రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?

నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పర్యవేక్షణేదీ? :

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.

విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్షనేత, 
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 430 పోస్టుల భారీ కుంభకోణం.. 

దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలి :

బహిరంగ చర్చకు లోకేష్, బాబు సిద్ధమా?

బొత్స సత్యనారాయణ సవాల్.

విశాఖపట్నం : రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, రోజుకో కొత్త సమస్యతో సామాన్య, మధ్యతరగతి ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు తలకిందులై పిల్లలతో సహా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఆడపిల్లలపై దాడులు, గంజాయి మత్తులో దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని ఆయన మండిపడ్డారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పూర్తిగా గాలికొదిలేసి నిత్యావసర ధరల నియంత్రణలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, డీఎస్సీ అక్రమాలపై శాసనమండలిలో చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందని విమర్శించారు. డిఎస్సీపై లోకేష్, చంద్రబాబు తనతో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇంకా ఏమన్నారంటే... 

రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాలన చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రజలు గోదావరి, కృష్ణా నదుల్లో దూకి పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. గంజాయి తాగి యాక్సిడెంట్లు చేసి మనుషులను చంపుతున్నారు, కేసుల్లేకుండా మేనేజ్ చేసుకుంటున్నారు. వీటన్నింటినీ అరికట్టాల్సిన ముఖ్యమంత్రి, అధికారిక పర్యటనలకు వచ్చి సమస్యల పరిష్కారంపై కాకుండా కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమవుతున్నారు.

ఆకాశాన్నంటుతున్న ధరలు 
నియంత్రణ చర్యలు ఏవి?:

సామాన్యుడు కడుపునిండా తిని బతికే పరిస్థితి లేకుండా పోయింది. మార్కెట్లో ధరలను నియంత్రించే చర్యలను పూర్తిగా గాలికొదిలేశారు.  వేరుశెనగ నూనె గతంలో రూ. 150 - 160 ఉంటే, ఇప్పుడు కిలో రూ. 215కి చేరింది.  గ్యాస్ సిలిండర్ ధర రూ. 72 పెరిగి రూ. 937కు చేరింది.  పంచదార రూ. 45 నుంచి రూ. 75కి, ఉల్లిపాయలు రూ. 20 నుంచి రూ. 70కి పెరిగాయి.  అన్నపూర్ణ లాంటి ఏపీలో నాణ్యమైన బియ్యం కిలో రూ. 40-55 నుంచి ఏకంగా రూ. 65-75కి చేరింది. ధరలు పెరిగితే ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసరాలను తెప్పించి నియంత్రించాలనే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అందరూ చంద్రబాబులాగా కోటీశ్వరులు కాదు, కిలోకి రూ. 20 పెరిగితే సామాన్యుడు ఎలా బతుకుతాడు?.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 430 పోస్టుల కుంభకోణం – సీబీఐ ఎంక్వైరీ వేయండి!

దేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పరీక్ష రాయకుండా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరిట ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? ముందుగా జీవో ఇచ్చి, ఉద్యోగాలు తమ వాళ్లకు ఇచ్చేసుకున్నాక ఆ జీవోను ఎందుకు రద్దు చేశారు? 430 ఉద్యోగాలను బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ ఎలా వచ్చింది? జిల్లాల వారీగా మెరిట్ లిస్టులు ఎందుకు బయటపెట్టలేదు? ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి సీబీఐ విచారణ జరిపించాలి. దమ్ముంటే లోకేష్ లేదా చంద్రబాబు నాతో బహిరంగ చర్చకు రావాలి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి.. కౌన్సిల్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వమంటే సమాధానం చెప్పలేక పారిపోయారు.

విద్య, వైద్యం, ఆహార భద్రతలను భ్రష్టు పట్టించారు..

రాజ్యాంగం కల్పించిన విద్య, వైద్యం, ఫుడ్ సెక్యూరిటీలను కూటమి ప్రభుత్వం నాశనం చేసింది. పాఠశాలల్లో గోడలు కూలి విద్యార్థులు చనిపోతుంటే మంత్రుల్లో, అధికారుల్లో స్పందన లేదు. 'నాడు-నేడు' పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గతంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పీహెచ్‌సీల్లో మందులు ఇచ్చి పర్యవేక్షించేవాళ్లం, ఇప్పుడు 'సంజీవని' అని పేరు మార్చి ఏ కొత్త విషయం తెచ్చారో చెప్పాలి. ఆసుపత్రులకు వెళ్తే వైద్యం అందక, మందులు లేక ప్రజలను తిప్పి పంపుతున్నారు. రోజుకు పదిసార్లు కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు.

మహిళలను మోసం చేస్తూ ఊకదంపుడు ప్రచారాలు

సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీ ఏమైంది? కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చే దిక్కులేదు కానీ, మహిళలను లక్షాధికారులను చేస్తామని మాయమాటలు చెబుతున్నారు. వైఎస్సార్ హయాంలో పావలా వడ్డీ, ఆ తర్వాత సున్నా వడ్డీతో మహిళలను ఆదుకుంటే.. చంద్రబాబు రాగానే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. 'తల్లికి వందనం' కింద పూర్తి మొత్తం ఇవ్వకుండా రూ. 7, 8, 9 వేలు మాత్రమే విదిల్చి మిగిలిన బకాయిలను ఎగ్గొట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?

అసెంబ్లీలో డీఎస్సీపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉంటే కౌన్సిల్‌లో ఎందుకు చర్చకు రావడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మెంబర్‌షిప్ రద్దు చేస్తామని స్పీకర్‌ గారు అంటున్నారు. రద్దు చేయమనండి.. ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయనిర్ణేతలు. నారా లోకేష్ 50 సార్లు పిలిచినా మేం భయపడం. లోకేష్‌తోనే కాదు.. చంద్రబాబు గారితో కూడా బహిరంగ చర్చకు నేను సిద్ధం.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం, జీవోలు రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిత్యావసర ధరలు పెరుగుతున్నా నియంత్రణ లేదు. తల్లికి వందనం బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. పీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణలో మాట్లాడుతున్న కూటమి పార్టీలు ఏపీలో ఎందుకు మాట్లాడటం లేదు? భోగాపురం విమానాశ్రయంలో స్థానికులకు కనీసం 200 ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. స్థానిక ప్రజల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం.. ప్రజల కోసం పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం.

విజయసాయిరెడ్డి మాటలపై స్పందించడం టైం వేస్ట్. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కేఏ పాల్ ఉండేవారు.. ఇప్పుడు ఆయన రెండో వ్యక్తి. అలాంటి మాటలపై మాట్లాడటం అనవసరం. ఉత్తరాంధ్ర కీలక నేత జనసేనలోకి వెళ్తున్నారన్న ఆయన మాటలపై స్పందించాల్సిన అవసరం కూడా లేదు. 200 మంది విశాఖ ఎయిర్ పోర్టులో స్థానిక ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయం. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? విశాఖ ఎయిర్‌పోర్టు ఉద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడే మానవత్వం కూడా లేకుండా పోయింది.

స్పీకర్ బెదిరింపులకు భయపడం – ఎన్నికలకు మేం సిద్ధం..

శాసనసభ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని బొత్స హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోతే సభ్యత్వాలు రద్దు చేస్తామని స్పీకర్ అంటున్నారు.. దమ్ముంటే రద్దు చేయమనండి, మేం సిద్ధంగా ఉన్నామని,  ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు, వారే తీర్పు చెబుతారని తేల్చి చెప్పారు. భోగాపురం విమానాశ్రయంలో 50 వేల ఉద్యోగాలని ఊదరగొట్టి, కనీసం స్థానికులకు 200 ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డ బొత్స... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను మేం ఆపం, ఎన్నికలను ఎదుర్కొని ప్రజల పక్షాన పోరాడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Back to Top