గుంటూరు: పొన్నూరులో అమ్మవారి మంగళసూత్రం కనిపించకుండా పోయిన ఘటనపై ప్రభుత్వం, దేవదాయ శాఖ, రెవెన్యూ యంత్రాంగం ఇప్పటివరకు స్పష్టంగా స్పందించకపోవడంపై పొన్నూరు వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి అంబటి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మంగళసూత్రం లేకుండా పూజలు నిర్వహించడం అశుభకరమని పేర్కొంటూ, మంగళసూత్రాన్ని ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు. ఈ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అంబటి మురళి అన్నారు. మంగళసూత్రం తయారు చేయించి గుట్టుచప్పుడు కాకుండా అమ్మవారికి సమర్పించేందుకు ఆలయ అధికారి బసవ శంకర్ ప్రయత్నించారని పేర్కొన్నారు. అమ్మవారి మెడలోని పూలదండలు తీసే సమయంలో మంగళసూత్రం కనిపించకుండా పోయిందని చెబుతున్నారని తెలిపారు. అమాయకులైన అర్చకులను సస్పెండ్ చేసిన అధికారులు, ఈవో, సీనియర్ అసిస్టెంట్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని అంబటి మురళి ప్రశ్నించారు. దొంగ ఎవరో తెలిసినా కావాలనే ఆ విషయాన్ని బయటపెట్టడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. తాను సెప్టెంబర్ 3న మంగళసూత్రాన్ని అందిస్తానని, ఇప్పటికే ఈ రోజు మంగళసూత్రాలను సమర్పించామని అంబటి మురళి తెలిపారు. తనపై పరువు నష్టం దావా వేసి రూ.5 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారని చెప్పారు. తన రాజకీయ జీవితాన్ని సెకనుకు ఐదు పైసలుగా లెక్క కట్టారని, ఆ ఐదు పైసలు తానే ఇస్తానంటూ వ్యంగ్యంగా స్పందించారు. పాపాల భైరవుణ్ణి శిక్షించవా తల్లి: ఆరే శ్యామల “పాపాల భైరవుణ్ణి శిక్షించవా తల్లి” అంటూ వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల వ్యాఖ్యానించారు. మంగళసూత్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామల మాట్లాడుతూ, అమ్మవారికి మంగళసూత్రం సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దొంగతనంతో సంబంధం లేని అర్చకులను ఈ వ్యవహారంలో భాగస్వాములను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం జరిగిన విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియదా అని ప్రశ్నించారు. అర్చకుల ఉసురు తగులుతుందని, కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు ఉండవని ఆరే శ్యామల పేర్కొన్నారు. అసలు దొంగను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేశారు.