తాడేపల్లి: రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చి రైతులు పంటలు నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం వర్షపాతం లోటు, 91 శాతం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులను ఆదుకునే కనీస చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. సాగునీరు ఇవ్వకుండా రైతులతో పెట్టుబడులు పెట్టించి, పంటలు ఎండిపోయిన తర్వాత కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు నీటి భద్రత, రైతులకు పంటల బీమా, గిట్టుబాటు ధర, కంటింజెన్సీ ప్రణాళిక వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. మరోవైపు బీసీలకు తాము కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని, గంజాయి నియంత్రణలో తమ ప్రభుత్వ చర్యలను వివరించారు. చంద్రబాబు పాలనలో రైతులు, బీసీలు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రజలు గమనించాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, కృష్ణా డెల్టా–రాయలసీమకు సాగునీటి సమస్య, రైతులకు పంటల బీమా, కంటింజెన్సీ ప్రణాళిక అమలు కాకపోవడం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యం, బీసీ పథకాల రద్దు, బీసీ నేతలపై అక్రమ కేసులు, రాష్ట్రంలో గంజాయి మాఫియా విస్తరణ, అద్దంకి ఘటన తదితర అంశాలపై శ్రీ వైయస్ జగన్ మాట్లాడారు. మీడియా సమావేశంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే.. రాష్ట్రంలో కరువు తీవ్రతపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ‘‘ఇవాళ రాష్ట్రంలో కరువు ఎంత తీవ్రంగా ఉందన్నది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి కరువు తీవ్రతలో చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తీరు ఎలా ఉందో అందరికీ అర్థమవుతుంది. ఇంత తీవ్రంగా కరువు ఉన్నప్పటికీ, కరువు ఇంత తీవ్రంగా ఉందని, దానికి సంబంధించిన ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. జూన్, జూలై, ఆగస్టు 25, 26వ తేదీల వరకు తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు మైనస్ 52 శాతంగా ఉంది. కోస్తాంధ్రలో మైనస్ 47.18 శాతం, రాయలసీమలో మైనస్ 52.36 శాతం లోటు ఉంది. ఏ జిల్లా చూసినా లోటు కనిపిస్తున్న పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏవీ చేపట్టలేదు.’’ - 625 మండలాల్లో లోటు వర్షపాతం ‘‘జూన్ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా, ఇప్పటివరకు 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. అంటే 91 శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ 625 ప్రభావిత మండలాల్లో 434 మండలాల్లో మైనస్ 19 శాతానికి మించి లోటు వర్షపాతం ఉంది. మరో 191 మండలాల్లో పరిస్థితి తీవ్ర లోటుగా ఉంది. జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది.’’ - కృష్ణా డెల్టా రైతులను ప్రభుత్వం మోసం చేసింది ‘‘ఖరీఫ్ సీజన్ జూన్‌లో ప్రారంభమవుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న పంటలకు నీళ్లు ఇస్తామని చెబుతూ ప్రకాశం బ్యారేజీ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులు ఇచ్చి ఫొటోలు దిగి ప్రభుత్వంలోని మంత్రులు పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్లను నమ్మి నీళ్లు ఇస్తారని కృష్ణా డెల్టా రైతులే కాకుండా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల రైతులు కూడా పెట్టుబడులు పెట్టారు. అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయానికి వేగంగా అడుగులు వేశారు. ఈరోజు వేసిన నార్లన్నీ ఎండిపోయిన పరిస్థితి. ప్రతి ఎకరాకు రైతు కనీసం రూ.15 వేల వరకు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎల్‌నినో ప్రభావం ఉందని తెలుసు. జూన్‌లో డెఫిసిట్ వర్షాలు పడ్డాయని తెలుసు. జూన్‌లో 25 శాతం డెఫిసిట్ ఉందని, జూలై 10 నాటికి జూలై నెలలోనే 66 శాతం డెఫిసిట్ ఉందని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పోజులు ఇచ్చి, రైతులు నష్టపోయే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు?’’ - శ్రీశైలం నుంచి నీటిని ఎడాపెడా విడుదల చేస్తే రాయలసీమకు నీళ్లు ఎలా? ‘‘రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం ఎంత దారుణంగా ఉందంటే.. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. ఆగస్టు 11వ తేదీన 879.50 అడుగులు, అంటే దాదాపు 880 అడుగులకు నీళ్లు వచ్చినా పోతిరెడ్డిపాడు ద్వారా కిందికి రాయలసీమ ప్రాజెక్టులకు సరిపడా నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేయాలంటే 880 అడుగుల నీటి మట్టం ఉంటే 44 వేల క్యూసెక్కుల పూర్తి డిశ్చార్జి సామర్థ్యంతో నీళ్లు కిందికి వదలచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు శ్రీశైలం నుంచి ఎడాపెడా కరెంటు జనరేషన్ కోసం 48 వేల క్యూసెక్కులు డ్రా చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. 48 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో, 7 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే నికరంగా దాదాపు 35 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854 అడుగుల దిగువకు చేరిపోతుంది. ఆ తర్వాత రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది.’’ - రాయలసీమ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువ ‘‘తెలుగుగంగ కాలువపై ఆధారపడిన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 180 టీఎంసీలు. ఇప్పుడున్న నీళ్లు కేవలం 55 టీఎంసీలు మాత్రమే. ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్ కింద ఉన్న గోరుకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్ల టోటల్ స్టోరేజ్ కెపాసిటీ 59 టీఎంసీలు. ఇప్పుడున్న నిల్వ కేవలం 31 టీఎంసీలు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కింద ఉన్న జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి ప్రాజెక్టుల గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 43 టీఎంసీలు. ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. మరి శ్రీశైలం నుంచి ఎడాపెడా నీళ్లు ఈ మాదిరిగా తోడేస్తూ పోతే 854 అడుగుల కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు?’’ - రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు చేపట్టాం? ‘‘ఇలాంటి పాలకులు ఉంటారు కాబట్టే రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయలసీమ ప్రజలకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మేము కట్టడం మొదలెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు నాగార్జునసాగర్ చూద్దాం. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి అయినా, కృష్ణా డెల్టా ప్రాంతానికి ప్రకాశం బ్యారేజీ నుంచి అయినా చంద్రబాబు నాయుడు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టులో లెఫ్ట్, రైట్, సెంటర్ ఇల్లీగల్‌గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారు.’’ - రైతులకు పంటల బీమా ఎక్కడ? ‘‘రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైయస్ఆర్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2022–23 ఖరీఫ్ సీజన్‌లో మా ప్రభుత్వ హయాంలో కోటి 18 లక్షల దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తించాయి. 2026–27 ఖరీఫ్‌లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందకు వచ్చాయి. అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకుంటే తప్ప పరిస్థితి లేదు. 30 నుంచి 35 శాతం కూడా ఇన్సూరెన్స్ కవర్‌లోకి రావడం లేదని రికార్డులు స్పష్టంగా చూపిస్తున్నాయి.’’ - రైతు భరోసా కేంద్రాలు, ఆగ్రి ల్యాబ్స్ నిర్వీర్యం ‘‘క్రాప్ ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను నాశనం చేశారు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు. ఆగ్రి ల్యాబ్స్‌ను నిర్వీర్యం చేశారు. మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ ఉండేది. ప్రతి ఆర్‌బీకే పరిధిలో గిట్టుబాటు ధరలు డిస్‌ప్లే అయ్యేవి. ఆ పరిధిలో గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఉంటే అగ్రికల్చరల్ అసిస్టెంట్ వెంటనే సీఎం యాప్ ద్వారా సమాచారం ఇచ్చేవాడు. వెంటనే జాయింట్ కలెక్టర్, మార్క్‌ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యత కలిగి ఉండేవారు జోక్యం చేసుకునేవారు. ఆ ఆర్‌బీకే పరిధిలోనే వెంటనే పంటలు కొనుగోలు చేసేవారు. పోటీని సృష్టించేవారు. ఆ పోటీ వల్ల ధరలు పెరిగేవి. ఈ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మా ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదేళ్లలో ఈ విధమైన జోక్యంతో రూ.7,800 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు తోడుగా నిలబడ్డాం.’’ - అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు అన్యాయం ‘‘రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ఏమిటి? పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం రూ.20 వేలు ఇస్తానని చెప్పారు. ఈ మూడు సంవత్సరాలకు రూ.60 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ.19 వేలు. రూ.41 వేలు ఎగ్గొట్టారు. ఇంత తీవ్రమైన పరిస్థితుల నేపథ్యంలో రైతులను, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారా? అసలు ఆదుకునే ప్లాన్ ఏదైనా ఉందా?’’ - కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు అమలు కాలేదు? ‘‘జూన్‌లో 25 శాతం డెఫిసిట్, జూలైలో 68 శాతం డెఫిసిట్. జూన్, జూలై రెండు నెలల యావరేజ్ తీసుకుంటే 52 శాతం డెఫిసిట్. జూలై ముగిసేలోగానే 52 శాతం డెఫిసిట్ కనిపిస్తున్నప్పుడు మీ కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు కిక్ ఇన్ కాలేదు? కనీసం అప్పుడైనా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చి ఉంటే, ఆగస్టులో, సెప్టెంబర్‌లో కొద్దో గొప్పో పడే వర్షాలతో ప్రత్యామ్నాయ పంటలతో రైతు కొంతైనా బాగుపడే పరిస్థితి ఉండేది. అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసలు, జొన్నలు, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికే పంటలు వేసుకుని దెబ్బతిన్న వారికి ఏం సహాయం చేశారు?’’ - కరువు నిర్వహణకు చర్యలు ఎక్కడ? ‘‘డ్రౌట్ మానిటరింగ్ సెంటర్లు పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉండాలి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కంటింజెన్సీ ప్లాన్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉండాలి. క్రైసిస్ మేనేజ్‌మెంట్ ప్లాన్స్ అమలులోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లాలో డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ఏర్పాటు అయి ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్ పంపిణీ అయి ఉండాలి. రైతులకు అందాలి. వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీలకు అదనంగా ఉపాధి హామీ పనులు ఈ పాటికే ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రారంభమై ఉండాలి. జిల్లాల వారీగా పశువులకు మేత అందుబాటులో ఉందో లేదో చూసుకుని ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు కాలేదు?’’ బీసీలకు నిజమైన ప్రాతినిధ్యం ఇచ్చింది వైయస్ఆర్‌సీపీ - 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు సిద్ధమయ్యాం ‘‘స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి నిజంగా 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నంబర్ 176 ఇచ్చి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు, తన ప్రభుత్వంలో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న బిర్రు ప్రతాప్‌రెడ్డి ద్వారా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించారు. కోర్టు తీర్పుల నేపథ్యంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కొనసాగించలేని పరిస్థితి వచ్చింది. కోర్టుకు పోయేది ఆయనే. కొట్టివేయించేది ఆయనే. మళ్లీ దొంగ ఏడుపులు ఏడుస్తూ ‘మీరు కోర్టుకు పోవద్దండి’ అని చెప్పేది కూడా ఆయనే. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది.’’ - 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ‘‘కోర్టులు కొట్టేసిన బీసీ రిజర్వేషన్ల మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలి అని చెప్పి, మాకు మేముగానే 34 శాతం మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించి మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. మా క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు. అంటే 40 శాతం మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఈ ఐదు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, అందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చాం. రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం.’’ - రాజ్యసభ, లోక్‌సభలోనూ బీసీలకు పెద్దపీట ‘‘వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలను పంపించింది. ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం ఇచ్చాం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించలేదు. 25 లోక్‌సభ సీట్లలో 11 సీట్లు బీసీలకే ఇచ్చాం. అంటే 44 శాతం బీసీలకే ఇచ్చాం.’’ - స్థానిక సంస్థల్లో బీసీలకు భారీ ప్రాతినిధ్యం ‘‘58 ఎమ్మెల్సీ స్థానాల్లో 28 స్థానాలు బీసీలకు ఇచ్చాం. అంటే 48 శాతం. 13 జెడ్పీ చైర్మన్ పదవులు ఉంటే ఆరు, అంటే 46 శాతం బీసీలకు ఇచ్చాం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో తొమ్మిది, అంటే 69 శాతం బీసీలకే ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానాల్లో 239, అంటే 38 శాతం బీసీలకే ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల్లో 44, అంటే 53 శాతం బీసీలకే ఇచ్చాం. 639 జెడ్పీ స్థానాల్లో 227, అంటే 36 శాతం బీసీలకే ఇచ్చాం. 8,239 ఎంపీటీసీ స్థానాల్లో 3,361, అంటే 41 శాతం బీసీలకే ఇచ్చాం. 10,536 సర్పంచ్ స్థానాల్లో దాదాపు 4,000 మంది బీసీలే. అంటే 38 శాతం. 196 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76, అంటే 39 శాతం బీసీలకే ఇచ్చాం. 137 ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే ఇచ్చాం. అంటే 37 శాతం.’’ - 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం ‘‘139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశాం. ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి ద్వారా ఆయా కులాలకు నేరుగా డీబీటీ ద్వారా ప్రయోజనం కల్పించే కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది మా హయాంలోనే. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం. మహిళలకు 50 శాతం వాటా చట్టం చేసి తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే.’’ - బీసీల కోసం పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు ‘‘బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంట్‌లో వైయస్ఆర్‌సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించాం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాం.’’ - బీసీల ఖాతాల్లోకి రూ.1.82 లక్షల కోట్లు ‘‘వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపితే రూ.1.82 లక్షల కోట్లు బీసీలకే పంపించాం. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాల ద్వారా బీసీ కుటుంబాలకు ఎప్పుడూ జరగని మంచి చేశాం.’’ -బీసీ నేతలపై అక్రమ కేసులతో అణచివేత సీదిరి అప్పలరాజుపై కేసు: ‘‘ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు. రాజకీయంగా బీసీలు ఎవరైనా ఎదుగుతున్నారని అనిపిస్తే వారిని ఓడించుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఒక యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చారు. అది బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ల పిల్లాడు తన కొడుకుతో చేసిన బైక్ యాక్సిడెంట్‌ను హత్యాయత్నం కేసుగా మార్చి, కుట్రకోణాన్ని జోడించి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టించారు. ఒక మహిళా ఎస్‌ఐని అడ్డుపెట్టుకుని జరగనిదాన్ని జరిగినట్టుగా చూపించి, చింతాడ రవిపై కేసు పెట్టి జైల్లో పెట్టారు.’’ - ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై కేసు ‘‘కర్నూలులో టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఆయన భార్య దుస్తులను చింపేయించి, అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరుపాక్షిపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక బీసీ కార్యకర్త ఫోన్ చేసి ‘అన్నా, నన్ను అటాక్ చేస్తున్నారు, నా ఇంటి మీద పడుతున్నారు’ అని ఆవేదనతో చెబితే ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు పలికేవాడు లేడు. మళ్లీ ఆ కార్యకర్త ఫోన్ చేసి ‘అన్నా, పరిస్థితి విషమిస్తోంది’ అని చెప్పాడు. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ఆ కార్యకర్తను కాపాడుకోవడానికి కారులో ఎక్కించుకుని వస్తున్నప్పుడు దారిలో ఎమ్మెల్యేపై అటాక్ చేశారు. ఎమ్మెల్యే తమ్ముడి చెయ్యి విరగగొట్టారు. ఆ తర్వాత అదే ఎమ్మెల్యే ఇంటిపైకి తెల్లవారుజామున వందల మంది పోలీసులతో వచ్చి ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.’’ - కారుమూరి కుటుంబంపై కేసులు ‘‘యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్‌ను అన్యాయంగా తప్పుడు కేసులతో జైలుకు పంపించారు. జిల్లా స్థాయిలో జరిగే కాంట్రాక్టులు, టెండర్ల విలువ ఎంత ఉంటుందో అంత విలువ ఉన్న కేసులో ఈయనను ఇరికించి, లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ అని చెప్పి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌పై, ఆయన తండ్రిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడుకు బీసీల మీద ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తారా?’’ - ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో బీసీ విద్యార్థులకు ఇబ్బందులు ‘‘విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.9 వేల కోట్లు. పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. అత్యధికంగా నష్టపోయింది బీసీలే. పట్టించుకునే నాథుడు లేడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. తాను చేస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లు మోసాలు. ఇచ్చిన బాండ్లు చెత్తబుట్టలో పడేశారు. మేనిఫెస్టోతో సహా అన్నీ పక్కన పెట్టేశారు.’’ - గంజాయి మాఫియాగా రాష్ట్రాన్ని మార్చేశారు మట్టి నుంచి డ్రగ్స్ వరకు మాఫియాలే ‘‘ఒకవైపు తప్పుడు కేసులు పెడుతున్నారు. రాజకీయంగా వేధింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నది ఏమిటి? మట్టి మాఫియా, సాండ్ మాఫియా, సిలికా, క్వార్ట్జ్, లాటరైట్ మాఫియా.. అన్నీ మాఫియాలే. లిక్కర్ మాఫియా, అధిక రేట్లకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను తమకు నచ్చిన వాళ్లకు, తమ బంధువులకు కట్టబెట్టడం. పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను, మెడికల్ కాలేజీలను అమ్మే కార్యక్రమం. ఇవన్నీ కాకుండా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపుల పేరుతో లిక్కర్, కల్తీ లిక్కర్.. ప్రతి ఊరికి, ప్రతి వీధికి వ్యాపించాయి. ఈరోజు రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకుపోయారు చంద్రబాబు నాయుడు గారు.’’ - అద్దంకి ఘటనలో పోలీసుల వాహనంలో గంజాయి ‘‘మొన్న ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇద్దరు ఎస్‌ఐలు ప్రయాణిస్తున్న కారు. తాజా సమాచారం ప్రకారం మత్తులో కారు నడుపుతున్నది కూడా ఇంకో ఎస్‌ఐ అని మాకు సమాచారం వచ్చింది. ఆ మత్తులో ఒక ఆటోను ఢీకొట్టారు. కారులో డ్రైవర్‌తో సహా ఉన్న ఇద్దరు ఎస్‌ఐలు కూడా మత్తులో ఉన్న పరిస్థితిని ప్రజలు చూశారు. వెనక సీట్లో, డిక్కీలో చూస్తే గంజాయి, లిక్కర్, పోలీస్ యూనిఫాం దొరికాయి. ఈ విజువల్స్ చూసి ప్రజలంతా షాక్‌కు గురయ్యారు. మనం నిజంగానే ఏపీలో ఉన్నామా? లేకపోతే కొలంబియాలో ఉన్నామా? అని అందరికీ డౌట్లు వచ్చినాయి.’’ - వీడియోలు తీసిన ప్రజలను బెదిరించడం ఎందుకు? ‘‘గ్రామస్థులు జరిగిన ఘటనను వీడియోలు తీస్తుంటే అక్కడికి సీఐ వచ్చి ఆ వీడియోలు తీస్తున్న గ్రామస్థులను బెదిరించారు. ‘వీడియో తీస్తే జైల్లో పెడతా’ అని బెదిరించారు. మరి ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని ప్రజలు నమ్మాలి?’’ - డీఎస్పీ, ఎస్పీ, ఎఫ్‌ఐఆర్‌లో మూడు వెర్షన్లు ‘‘డీఎస్పీ ఏమంటారు? ఇద్దరు ఎస్‌ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించాడట. ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్‌పై పారిపోతుండగా, వీళ్లిద్దరూ కారులో ఛేజ్ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని చెబుతారు. ఎస్పీ ఏమంటారు? ముందస్తుగానే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు రైడ్ చేశాం అని చెబుతారు. ఎఫ్‌ఐఆర్ కాపీలో ఏముంది? ఇద్దరు ఎస్‌ఐల్లో ఒక ఎస్‌ఐ కొడుక్కి కడుపునొప్పి వచ్చిందట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురవ ఎస్‌ఐ పిలిస్తే సంతమాగులూరు ఎస్‌ఐ వెళ్లాడట. మూడు వెర్షన్లు ఉన్నాయి. ఒకసారి చూడండి.’’ - పోలీసులపై కఠిన చర్యలు ఎక్కడ? ‘‘కారులో గంజాయి కనిపించింది. కారులోనే ఉంది. మత్తులో వీళ్లు ఆటోను ఢీకొన్నారు. కారులో ఎస్‌ఐలు ఉన్నారు. డ్రైవర్ మత్తులో ఉన్నాడు. వెనక కూర్చున్న ఎస్‌ఐలు కూడా మత్తులో ఉన్నారు. కారులో గంజాయి ఉంది. పోలీస్ యూనిఫాం ఉంది. లిక్కర్ బాటిళ్లు ఉన్నాయి. మరి ఇన్ని కనిపిస్తుంటే డీఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. వీడియోలు తీస్తుంటే సీఐ ప్రొటెక్ట్ చేయాలని రుబాబ్ చేస్తాడు. పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. ఇలాంటివి ఏదైనా పోలీస్ అధికారులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైల్లో పెట్టాలి. ఒక మెసేజ్ పంపించాలి. అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తున్నావు. ఆ ఎస్‌ఐలను కాపాడే దాని కోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నరేషన్లు అన్నీ బిల్డ్ చేస్తున్నారు.’’ - వైయస్ఆర్‌సీపీ హయాంలో గంజాయిపై ఉక్కుపాదం 11,550 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం ‘‘మా హయాంలో నిజంగా ఉక్కుపాదం ఎలా మోపామో చెప్పడానికి నిదర్శనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఎస్‌ఈబీని ఏర్పాటు చేశాం. 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశాం. నాలుగున్నర కోట్ల గంజాయి మొక్కలను తొలగించాం. 13,210 మందిని అరెస్ట్ చేశాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. రూ.144 కోట్లు ఖర్చు చేసి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. దాదాపు మూడు లక్షలకుపైగా పోడు భూములను గిరిజనులకు పంచిపెట్టాం. ఇవన్నీ మార్పులు తీసుకొచ్చే కార్యక్రమాలు మేము చేశాం. ఈరోజు టోటల్‌గా రివర్స్. పోలీసులనే వ్యాపారంలో భాగస్వామ్యం చేసి, అధికారపక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటై మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్న పరిస్థితి. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు. కానీ ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. గంజాయికి మాత్రమే గిట్టుబాటు ధర వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో.’’ - ప్రజలు ఆలోచించాల్సిన సమయం ‘‘బీసీల అభ్యున్నతి విషయంలో నిజంగా ఎవరైనా చిత్తశుద్ధితో కృషి చేశారంటే అది వైయస్ఆర్‌సీపీ పార్టీ అని మాత్రమే ఘనంగా చెప్పగలుగుతాం. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తలరాతలను చిత్తశుద్ధితో మార్చాలని ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందంటే అది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ ఏమయ్యాయి? అన్నీ రద్దయిపోయాయి. పైగా ఈయన చేస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్‌లు, బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏమయ్యాయి? అన్నీ డస్ట్‌బిన్‌లో వేసేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారు? ఎవరి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది? కరువు ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో రైతులను, రైతు కూలీలను, పేదలను, ప్రజలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ బాధ్యతను మీరు ఎప్పుడు నిర్వర్తిస్తారు?’’