తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను మద్యం మత్తులో ముంచేసిందని, మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా పెంచుతూ ప్రజల ప్రాణాలు, కుటుంబాల భద్రతను గాలికొదిలేసిందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. మద్యం మత్తులో హత్యలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ విషాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వానికి కనీస చలనం లేదని మండిపడ్డారు. బడి, గుడి పక్కన కూడా మద్యం అందుబాటులోకి రావడం, గ్రామగ్రామాన బెల్ట్ షాపులు విస్తరించడం, చివరకు డోర్ డెలివరీ వరకు మద్యం వ్యాపారం చేరడం కూటమి ప్రభుత్వ మద్యం విధానం ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టం చేస్తోందన్నారు. మద్యం అమ్మకాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. దాని వల్ల జరుగుతున్న అనర్థాలకు మాత్రం బాధ్యత వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కారుమూరు వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఏమన్నారంటే... - మద్యం మత్తులో వరుస విషాదాలు “చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చింది. మద్యం మత్తులో హత్యలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ విషాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. రాజమండ్రిలో మద్యం మత్తులో వైద్యురాలి మృతి, కర్నూలు జిల్లాలో బెల్ట్ షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తాగిన ఇద్దరు యువకుల కారణంగా జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి వంటి ఘటనలు కళ్లముందే ఉన్నాయి. ఒకే రోజు మూడు జిల్లాల్లో అన్నను తమ్ముడు, తండ్రిని కుమారుడు, భార్యను భర్త హత్య చేసిన ఘటనలు కూడా మద్యం మత్తు ఎంతటి విషాదాలకు దారితీస్తుందో చెబుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపి తాము చనిపోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. అయినా ప్రభుత్వం మద్యం విక్రయాలను నియంత్రించకుండా మరింతగా ప్రోత్సహిస్తోంది. మద్యం డోర్ డెలివరీ, 24 గంటలూ అందుబాటులో ఉండే పరిస్థితి, గ్రామాల్లో విస్తరిస్తున్న బెల్ట్ షాపులతో ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.” - మద్యం అమ్మకాలు పెరిగినా ఆదాయం ఎందుకు పెరగడం లేదు? “మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2023–24లో బీర్ అమ్మకాలు 1.12 కోట్ల కేసులు ఉండగా, 2025–26 నాటికి 2.32 కోట్ల కేసులకు చేరాయి. ఇంతగా అమ్మకాలు పెరిగినా ప్రభుత్వ మద్యం ఆదాయం మాత్రం 2023–24లో రూ.25,117 కోట్ల నుంచి 2024–25లో రూ.28,844 కోట్లకు, 2025–26లో సుమారు రూ.29 వేల కోట్లకు మాత్రమే చేరింది. అమ్మకాలు రెట్టింపవుతున్నప్పుడు ప్రభుత్వ ఆదాయం అదే స్థాయిలో ఎందుకు పెరగడం లేదు? బెల్ట్ షాపులు, నకిలీ మద్యం, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందా? ప్రజలకు మద్యం అందుబాటును పెంచి, ప్రభుత్వానికి ఆదాయం మాత్రం పెరగని ఈ విధానంపై చంద్రబాబు ప్రభుత్వం పూర్తి లెక్కలు చెప్పాలి.” - బడి, గుడి పక్కన కూడా మద్యం “బెల్ట్ షాపులు, డోర్ డెలివరీతో మద్యం ప్రతి గ్రామానికీ చేరింది. బడి, గుడి పక్కన కూడా మద్యం దొరికే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక్క తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. మరి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో ప్రభుత్వం చెప్పాలి. రూ.99కే మద్యం పేరుతో సుమో, షార్ట్, బెంగళూరు బ్రాంది, కేరళ మాల్టెడ్ విస్కీ, డాక్టర్స్ బ్రాంది వంటి బ్రాండ్లను తీసుకొచ్చారు. వీటి నాణ్యతపై ప్రజల్లో అనుమానాలు ఉన్నందున ప్రభుత్వం వెంటనే నాణ్యత పరీక్షలు నిర్వహించి వాస్తవాలను వెల్లడించాలి. వైయస్ జగన్ ప్రభుత్వం గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం బడి వైన్స్, గుడి వైన్స్‌లను తీసుకొచ్చింది.” మీడియా ప్రశ్నలకు సమాధానాలు - “ఈ ఏడాది 11 క్యాబినెట్ సమావేశాలు జరిగితే ఎనిమిది సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకాలేదు. జ్వరం కారణంగా క్యాబినెట్ సమావేశాలకు రాలేని పవన్ కళ్యాణ్ ఇతర కార్యక్రమాలకు మాత్రం ఎలా హాజరవుతున్నారు? కీలకమైన ప్రభుత్వ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.” - “చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, ప్రత్యేక కాన్వాయ్‌ల పేరుతో ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు కూడా అందని పరిస్థితి ఉంది. ఆడపిల్లల హాస్టళ్లలో నీటి కోసం విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవసరాలను పక్కనపెట్టి పాలకుల విలాసాలకు ప్రజాధనం ఖర్చు చేయడం ఏంటి?” - “హైదరాబాద్‌లో ఈ నెల 16న ప్రమాదం జరిగితే నాలుగు రోజుల తర్వాతే విషయం బయటకు వచ్చింది. జనసేన ఎంపీ కుమారుడు కావడంతోనే ఈ ఘటనను ఇంతకాలం బయటకు రానివ్వలేదనే అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి నేతల కుటుంబాలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండకూడదు. ఈ ఘటనపై పూర్తి వాస్తవాలను బయటపెట్టి, చట్టం అందరికీ సమానంగా అమలు చేయాలి.” - “వైయస్ జగన్ ఇవాళ హైదరాబాద్‌లో ఒక వివాహానికి హాజరైతేనే భారీగా ప్రజలు తరలివచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు, వైయస్ జగన్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరు. రెండేళ్ల కూటమి పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ జనాభిమానమే నిదర్శనం.”