తాడేపల్లి: గిరిజన విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు (ప్లెయిన్ ఏరియా) గుండా సురేంద్ర ధ్వజమెత్తారు. విశాఖపట్నం జిల్లా మారికవలస గురుకుల పాఠశాలలో చదువుతున్న 480 మంది గిరిజన విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలో అర్ధరాత్రి సమయంలో పోలీసుల సహాయంతో బలవంతంగా ఖాళీ చేయించి బస్సుల్లో తరలించడం దారుణమని మండిపడ్డారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు పేరుతో మంచి వాతావరణంలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్న గిరిజన బిడ్డల చదువులకు ఆటంకం కలిగించడం ఏమాత్రం సమంజసం కాదని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో గుండా సురేంద్ర ఏమన్నారంటే.. - గిరిజన విద్యార్థులను అర్ధరాత్రి తరలించడం ఏమిటి? “మారికవలస గురుకుల పాఠశాలలో 480 మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. మంచి వాతావరణం, నాణ్యమైన విద్య, మౌలిక వసతులతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్య అందుతున్న ఈ పాఠశాలలో తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు నమ్మారు. అలాంటి విద్యార్థులను విద్యా సంవత్సరం మధ్యలో అర్ధరాత్రి 10 గంటలకు పోలీసుల సహాయంతో భయభ్రాంతులకు గురిచేసి బస్సుల్లో తరలించడం ఏమిటి? పిల్లలు అక్కడే చదువుకుంటామని రెండు చేతులు జోడించి వేడుకున్నా అధికారులు కనికరం చూపకపోవడం అత్యంత దారుణం. పాలకుల పిల్లలు, అధికారుల పిల్లలు అయితే ఇదే విధంగా అర్ధరాత్రి తరలించేవారా?” - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మేం వ్యతిరేకం కాదు “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు. అదే కేంద్రాన్ని వేరే భవనంలో లేదా ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చేయవచ్చు. గిరిజన విద్యార్థులను వారి పాఠశాల నుంచి తొలగించి అక్కడే ఏర్పాటు చేయడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. బాపట్ల జిల్లా జగన్నాథపురం ఎస్టీ కాలనీలో పాఠశాల ఎదురుగా శ్మశానం, పక్కనే పశువైద్యశాల ఉన్నా ప్రభుత్వం కనీస పరిష్కారం చూపడం లేదు. పాఠశాలకు ప్రహరీ నిర్మించడం, పశువైద్యశాలను తరలించడం వంటి చర్యలు చేపట్టకుండా గిరిజన విద్యార్థుల చదువులతో చెలగాటం ఆడటం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం.” - గిరిజన సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదు “వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో గిరిజనుల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని బైక్ అంబులెన్స్‌లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకొచ్చారు. పాడేరులో సుమారు రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, కురుపాంలో రూ.153 కోట్లతో ఇంజినీరింగ్ కాలేజీ వంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ నేడు గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు లేక టార్చ్‌లైట్‌తో వైద్యం చేసే పరిస్థితి వచ్చింది. గిరిజన సంక్షేమ శాఖపై కనీస పట్టు లేకుండా మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యవహరిస్తున్నారు. తన శాఖలో గిరిజన విద్య, వైద్య రంగాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మారికవలస గురుకుల విద్యార్థులను అర్ధరాత్రి తరలించడం, గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం ఇందుకు నిదర్శనం. శాఖపై పట్టు సాధించి గిరిజనుల సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రి.. తన నిర్లక్ష్యంతో ‘సున్నా రాణి’గా మిగిలారు. ఇప్పటికైనా గిరిజనుల విద్య, వైద్యం, సంక్షేమంపై దృష్టి సారించి, మారికవలస గురుకుల పాఠశాల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం మానుకోవాలి. లేనిపక్షంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతాం.”