తాడేపల్లి: రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ అధీకృత బీఎల్‌ఏలకు ముఖ్యమైన ఎస్‌ఐఆర్–2026 డేటా అందడం లేదని, ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ను కోరారు. ఈ మేరకు సీఈఓకు లేఖ రాసిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ల వారీగా మ్యాప్‌లో లేని ఓటర్ల వివరాలు, తార్కిక వ్యత్యాసాలు, నోటీసుల వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే, వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏ–1, బీఎల్‌ఏ–2లకు ఈ సమాచారాన్ని అందించేలా అన్ని స్ధాయిల్లోని ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించేందుకు, తొలగింపులు, వ్యత్యాసాలు లేదా ఇతర సమస్యలు ఉంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు అవసరమైన పూర్తి సమాచారం అధికారుల వద్ద అందుబాటులో ఉండటం లేదని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ సమాచారం తమ పార్టీ ప్రతినిధులకు అత్యంత అవసరమని, అయితే చాలా ప్రాంతాల్లో కోరిన సమాచారాన్ని ఒకే విధంగా అందించడం లేదని ఆయన తన లేఖలో సీఈఓ దృష్టికి తెచ్చారు. తమ బీఎల్‌ఏలు పలుమార్లు కోరినప్పటికీ సంబంధిత డేటా పూర్తిగా, సకాలంలో అందడం లేదని తెలిపారు. పులివెందుల, పుంగనూరు, ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్ని అందుకు స్పష్టమైన ఉదాహరణలుగా చూపారు. ఎస్‌ఐఆర్–2026లో మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలు, తార్కిక వైరుధ్యాలు ఉన్న ఓటర్లకు సంబంధించిన బూత్‌ల వారీ డేటాను కోరుతూ వైఎస్సార్సీపీ ఎస్‌ఐఆర్ ప్రత్యేక బృందం కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సంప్రదించగా, వారు కోరిన డేటాను మాత్రం ఇవ్వలేదని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. తార్కిక వైరుధ్యాలకు సంబంధించిన బూత్‌ల వారీ డేటాను అందించేందుకు తమ కార్యాలయానికి అవసరమైన లాగిన్/యాక్సెస్ లేదని ఆర్డీఓ తమ పార్టీ ప్రతిని«ధులకు చెప్పారని గుర్తు చేశారు. కాబట్టి ఎస్‌ఐఆర్ –2026 డేటాను అన్ని నియోజకవర్గాల్లో ఒకే విధంగా అందుబాటులో ఉంచేందుకు సీఈఓ కార్యాలయం నుంచి స్పష్టమైన, ఏకరీతి ఆదేశాలు ఇవ్వాలని, లేళ్ల అప్పిరెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇంకా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇలాంటి సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, బూత్ స్థాయిలో కూడా పలువురు బీఎల్‌ఏ–2లు, సంబంధిత బీఎల్వోలు అవసరమైన డేటాను అందించడం లేదని లేళ్ల అప్పిరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తాజా ఎస్‌ఐఆర్–2026 రాష్ట్రవ్యాప్త డేటాను, అసెంబ్లీ నియోజకవర్గం వారీగా, బూత్ వారీగా మ్యాపింగ్ కాని ఓటర్లు, తార్కిక వైరుధ్యాలు ఉన్న ఓటర్లు, ఇప్పటివరకు జారీ చేసి, అందజేసిన నోటీసుల వివరాలు, ఇంకా జారీ చేయాల్సిన లేదా అందజేయాల్సి ఉన్న నోటీసుల వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్డీవోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలకు స్పష్టమైన, ఏకరీతి ఆదేశాలు జారీ చేసి, సంబంధిత జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, బూత్ స్థాయిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికారిక బీఎల్‌ఏ–1లు, బీఎల్‌ఏ–2లకు కోరిన ఎస్‌ఐఆర్–2026 డేటాను అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల యంత్రాంగం వద్ద ప్రతి స్థాయిలో అందుబాటులో ఉన్న ఇదే సమాచారాన్ని సంబంధిత అధీకృత బీఎల్‌ఏలకు అందుబాటులో ఉంచాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు. తద్వారా వారు ధృవీకరణ ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనగలుగుతారని తెలిపారు. ఇంకా ఈ సమాచారానికి అన్ని రాజకీయ పార్టీలు, వారి అధీకృత ప్రతినిధులకు ఏకరీతిగా యాక్సెస్ కల్పించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలను పరిశీలించేందుకు, నిజమైన తొలగింపులు, వ్యత్యాసాలు లేదా ఇతర సమస్యలను గుర్తించి వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ డేటా అందుబాటులో ఉండటంలో ఏకరూపత, పారదర్శకత కూడా ఉంటుందని సీఈఓకు రాసిన లేఖలో లేళ్ల అప్పిరెడ్డి వివరించారు.