అరకు : సంజీవని కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఘాటుగా స్పందించారు. అరకు వ్యాలీ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జగనన్న పథకాలకు పేర్లు మార్చి సంజీవని అంటున్నారు జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు పేరు మార్చి సంజీవని పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని రేగం మత్స్యలింగం అన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్యం అందించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు ఎక్కువయ్యాయని అన్నారు. పని జగనన్నది.. క్రెడిట్ చంద్రబాబుది అమ్మఒడి, వసతి దీవెన వంటి పథకాలకు పేర్లు మార్చి తల్లికి వందనం అంటూ ప్రచారం చేస్తున్నారని రేగం మత్స్యలింగం అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్‌లో ఇప్పటివరకు ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు స్టిక్కర్లు వేసుకుని తిరిగితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నాడు-నేడు పాఠశాలలు.. నేడు కనీస వసతులు కరువు నాడు-నేడు కార్యక్రమంతో జగనన్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిందని రేగం మత్స్యలింగం తెలిపారు. ప్రస్తుతం సుమారు 50 శాతం పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 14 ఏళ్లు పాలించి సంపద సృష్టించలేదు.. ఇప్పుడు సృష్టిస్తారా? 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సంపద సృష్టించలేదని రేగం మత్స్యలింగం అన్నారు. ఇప్పుడు సంపద సృష్టిస్తామని చెబుతున్నారని, ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అమ్మకాలను సంపద సృష్టించడం అంటారా? అని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చూపాలని అన్నారు. ఓట్ల కోసం మతాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు అధికారిక సభల్లో మత ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏముందని రేగం మత్స్యలింగం ప్రశ్నించారు. మతం అనేది వ్యక్తిగత విషయమని, రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఇచ్చిన హక్కు అని తెలిపారు. ఓట్ల కోసం మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం కూటమి ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లల్ని కనమంటారా? ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గిరిజన కుటుంబాలు ఇద్దరు, ముగ్గురు పిల్లలను కనాలని సలహా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రేగం మత్స్యలింగం ప్రశ్నించారు. తల్లికి వందనం, వసతి దీవెన వంటి పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా పిల్లలను కనాలని చెప్పడం సరికాదన్నారు. పిల్లలను కనాలని సలహాలు ఇవ్వడం కాదు, వారిని పెంచే బాధ్యతను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. పింఛన్లలో కోత.. కొత్త పింఛన్లు ఎక్కడ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పింఛన్లు ఇవ్వకపోగా, ఉన్న పింఛన్లలోనూ కోతలు పెడుతున్నారని రేగం మత్స్యలింగం అన్నారు. తమ మాటల్లో నిజం లేదనుకుంటే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో క్షేత్రస్థాయి సర్వే చేయించాలని సవాల్ చేశారు. నిధులు ఇవ్వకుండా అధికారులను నిందించడం ఎందుకు? అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు అధికారులకు విడుదల చేయకుండా వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని రేగం మత్స్యలింగం అన్నారు. నిధులు లేకుండా అధికారులు అభివృద్ధి పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఒక అధికారి విఫలమైతే అది సంబంధిత కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, అరకు వ్యాలీ మండలం జెడ్పీటీసీ సభ్యుడు కమ్మిడి అశోక్, ఎంపీపీ జన్ని నరసింహమూర్తి, వైయస్ఆర్‌సీపీ డుంబ్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురాం, ఎంపీటీసీ సభ్యుడు దురియా ఆనంద్, అరకు వ్యాలీ మండలం బూత్ కమిటీ ఇన్‌చార్జి కొర్ర అర్జున్ రావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్టీసింగి విజయ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నగేష్, మాజీ సర్పంచ్ నాగరాజు, వైయస్ఆర్‌సీపీ నాయకులు కామేష్ తదితరులు పాల్గొన్నారు.