విశాఖను ‘క్రైమ్ & డ్రగ్స్ రాజధాని’గా మార్చిన చంద్రబాబు కూటమి సర్కార్

వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజం.

విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.

అమరావతి కోసం విశాఖను సర్వనాశనం చేస్తున్నారు..

గిరిజన విద్యార్థులపై అర్ధరాత్రి దౌర్జన్య కాండ సిగ్గుచేటు 

వెన్నుపోటు పార్టీ కూటమి పాలనపై  కేకే రాజు ఆగ్రహం.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖపట్నం నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తోందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో విశాఖ అభివృద్ధి పేపర్లకే పరిమితమైందని, అమరావతి అభివృద్ధి కోసమే విశాఖను వెనక్కి నెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ మారికవలస గురుకుల పాఠశాల నుంచి 480 మంది గిరిజన విద్యార్థులను అత్యంత దౌర్జన్యంగా ఖాళీ చేయించడం రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. గత రెండేళ్ల కూటమి పాలనలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, భూదోపిడీలకు విశాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని, తీవ్రమైన వాయు కాలుష్యం, తాగునీటి ఎద్దడితో నగర ప్రజలు అల్లాడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కేకే రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే...

- అమరావతిపై ప్రేమతో విశాఖపై కక్ష..

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేశారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక విశాఖను డ్రగ్స్, గంజాయి, భూమాఫియా, కల్తీ మద్యానికి రాజధానిగా మార్చేశారు. అవినీతిమయమైన అమరావతి కుంటుపడుతుందనే దురుద్దేశంతోనే విశాఖను దెబ్బతీస్తున్నారు. పెట్టుబడులు, పరిశ్రమల పేరుతో ఇక్కడి వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను కార్పొరేట్ శక్తులకు పప్పుబెల్లాల్లా దోచిపెడుతున్నారు.

- మారికవలసలో అర్ధరాత్రి వేళ గిరిజన విద్యార్థులపై దౌర్జన్యం..

నిన్న రాత్రి 10 గంటల సమయంలో మారికవలస గురుకుల పాఠశాలలో నిద్రిస్తున్న విద్యార్థులపై అధికారులు విరుచుకుపడి బెదిరింపులకు దిగారు. 'మా కాళ్లు పట్టుకుని ఏడ్చినా వదిలేది లేదు, వెంటనే బ్యాగులు సర్దుకోండి' అంటూ 480 మంది గిరిజన విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించారు. అర్ధరాత్రి వేళ కొండకోనల్లో ఉండే తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయబ్రాంతులకు గురిచేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనుకుంటే కొత్త ప్రాంగణం నిర్మించాలి గానీ, పసిపిల్లలను ఇలా అర్ధరాత్రి రోడ్డున పడేస్తారా? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక బ్రిటిష్ పాలనలో ఉన్నామా? దీనిపై విద్యాశాఖ మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి.
 
- గంజాయి, డ్రగ్స్ విక్రయాలతోనే సంపద సృష్టి..

విశాఖలో వీధివీధికీ గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతున్నాయి. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఈ గంజాయి, బెల్ట్ షాపుల ద్వారానే ఆదాయం సమకూర్చుకుంటున్నారు. నగర శివార్లలోని రిసార్టులలో టీడీపీ నేతలు రేవ్‌ పార్టీలు చేసుకుంటూ, అమ్మాయిల కోసం కత్తులతో పొడుచుకునే స్థాయికి దిగజారారు. కంచరపాలెంలో గంజాయి మత్తులో వ్యాపారులు ఒక వ్యక్తిని కొట్టి చంపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అగనంపూడిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగలేదు.
 
- గుక్కెడు నీరు దొరకదు.. గంజాయి మాత్రం విచ్చలవిడిగా దొరుకుతుంది..

విశాఖలో గంజాయి, డ్రగ్స్ సులభంగా దొరుకుతున్నాయి కానీ, తాగడానికి గుక్కెడు మంచి నీరు దొరకని దౌర్భాగ్య స్థితి నెలకొంది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. నగర పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల గోడును గాలికొదిలేశారు. నీటి కొరతను ఆసరాగా చేసుకుని ట్యాంకర్ల మాఫియా సాగిస్తున్న దోపిడీకి ప్రభుత్వ వైఫల్యమే కారణం.

- కేజీహెచ్‌ను నిర్వీర్యం చేసి.. ప్రైవేట్ దోపిడీకి తెరలేపారు..

గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ హయంలో వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి కేజీహెచ్‌ను మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాయికి తీర్చిదిద్దితే, ఈ కూటమి సర్కార్ దానిని అత్యంత దయనీయ స్థితికి దిగజార్చింది. మందుల కొరత, డాక్టర్ల గైర్హాజరీతో రోగులు అల్లాడుతున్నారు. పేద రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తూ కమిషన్ల దందా నడుపుతున్నారు. వైద్యం, విద్య, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

- దేశంలోనే అత్యధిక వాయు కాలుష్యం విశాఖలోనే..

కూటమి సర్కార్ వచ్చిన గత ఏడాది కాలంగా విశాఖలో వాయు కాలుష్యం ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నగరాలను మించి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పోర్టు కార్యకలాపాలు, పారిశ్రామిక వ్యర్థాల విషయంలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలను గాలికొదిలేయడం వల్లే వేలాది మంది శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
 
- ఉత్తరాంధ్రను కాపాడుకోవడానికి పోరాటాలకు సిద్ధం..

విద్యాశాఖ మంత్రి లోకేష్ తన శాఖ సమస్యలను వదిలేసి అన్ని విషయాలపైనా మాట్లాడుతున్నారని... రాష్ట్రంలో పాఠశాలలు, వసతి గృహాలను మూసివేస్తూ ఉన్నత విద్యా వ్యవస్థను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారని కేకే రాజు తీవ్రంగా ఆక్షేపించారు.  ప్రజా సమస్యలపై పోరాడే వారిపై అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.   ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని కేకే రాజు స్పష్టం చేశారు.

Back to Top