పల్నాడు రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా తెలిసిందని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమన్నారు.

ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను వైయ‌స్‌ జగన్‌ కోరారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని వైయ‌స్‌ జగన్‌ కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Back to Top