సెప్టెంబర్‌ 1న వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ముట్టడి

సాగునీటి కోసం వైయ‌స్ఆర్‌సీపీ సమరశంఖం

500 ట్రాక్టర్లతో రైతుల భారీ సమీకరణ

సాగునీరు, తాగునీరు విడుదల చేసే వరకు పోరాటం ఆగదు: శిల్పా చక్రపాణిరెడ్డి

నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలో సాగునీటి సమస్యపై వైయ‌స్ఆర్‌సీపీ సమరానికి సిద్ధమైంది. శ్రీశైలం జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ తెలుగు గంగ, కేసీ కెనాల్‌, సిద్ధాపురం చెరువులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితిపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సెప్టెంబర్‌ 1న ఉదయం 10 గంటలకు 500 ట్రాక్టర్లతో వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ముట్టడికి పిలుపునిచ్చారు.

కళ్లముందు నీరున్నా... ఎండుతున్న ఫైర్లు

శ్రీశైలం జలాశయం 878 అడుగుల నీటిమట్టంతో 180 టీఎంసీల నీటితో నిండుగా ఉన్నప్పటికీ శ్రీశైలం నియోజకవర్గ రైతులకు సాగునీరు అందడం లేద‌ని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వెలుగోడు తెలుగుగంగ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో 7 టీఎంసీల నీరు ఉన్నా పంట కాలువలకు నీరు విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు నీటి కోసం ఎదురుచూస్తుండగా, కళ్ల ముందే పచ్చని పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ నీటి వినియోగంపై ప్రభుత్వం ఎందుకు మౌనం?

తెలంగాణ వైపు నుంచి వివిధ ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని శిల్పా చక్రపాణిరెడ్డి నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం మౌనం వహించడం వల్ల రాయలసీమ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సాగునీరు లేక పంటలు ఎలా కాపాడాలి?

తెలుగు గంగ, కేసీ కెనాల్‌, సిద్ధాపురం చెరువులకు నీరు విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. నాట్లు వేసుకునేందుకు నీరు లేక ఒకవైపు, ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోతున్న మరోవైపు రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రాణం పెట్టి పెంచుకున్న పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతుల పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు.

500 ట్రాక్టర్లతో రైతుల సమీకరణ

రైతుల సమస్యలను ప్రభుత్వానికి నేరుగా తెలియజేసేందుకు సెప్టెంబర్‌ 1న ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ముట్టడించనున్నట్లు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. 500 ట్రాక్టర్లతో రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఏకమై తమ నీటి హక్కుల కోసం పోరాడాలని కోరారు.

వెలుగోడు వైపు కదలనున్న రైతన్నలు

మహానంది మండల రైతులకు నంద్యాల చిన్న చెరువు, బండి ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల రైతులకు బండి ఆత్మకూరు, సంతజూటూరు ప్రాంతాల్లో వెయిటింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. వెలుగోడు మండల రైతులు మోత్కూరు గ్రామం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆత్మకూరు వెయిటింగ్‌ పాయింట్‌ను రైతులతో సమావేశం అనంతరం నిర్ణయించనున్నట్లు తెలిపారు.

సాగునీరు, తాగునీరు సాధించే వరకు పోరాటం

సాగునీరు, తాగునీరు రైతుల హక్కులని, ఆ హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. “రైతు కంట కన్నీరు–రాజ్యానికి అరిష్టం. ప్రాణమిచ్చే అన్నదాతకు సాగునీరే ప్రాణాధారం” అంటూ రైతులను ఉద్యమానికి కదిలించారు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు సెప్టెంబర్‌ 1న వేలాది మంది రైతులు వెలుగోడు వైపు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పిలుపునిచ్చారు.
 

Back to Top