పోతిరెడ్డిపాడు: కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి నీటిని కిందికి వదిలి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీఅధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శ్రీశైలం నీటి మట్టం తగ్గితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు చుక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నిండేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పరిశీలనకు కూడా అనుమతించకపోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాయలసీమ రైతుల హక్కుల కోసం అందరూ చైతన్యవంతులై ఉద్యమించాలని కాటసాని పిలుపునిచ్చారు. కరెంటు ఉత్పత్తి పేరుతో శ్రీశైలం డ్యాంను ఖాళీ చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని శైలజానాథ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కులను అడగడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు అందే వరకు వైయస్ఆర్‌సీపీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయలసీమకు నీటి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద వైయస్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పరిశీలనకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ నేతలకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైయస్ఆర్‌సీపీ నేతలు వస్తున్నారనే కారణంతో అధికారులు పోతిరెడ్డిపాడు గేటుకు తాళం వేశారు. దీంతో అక్కడే మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడారంటే... రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది - కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కరెంట్ ఉత్పత్తి సాకుతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వృథాగా కిందికి నీళ్లు వదిలిపెడుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 841 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా మన రాయలసీమకు నీళ్లు వస్తాయనే నిజాన్ని రైతులందరూ గ్రహించాలి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏప్రిల్, మార్చి వరకు నీటి మట్టం తగ్గకుండా జీవో ఇచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితి లేక మన సీమకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రాజెక్టు పరిస్థితిని చూసేందుకు వస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం చాలా దారుణం. తెలంగాణ రాష్ట్రం అనుమతులు లేకుండా లిఫ్ట్‌ల ద్వారా నీళ్లు తీసుకెళ్తున్నా ఈ ప్రభుత్వం అడిగే సాహసం చేయడం లేదు. రాయలసీమ రైతులు తమ హక్కుల సాధన కోసం చైతన్యవంతంగా ఉద్యమించకపోతే మన భావితరాలకు చుక్క నీరు కూడా దక్కదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రాయలసీమలోని డ్యాములను నీటితో నింపాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీశైలం నిండుగా నీళ్లున్నా రాయలసీమకి నీరివ్వరా? - సాకె శైలజానాథ్, మాజీ మంత్రి పోతిరెడ్డిపాడును పరిశీలించేందుకు వెళ్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు రాయలసీమపై తనకున్న ద్వేషాన్ని బయటపెట్టుకున్నారు. శ్రీశైలంలో నీరు నిండుగా ఉన్నప్పటికీ గోరకల్లు, అవుకు, వెలుగోడు వంటి రాయలసీమ డ్యాములను ఉద్దేశపూర్వకంగానే ఎండబెడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు రైతుల భూములను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలో భాగంగానే సీమకు సాగునీరు ఇవ్వడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఏమైనా చీకటి ఒప్పందం చేసుకొని పోతిరెడ్డిపాడుకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారా? అని ముఖ్యమంత్రిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్రంలో ఇరిగేషన్, రెవెన్యూ వ్యవస్థలు పనిచేయడం లేదు. కేవలం పోలీసులతోనే చంద్రబాబు కొత్త తరహా రాజ్యాన్ని నడుపుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రైతుల హక్కుల కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది. ఈ అన్యాయాలకు కూటమి ప్రభుత్వం కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు.