తాడేపల్లి: గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పట్టుబడుతోందని, చివరకు పోలీసుల వాహనాల్లోనే గంజాయి పట్టుబడిన పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయిని అరికట్టడం చేతకాకపోతే హోంమంత్రి అనిత తన పదవికి రాజీనామా చేయాలని నాగమల్లేశ్వరి డిమాండ్ చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... గంజాయిపై ఉక్కుపాదం ఎక్కడ? అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, డ్రోన్లతో గంజాయి సాగును అరికడతామని సీఎం చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనిత పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి ఏ స్థాయిలో విచ్చలవిడిగా లభిస్తుందో వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలే చెబుతున్నాయి. మీరు ఉక్కుపాదం మోపలేదు.. గంజాయి పాదం మోపారు. చివరికి గంజాయిని అరికట్టాల్సిన పోలీసులే గంజాయితో పట్టుబడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై ఇప్పటివరకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? పోలీసులే గంజాయిని తరలిస్తుంటే హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు? పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతున్నారంటే వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ఈ వ్యవహారాన్ని అరికట్టడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది? హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పిన హోంమంత్రి అనిత ఇప్పుడు ఎక్కడున్నారు? మీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే గంజాయి పట్టుబడుతుంటే కనీసం బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? జగన్ ని విమర్శించడానికి, ఆయనపై ప్రెస్‌మీట్లు పెట్టడానికి వచ్చే హోంమంత్రి.. గంజాయి అంశంపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు? రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా కొత్త రూపాల్లో జరుగుతోంది. లిక్విడ్ గంజాయి కూడా పట్టుబడుతున్న పరిస్థితి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో సుమారు రూ.75 లక్షల విలువైన 6 కేజీల లిక్విడ్ గంజాయి పట్టుబడిన ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట, ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాల్లోనూ గంజాయి పట్టుబడిన సందర్భాలున్నాయి. ముఖ్యమంత్రి ఇలాకాలోనే గంజాయి అడ్డగోలుగా దొరుకుతోందని సొంత వెన్నుపోటు పార్టీ నాయకులే వెళ్లి కలెక్టర్ కి కంప్లైంట్ కూడా ఇచ్చారు. జగన్ హయాంలో గంజాయిపై ఉక్కుపాదం వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గంజాయిపై కఠిన చర్యలు తీసుకున్నారు. సుమారు 11,500 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశామని, పోలీసులు దాదాపు 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించారు. గంజాయి కేసుల్లో 13,210 మందిని అరెస్ట్ చేసి, 2,950 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకున్నాం. హోంమంత్రి పదవికి ఉన్న బాధ్యత, ప్రాధాన్యతను గుర్తించి అనిత తన శాఖపై దృష్టి పెట్టాలి. జగన్ గారిని విమర్శించడానికి మాత్రమే హోంశాఖను ఉపయోగించకుండా, లా అండ్ ఆర్డర్, గంజాయి, డ్రగ్స్, మహిళలు, యువత భద్రతపై దృష్టి పెట్టాలి. ఆపరేషన్ పరివర్తన్‌తో గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టి, ప్రత్యామ్నాయ పంటల వైపు వారిని మళ్లించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం సుమారు రూ.144 కోట్లు ఖర్చు చేసి గిరిజనులను ప్రత్యామ్నాయ వ్యవసాయం వైపు ప్రోత్సహించడం జరిగింది. సోహైల్ ఎలా తప్పించుకున్నాడు? గంజాయిని అరికట్టేందుకు డ్రోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. పోలీసులే గంజాయితో పట్టుబడుతున్నప్పుడు వారిపై చర్యలు తీసుకోకుండా రక్షించే ప్రయత్నం చేయడం సరికాదు. జైలు నుంచి సోహైల్ తప్పించుకున్న ఘటనపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జూన్ 9న సోహెల్ తప్పించుకున్నట్లు చెబుతున్నా ఇప్పటివరకు అతని ఆచూకీ కనిపెట్టలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. జైలు నుంచి ఖైదీ తప్పించుకునే పరిస్థితి ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రభుత్వం ఏ విధంగా భరోసా ఇస్తున్నట్టు? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిని అరికట్టేందుకు తీసుకున్న చర్యలను ఆధారాలతో సహా చెప్పడానికి వైయస్ఆర్‌సీపీ సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా తమ హయాంలో ఎన్ని ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేసిందో, ఎంతమందిని అరెస్ట్ చేసిందో, ఎంత మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుందో ప్రజల ముందు వెల్లడించగలరా? ఇప్పటికైనా గంజాయిపై చిత్తశుద్ధితో పనిచేయాలి రాష్ట్రంలో యువతను గంజాయి, డ్రగ్స్ నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలి. చేతకాకపోతే వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన గంజాయి నిరోధక చర్యలనే అమలు చేయాలి. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గంజాయి నుంచి రాష్ట్రాన్ని, యువతను, మహిళలను కాపాడేందుకు వైయస్ఆర్‌సీపీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని నాగమల్లేశ్వరి స్పష్టం చేశారు.