తాడేపల్లి: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి కోరారు. ఉపాధ్యాయ సంఘాలు ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టంలో అవసరమైన సవరణలు చేయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ టెట్‌కు, సాధారణ టెట్‌కు పెద్దగా తేడా లేదని కల్పలత రెడ్డి అన్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు కల్పించేలా స్పెషల్ టెట్‌లో ఎలాంటి ప్రత్యేక సవరణలు తీసుకురాలేదని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షం నుంచి మినహాయింపు కోసం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఇన్‌సర్వీస్ టీచర్ల సమస్యపై కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాసి చట్ట సవరణ కోసం ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. తమిళనాడులో ఇన్‌సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయిస్తూ తీర్మానం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సస్పెన్షన్లు ఎత్తివేయాలి ఇన్‌సర్వీస్ టీచర్ల సమస్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం సరికాదని కల్పలత రెడ్డి అన్నారు. సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పాలా? లేక పదేపదే పరీక్షలు రాస్తూ చదువుకోవాలా? అని కల్పలత రెడ్డి ప్రశ్నించారు. ఇన్‌సర్వీస్ టీచర్ల అనుభవం, వారి సేవలను పరిగణనలోకి తీసుకుని టెట్ నుంచి మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర స్థాయిలో టెట్ నిర్వహణకు అనుమతి ఉన్న విధంగానే రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఇన్‌సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అవసరమైన చట్ట సవరణ చేయించాలని కల్పలత రెడ్డి స్పష్టం చేశారు.