వైయస్ఆర్ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరేన్ రామానుజులరెడ్డి పిలుపునిచ్చారు. కమలాపురంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు. ఈ సమావేశంలో రాజోలి వీరారెడ్డి, దుగ్గాయపల్లి మల్లికార్జునరెడ్డి, రెడ్యం సుబ్బారెడ్డి, ఆరు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వారికి అండగా నిలవాలని నేతలు సూచించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ప్రజలతో మమేకమై పనిచేయాలని, కింది స్థాయి నాయకులు, కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయంతో పనిచేసేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని తెలిపారు. స్థానికంగా మట్టి, ఇసుక దోపిడీ ద్వారా సంపాదించిన డబ్బుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న వారి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పలుమార్లు చెప్పారని, జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారని నేతలు తెలిపారు. వైయస్ జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.