వైయ‌స్ఆర్‌సీపీకి కర్త, కర్మ, క్రియ వైయ‌స్‌ జగనే

విజ‌య‌సాయిరెడ్డికి పదవులు ఇచ్చింది జగనే.. 

అన్యాయం జరిగిందనడం వాస్తవాలకు విరుద్ధం

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం, వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో అపోహలు కలిగించేలా ఉన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.

  జగన్‌ను టార్గెట్‌ చేయడమే రాజకీయ అజెండా

వైయ‌స్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాలోని ఫేక్‌ ఫ్యాక్టరీలు నిరంతరం విషప్రచారం చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరిగితే చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతోనే వ్యక్తిగత అంశాలను ముందుకు తెస్తున్నారని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌పై విమర్శలు చేస్తే ప్రచారం వస్తుందనే ఉద్దేశంతో కొత్త రాజకీయ పాత్రలు తెరపైకి వస్తున్నాయని అన్నారు.

 వైయ‌స్ఆర్‌సీపీలో ఒకే ఒక్క నాయకుడు

వైయ‌స్ఆర్‌సీపీకి కర్త, కర్మ, క్రియ వైయ‌స్‌ జగనేనని సజ్జల స్పష్టం చేశారు. పార్టీలో నంబర్‌ వన్‌, నంబర్‌ టూ అనే ప్రశ్నే లేదని, వైయ‌స్‌ జగన్‌ ఒక్కరే నాయకుడని, మిగిలిన వారంతా కార్యకర్తలమని చెప్పారు. వైయ‌స్‌ జగన్‌ కోటరీలో బందీగా ఉంటే పార్టీని నిర్మించి 2019లో భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురాగలిగేవారా? అని ప్రశ్నించారు.

  విజయసాయిరెడ్డికి అత్యున్నత బాధ్యతలు ఇచ్చింది జగనే

విజయసాయిరెడ్డికి వైయ‌స్‌ జగన్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని సజ్జల తెలిపారు. రాజ్యసభ సభ్యత్వం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు, పార్లమెంటరీ పార్టీ నాయకత్వం, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్‌ స్థాయి హోదా, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌ వంటి కీలక బాధ్యతలు అప్పగించారని వివరించారు. 2020 నుంచే తనను తగ్గించారని చెబుతున్న విజయసాయిరెడ్డిని 2022లో రెండోసారి రాజ్యసభకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు.

 రాజీనామా నాటి మాటలకు.. ఇప్పటి మాటలకు పొంతన లేదు

పార్టీ నుంచి బయటకు వెళ్లే సమయంలో వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని, ఎవరిపైనా కోపం లేదని విజయసాయిరెడ్డి చెప్పారని సజ్జల గుర్తుచేశారు. ఇప్పుడు సజ్జల వల్ల పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పడం గతంలో చెప్పిన మాటలకు విరుద్ధమన్నారు. వైయ‌స్‌ జగన్‌తో కలిసి తప్పుడు కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారనే భావనతోనే ఆయనకు ప్రత్యేకమైన అవకాశాలు, బాధ్యతలు అప్పగించారని తెలిపారు.

 మతమార్పిడుల ఆరోపణ దారుణం

వైయ‌స్‌ జగన్‌ మతమార్పిడులను ప్రోత్సహించారన్న వ్యాఖ్యలను సజ్జల తీవ్రంగా తప్పుబట్టారు. వైయ‌స్‌ కుటుంబం అన్ని మతాలను సమానంగా గౌరవించిందని, దశాబ్దాలుగా ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డికి ఈ విషయం బాగా తెలుసని అన్నారు. మతాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం సరికాదని పేర్కొన్నారు.

కొత్త పార్టీ పెట్టుకోవచ్చు.. జగన్‌ను టార్గెట్‌ చేయడం సరికాదు
విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టుకోవాలనుకుంటే ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉందని సజ్జల అన్నారు. అయితే కొత్త రాజకీయ ప్రయాణానికి ప్రచారం కోసం వైయ‌స్‌ జగన్‌ను, వైయ‌స్ఆర్‌సీపీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. టీడీపీ అనుకూల మీడియాకు పనిముట్టుగా మారి పార్టీపై దాడులు చేస్తే ఇక మౌనంగా ఉండే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.

 ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధం

2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ బలహీనపడలేదని, సంస్థాగతంగా తిరిగి పుంజుకుందని సజ్జల తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సాధారణ ఎన్నికలకు పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. అంతకంటే ముందే ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనే సత్తా వైయ‌స్ఆర్‌సీపీకి ఉందని చెప్పారు.

 ఓటర్ల జాబితా శుద్ధి తర్వాతే ఎన్నికలు

ఎన్నికలకు వైయ‌స్ఆర్‌సీపీ భయపడుతోందన్న ప్రచారం అవాస్తవమని సజ్జల అన్నారు. డెడ్‌, అబ్సెంట్‌, లేని ఓట్లను గుర్తించి తొలగించి ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నదే పార్టీ వైఖరి అని తెలిపారు. లేని ఓట్లతో ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

ఆరోపణలకు సమాధానం

తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించిన సజ్జల.. పదవులు, హోదాలు వ్యక్తిగత కిరీటాలు కావని, పార్టీ అప్పగించిన బాధ్యతలు మాత్రమేనని చెప్పారు. వైయ‌స్‌ జగన్‌ విజన్‌కు అనుగుణంగా పనిచేసే అవకాశం రావడమే తనకు ముఖ్యమని తెలిపారు. 2014 వరకు సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా పనిచేసి, అనంతరం పూర్తిస్థాయిలో రాజకీయ బాధ్యతల్లోకి వచ్చానని వివరించారు.

 కేసుల విషయంలోనూ స్పష్టత

టీడీపీతో సంబంధాలు ఉండటం వల్లే తనపై కేసులు లేవన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను సజ్జల ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వైయ‌స్‌ జగన్‌పై కేసులు పెట్టిన సమయంలో విజయసాయిరెడ్డి రాజకీయాల్లోనే లేరని, తాను సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా ఉన్నానని చెప్పారు. భౌతిక దాడులు, అవమానాలపై విజయసాయిరెడ్డికి ఆధారాలు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

వైయ‌స్‌ జగన్‌ నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రజా సమస్యలు, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనే అజెండాతో ముందుకు సాగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత ఆరోపణలతో పార్టీని బలహీనపరచడం సాధ్యం కాదని, కార్యకర్తలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు.
 

Back to Top