ప్రొద్దుటూరు: కార్పొరేట్ సంస్థల క్షవరం వ్యాపారాలను వ్యతిరేకిస్తూ స్థానికంగా సెలూన్ వ్యాపారం చేసుకుంటున్న నాయీ బ్రాహ్మణ సోదరులకు పూర్తి అండగా ఉంటామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని శేగిరెడ్డి కల్యాణమండపంలో నాయీ బ్రాహ్మణ సోదరులతో రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థల కారణంగా స్థానిక వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి వైయస్ జగన్ కృషి గతంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అర్హులైన నాయీ బ్రాహ్మణులకు ‘చేయూత’ పథకం ద్వారా సుమారు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారని రాచమల్లు గుర్తుచేశారు. కులవృత్తిపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణుల వ్యాపారాలకు తోడ్పాటుగా 150 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి దేవాలయ పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించిన ఘనత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని తెలిపారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నాయీ బ్రాహ్మణుడికి అవకాశం కల్పించి వారి గౌరవాన్ని పెంచారని, ఉచిత ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అందించారని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారులకే పూర్తి మద్దతు ప్రొద్దుటూరులో అన్ని రకాల స్థానిక వ్యాపారులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని రాచమల్లు స్పష్టం చేశారు. పెళ్లిళ్లు, చావులు సహా ప్రతి శుభ, అశుభ కార్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న స్థానిక నాయీ బ్రాహ్మణ సోదరుల ఉపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. తమ హక్కులు, ఉపాధి కోసం ప్రశ్నించిన నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన ‘నాలుక కోస్తాం’ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక వ్యాపారులను మోసం, దగా చేస్తున్న కార్పొరేట్ సంస్థలను ప్రొద్దుటూరు నుంచి పంపించే కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సోదరులంతా ఐక్యంగా ముందుకు రావాలని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు.