రైతుకు 9 గంటల కరెంటు ఎక్కడ? 

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్‌

హంపాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసి ధర్నా

రాప్తాడు: రైతులకు వ్యవసాయ సీజన్‌లో 9 గంటల విద్యుత్‌ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని అమలు చేయడం లేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 9 గంటలకు బదులుగా మూడు గంటలకు మించి విద్యుత్‌ సరఫరా చేయడం లేదని, ఈ కొద్దిపాటి విద్యుత్‌తో రైతులు పంటలను ఎలా కాపాడుకోవాలని ప్రశ్నించారు. రాప్తాడు మండలం హంపాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. పంటలను కాపాడేందుకు కనీసం ఏడు గంటలైనా నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు.

విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సరఫరా పెరగడం లేదని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. జూలై 15న విద్యుత్‌ డిమాండ్‌ 285 మిలియన్‌ యూనిట్లకు చేరిందని, రోజువారీ సగటు డిమాండ్‌ 269 మిలియన్‌ యూనిట్లుగా ఉందని పేర్కొన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ఉత్పత్తి తగ్గుతోందని, విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారని అన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రైతు భరోసా కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వాటాగా రావాల్సిన రూ.14 వేల సాయం ఇంకా పూర్తిగా అందలేదని, ఈ ఏడాదికి సంబంధించి కూడా రూ.9 వేల వరకు పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రాజకీయాలతో కాలయాపన చేయకుండా, జిల్లా విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెంచి పంటలను కాపాడాలని స్పష్టం చేశారు.

Back to Top