తాడేపల్లి: డీఎస్సీ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు, అవినీతి చోటుచేసుకున్నాయని పక్కా ఆధారాలతో సహా బయటపెట్టినా వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఇంకా బుకాయింపు చర్యలకే పరిమితమైందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇది కచ్చితంగా ప్రజలను మోసం చేయడమే అని ఆయన స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై దాదాపు 3.3 లక్షల నిరుద్యోగుల తరఫున జూన్ నుంచి పోరాడుతున్నామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ఐఏఎస్ అధికారులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో చేసిన మోసాలు పూర్తి సాక్ష్యాధారాలతో బయట పడటంతో సమాధానం చెప్పుకోలేక, ఇద్దరు ఐఏఎస్ అధికారులను మీడియా ముందుకు నెట్టి పచ్చి, వారితో పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి విద్యా శాఖ నిబంధనలు, జీవోలను అధికారులు నిస్సిగ్గుగా తుంగలో తొక్కుతున్నారు. జీవోలకు ఎలాంటి సవరణలు (అమెండ్‌మెంట్స్) చేయకుండా, ఇష్టారాజ్యంగా మినహాయింపులు ఇస్తూ ఇచ్చిన నియామకాలను ఎలా ఆమోదిస్తారు?. వాస్తవాలు వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం అత్యంత దారుణం. ఈ తప్పులకు భవిష్యత్తులో కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డీఎస్సీ అక్రమాలు. ఇవిగో సాక్ష్యాలు: కేస్ స్టడీ–1: ఈడిగ ప్రభాకర్ ఎస్జీటీ వ్యవహారం – అబద్ధపు పీపీటీతో తప్పుదోవ. ఈడిగ ప్రభాకర్‌కు టెట్ అర్హత లేదని స్వయంగా అతనే అంగీకరించినప్పటికీ, కమిషనర్ గారు పీపీటీ ద్వారా 2018లో అతనికి 77 మార్కులు వచ్చాయని అబద్ధపు ప్రచారం చేశారు. అసలు ఎస్జీటీ పోస్టుకు పేపర్ 1–ఏ అర్హత అవసరం కాగా, స్పెషల్ స్కూల్స్‌కు వర్తించే పేపర్ 2–బి మార్కులను చూపించి ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టించారు? ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే ఎక్కడా అతను పేపర్ 2–బి రాసిన దాఖలాలే లేవు. 2025 డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా అతను మళ్లీ 2025 టెట్ పరీక్ష రాయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అంటే డీఎస్సీ నాటికి అతనికి అర్హతే లేదని స్పష్టమవుతోంది. కేస్ స్టడీ–2: జె.ఉష నియామకం – పోస్టు మార్పు, టెట్ నిబంధనల ఉల్లంఘన. జె.ఉష అనే అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే, ఆమెకు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టును ఎలా కేటాయిస్తారు? 2017కు ముందు లాంగ్వేజ్‌లకు ప్రత్యేక టెట్ లేదంటూ అధికారులు బుకాయిస్తున్నారు. కానీ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2017 తర్వాత నిర్వహించిన టెట్లలో సంబంధిత సబ్జెక్ట్ లేదా లాంగ్వేజ్ పేపర్‌లో ప్రత్యేకంగా ఉత్తీర్ణత సాధించాలనే స్పష్టమైన నిబంధన ఉంది. అధికారిక నిబంధనలను ఉల్లంఘించి, రూల్స్ మార్చకుండా ఆమెకు ఉద్యోగం ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలి. కేస్ స్టడీ–3: రాజ్ కుమార్ నియామకం – అర్హతల్లేవు, డీఎస్సీ రాయకపోయినా కొలువు. రాజ్‌కుమార్ అనే వ్యక్తికి అసలు సంబంధిత సబ్జెక్టులో అర్హత లేకపోయినా, డీఎస్సీ రాయకపోయినా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం కట్టబెట్టారు. ఈయన సాధారణ బీఈడీ చేయలేదు, కేవలం స్పెషల్ బీఈడీ అర్హతతో జనరల్ స్కూల్ పోస్టుకు ఎలా ఎంపిక చేస్తారు? టెట్ లేదు, డీఎస్సీ లేదు, కనీస విద్యార్హత నిబంధనలు పాటించకుండా ఇంతటి ఘోరమైన అక్రమానికి పాల్పడి ఇప్పుడు వ్యవస్థను సమర్థించుకోవడం సిగ్గుచేటు. కేస్ స్టడీ–4: తమ్ముడి సర్టిఫికెట్‌తో పెద్దాడ అప్పలరాజుకు ఉద్యోగం – వెబ్‌సైట్ ట్యాంపరింగ్. స్పోర్ట్స్ డీఎస్సీలో పెద్దాడ అప్పలరాజుకు తన తమ్ముడి సర్టిఫికెట్‌తో ఉద్యోగం ఇచ్చిన బాగోతం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బట్టబయలైంది. 2025 సెప్టెంబర్‌లోనే రిక్రూట్‌మెంట్ ముగిస్తే, 2026 జూన్‌లో మేము వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఆధారాలతో ఈ మోసం బయటపడింది. మేము ఆధారాలు బయటపెట్టిన వెంటనే అధికారిక పోర్టల్‌లో సర్టిఫికెట్లను ట్యాంపరింగ్ చేసి వేరే పత్రాలను అప్‌లోడ్ చేశారు. ఆర్చరీ, కబడ్డీ అభ్యర్థుల సర్టిఫికెట్లు, విజయాల వివరాలను కూడా ఇదే తరహాలో మార్చేశారు. కూన రవికుమార్ సంతకాలు. సవరణ లేని జీవోలకు విరుద్ధం: జీవో ఎంఎస్ నెం:4, 47 ప్రకారం స్పోర్ట్స్ సర్టిఫికెట్‌పై సంబంధిత అసోసియేషన్ సెక్రటరీ లేదా జనరల్ సెక్రటరీ మాత్రమే స్వయంగా సంతకం చేయాలన్న స్పష్టమైన నిబంధన ఉంది. కానీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గౌరవ అధ్యక్షుడి హోదాలో పెట్టిన సంతకాలను అధికారులు ఎలా ఆమోదిస్తారు? నిబంధనలకు ప్రభుత్వం ఎలాంటి జీవో సవరణ చేయకుండా, అసోసియేషన్ లెటర్ ఇచ్చిందని చెప్పి అక్రమ సంతకాలను ఎలా చెల్లుబాటు చేస్తారు? ప్రిన్సిపాల్ సంతకం పెట్టాల్సిన చోట క్లర్క్ సంతకం పెడితే అధికారులు అంగీకరిస్తారా?. 20 శాతం వెయిటేజీ రద్దు. వెరిఫికేషన్ వ్యవస్థల నిర్వీర్యం: 2018 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు గ్రౌండ్ పెర్ఫార్మెన్స్ (స్కిల్ టెస్ట్) చూసి 20 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలనే నిబంధనను ఈ డీఎస్సీలో ఎందుకు తొలగించారు? అలాగే జిల్లా స్థాయిలో డీఎస్‌డీవో (ఈ ఈౖ)ల ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన జరిపే విధానాన్ని, కలెక్టర్లు–డీఈవోల పర్యవేక్షణలో జరిగే 1:1 ధ్రువపత్రాల పరిశీలనను పూర్తిగా ఎత్తేశారు. కేవలం శాప్ కార్యాలయంలో కూర్చుని ఇష్టారాజ్యంగా లిస్టులు తయారుచేసి ఉద్యోగాలు ఇచ్చేశారు. బాధితులకు న్యాయం చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా?: ఈ నేపధ్యంలో న్యాయం కోసం గ్రీవెన్స్‌లో పెట్టుకున్న వేలాది దరఖాస్తులను ప్రభుత్వం చెత్తబుట్టలో వేయడాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, శాప్ లేఖలు రాసినా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అర్హులకు పోస్టింగులు ఇవ్వకుండా తొక్కిపెట్టిందని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులు ఉన్న 100 జెన్యూన్ కేసులను స్వయంగా మేమే అధికారుల ముందుకు తీసుకొస్తామని.. గ్రీవెన్స్ ద్వారా ఆ బాధితులకు తక్షణమే పోస్టింగులు ఇచ్చి న్యాయం చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అని ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ చేశారు.