

వెలిగొండ ప్రాజెక్టు అనేది ప్రకాశం జిల్లా వాసుల సెంటిమెంట్, దీనిని కేవలం ఓట్ల రాజకీయంగా చూడకూడదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ శిలాఫలకాలు వేస్తే అక్కడ అడవులు మొలిచాయే తప్ప అభివృద్ధి జరగలేదు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ, అనుమతులు అన్నీ వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. గొట్టిపాడు, సుంకేసుల డ్యామ్‌లను కట్టి, రైతులకు నష్టపరిహారం చెల్లించిన ఘనత కూడా వైఎస్సార్‌దే. తీగలేరు కెనాల్ పూర్తి చేయకుండా వ్యవసాయ భూములకు నీళ్లు ఎలా ఇస్తారో కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. నిర్వాసితుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన స్కూల్ భవనంలో కలెక్టరేట్ పెట్టుకోవడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం. జగన్ ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ. 1301 కోట్లు కేటాయించి జీవో ఇస్తే, ఈ ప్రభుత్వం దాన్ని నీరుగార్చింది. సంపన్నులకు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే ఈ ప్రభుత్వం, పేద నిర్వాసితులకు మాత్రం అన్యాయం చేస్తోంది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించడం వల్ల రైతులు రెండు వేల ఎకరాల్లో వేసిన పంటను నష్టపోయారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి, ఆధునిక రూపుదిద్దుకునేలా చేసిన వైఎస్సార్ కుటుంబానికే ఈ ప్రాజెక్టు క్రెడిట్ దక్కుతుంది.

Back to Top