కావలి: అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు, దుకాణాలను ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేసి వారి జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని కావలి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీ తుమ్మలపెంట సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి అంటే పేదల ఇళ్లు, దుకాణాలు కూల్చివేయడం కాదని, వారి కన్నీళ్లపై రోడ్లు నిర్మించడం అభివృద్ధి కాదని స్పష్టం చేశారు. ఏళ్లుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వారి జీవనోపాధిని ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా దెబ్బతీయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి దుకాణదారుడికి తగిన నష్టపరిహారం అందించాలని, రహదారి వెంబడి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి తిరిగి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. పేదల కడుపు కొట్టి చేసే అభివృద్ధిని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ వారి తరఫున నిలబడి ప్రజా పోరాటం చేస్తుందని తెలిపారు. అధికారంలో ఉన్నవారు కేవలం కూల్చివేతలతో అభివృద్ధి ముసుగులో ముందుకు వెళ్లకుండా, పేదల జీవనోపాధిని కాపాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల వైయస్ఆర్‌సీపీ కన్వీనర్ వాయల తిరుపతి, పార్టీ ముఖ్య నాయకులు, తుమ్మలపెంట గ్రామానికి చెందిన నాయకులు, కాపు సామాజికవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.