నెల్లూరు: పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ తీర్మానం చేసి, జీఓ జారీ చేసిన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. అది ఆచరణరీత్యా సాధ్యం కాదని తెలిసినా, హడావిడి చేస్తూ, ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. బీసీ సంక్షేమం, రాజకీయ ప్రస్థానంపై టీడీపీ నేత బీదా రవిచంద్ర చేసిన సవాల్ స్వీకరిస్తున్నానని.. ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రెస్‌మీట్‌లో పి.అనిల్‌కుమార్ యాదవ్ ఇంకా ఏం మాట్లాడారంటే..: మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల్లో కేసులు వేయించిన టీడీపీ నేతలకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. గతంలో జగన్‌గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీఓ నెం:176 తీసుకొస్తే, దానికి వ్యతిరేకంగా బిర్రా ప్రతాప్‌రెడ్డి ద్వారా కోర్టుల్లో పిటిషన్ వేయించిన చంద్రబాబు, అలా నాడు బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నారు. చంద్రబాబు ఏనాడూ బీసీలకు మేలు చేయలేదు. అందుకే ఆ పార్టీ వారికి మాట్లాడే నైతిక హక్కు ఏ మాత్రం లేదు. రవిచంద్ర సవాల్‌కు రెడీ: బీదా రవిచంద్ర సవాల్ స్వీకరిస్తున్నా. బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్లేస్, టైమ్, లొకేషన్ అన్నీ ఆయనకే వదిలేస్తున్నా. 1995లో ఎన్టీఆర్ గారిని మానసికంగా క్షోభపెట్టి, ఆయన దగ్గర పార్టీని, పదవిని లాక్కున్న నాటి నుంచి చంద్రబాబు 17 ఏళ్ల పాలన, జగన్‌గారి 5 ఏళ్ల పాలనలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం, రాజకీయ సాధికారతపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు నేను రెడీ. బీసీలు డిప్యూటీ సీఎంకు అర్హులు కారా?: సీఎం తర్వాత అత్యున్నత గౌరవం కలిగిన హోదా డిప్యూటీ సీఎం పదవి. మరి రాష్ట్రంలో 50 శాతం బీసీలు ఉన్నారు. కానీ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఆ వర్గాల వారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. ఎందుకు? బీసీలకు ఆ అర్హత లేదా? అదే గత మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు వర్గాలకు సముచిత స్థానం కల్పించాం. అది మా పార్టీ పాలసీ. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ విధానంలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి: పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి నాయకుడు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి లేకుండా పోతుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఒక్కరే డిప్యూటీ సీఎం అయిపోతే సరిపోతుందా? ఆయనకు ఇచ్చినట్లుగానే ఒక బీసీ నాయకుడికి డిప్యూటీ సీఎం ఇచ్చి ప్రత్యేక విమానాలు, ఛాపర్లు, ప్రోటోకాల్ భద్రత కల్పించాల్సి వస్తుందనే ఇవ్వలేదా? లేక బీసీ నాయకుడు ఆ స్థాయికి సరిపోడనే ఈ వివక్షా? రానున్న మంత్రివర్గ విస్తరణలోనైనా బీసీలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించే దమ్ము కూటమికి ఉందా? వీటన్నింటికీ పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఆర్.కృష్ణయ్య ఎందుకు మౌనంగా ఉన్నారు?: దాదాపు 40–50 ఏళ్లుగా బీసీ ఉద్యమాల కోసం పోరాడిన ఆర్.కృష్ణయ్యను, జగన్‌గారు గుర్తించి రాజ్యసభకు పంపారు. ఈరోజు రాష్ట్రంలో బీసీల హక్కులను కాలరాస్తుంటే, డిప్యూటీ సీఎం హోదాను తొలగిస్తే ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదు? రాజ్యసభ పదవి వస్తే చాలు నా పని అయిపోయింది అనుకుంటున్నారా? బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన పెద్దలు ఈ అన్యాయంపై తప్పకుండా గళమెత్తాలని మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు.