నరసాపురం: చంద్రబాబు నాయుడు నిన్నటి నరసాపురం నియోజకవర్గ పర్యటనలో ఆయన్ను మంత్రులు పొగడటం, మంత్రులను అధికారులు పొగడటం తప్పితే ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని వైయస్ఆర్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి కొత్తగా ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా, ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించకుండా వెళ్లడం ఈ ప్రాంత చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోతుందని ఆక్షేపించారు. నరసాపురంలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ప్రసాదరాజు మాట్లాడుతూ, అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టించుకోవడం, సమస్యలకు మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులపై నెపం వేయడం బాబు మార్క్ దిగజారుడు పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని ఎద్దేవా చేసారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 60 లక్షలకుపైగా పెన్షన్లు అందించామని గుర్తు చేసారు. కానీ ఈరోజు సుమారు 50 లక్షల పెన్షన్లకే కూటమి ప్రభుత్వం పరిమితం చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంతోమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నా సరే, గత రెండేళ్లలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవని ప్రసాదరాజు ఎండగట్టారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 11 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గానీ, ఒక్క ఇళ్లు నిర్మించిన దాఖలాలు కూడా లేవని పెదవి విరిచారు. అయినా సరే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు హౌసింగ్ డిపార్ట్‌మెంట్ పనితీరు బాగుందని, శానిటేషన్ బాగుందని చప్పట్లు కొట్టించుకోవడం విడ్డూరంగా ఉందని ముదునూరి ప్రసాదరాజు ఆక్షేపించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... అక్వా రంగానికి అదే మొండిచేయి చుట్టుముడుతున్న కరువు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న సమంయలో ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఆక్వా రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ ఫీడ్ ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రూ.1.50కే ఆక్వా రైతులకు విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. కానీ అదే పథకాన్ని తామే కొత్తగా తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతులకు సుమారు రూ.900 కోట్ల సబ్సిడీ అందించాం. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ పేరుతో రైతులకు అందాల్సిన సబ్సిడీని తగ్గించే ప్రయత్నం చేశారు. ఒకవైపు విద్యుత్ ఖర్చులు, మరోవైపు ఫీడ్ ధరలు పెరుగుతున్నాయి. ఫీడ్ ధరలు 10 నుంచి 14 రూపాయల వరకు పెంచిన పరిస్థితులు ఉన్నాయి. ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై మరింత భారం మోపుతోంది. ఆక్వా రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా చెప్పాలి. కాళీపట్నం భూముల విషయంలో కూడా కొత్తగా జీవోలు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. గత ప్రభుత్వంలోనే నరసాపురం హార్బర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చాం. సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని హార్బర్ కోసం కేటాయించేందుకు అప్పుడే నిర్ణయం తీసుకున్నాం. భూమి లేకుండా గత ప్రభుత్వం హార్బర్‌కు పరిపాలనా అనుమతులు ఇచ్చిందా? ఇప్పుడు కొత్తగా తామేదో సాధించినట్లు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీకి కూడా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పరిపాలనా అనుమతులు ఇచ్చింది. అవసరమైన నిధుల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల కోడ్ సమయంలో పెండింగ్ బిల్లుల కోసం సుమారు రూ.20 కోట్లు విడుదలయ్యాయి. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ నిర్మాణానికి కొత్తగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఆక్వా యూనివర్సిటీని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటికీ బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న పనులను ఎందుకు పూర్తి చేయడం లేదు? గత ప్రభుత్వ హయాంలో నరసాపురం నియోజకవర్గంలో సుమారు రూ.3,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి కొత్తగా ఎంత నిధులు మంజూరు చేశారో ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. పైసా విదల్చని పర్యటన ఎందుకు ? నియోజవకవర్గంలో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులు.. ఏ రంగంలో చూసినా పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గానికి కొత్తగా ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి పర్యటించి వెళ్లడం నరసాపురం ప్రజలను అవమానించడమే. తాగునీటి సమస్య పరిష్కారం కోసం గతంలోనే రూ.82 కోట్ల నిధులు మంజూరు చేయించాం. ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించాం. కొన్ని ట్యాంకులు పూర్తయ్యాయి. కానీ రెండేళ్లుగా వాటికి కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయండి. మేము అభ్యంతరం చెప్పం. ఆ మంచి పేరు మీరే తీసుకోండి. పోలవరం ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కూడా పనులు కొనసాగాయి. మీరు పూర్తి చేస్తే ఆ ఘనత మీకే దక్కుతుంది. అదే విధంగా నరసాపురంలో కూడా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయండి. ప్రజలకు అభివృద్ధి అందించండి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. పెన్షన్లు ఇవ్వండి. నిరుద్యోగులకు న్యాయం చేయండి. రైతులను, ఆక్వా రైతులను ఆదుకోండి. తాగునీరు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించండి. నరసాపురం నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయండి. ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు కాకుండా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి వినియోగించాలి. లేకుంటే ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే ఈ ప్రభుత్వానికి సమాధానం చెబుతారు. స్థానిక ఎన్నికలకు భయపడేది లేదు.. ఆపాలని చెప్పలేదు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా వైయస్ఆర్‌సీపీకి ఎలాంటి భయం లేదు. నరసాపురం సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ స్థానిక ఎన్నికలకు భయపడుతోందని వ్యాఖ్యానించడం సరికాదు . మేము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీ చేస్తాం. ఒంటరిగానే పోటీ చేస్తాం. ఓటర్ల జాబితా ప్రక్షాళన పూర్తయ్యే వరకు కొంత సమయం తీసుకుని, జెన్యూన్ ఓటర్లతో కొత్త జాబితా వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే కోరుతున్నాం. ఎన్నికలను ఆపాలని మేము ఎక్కడా చెప్పడం లేదు. వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు భయపడుతోందని చెప్పడం పూర్తిగా అవాస్తవం. గతంలో స్థానిక ఎన్నికలకు ఎవరు దూరంగా ఉన్నారో ప్రజలకు తెలుసు. మేము మాత్రం ప్రజల తీర్పును ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం.