వైయ‌స్ జగన్‌పై వ్యక్తిత్వ హననం కోసం తెరపైకి కొత్త పాత్రలు

అందులో భాగంగా పుట్టుకొచ్చిన కొత్త పాత్రే సాయిరెడ్డి

వైయ‌స్ జగన్‌పై, వైయ‌స్ఆర్‌సీపీపై ఆయనవి అన్యాయమైన మాటలు

వీటిపై స్పందించొద్దని పార్టీ నేతల్ని కోరుతున్నాం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టీకరణ

తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

రెండేళ్ల క్రితం సొంత కారణాలతోనే సాయిరెడ్డి రాజీనామా

పార్టీ వీడిన వారిపై ఎప్పుడూ మేం నెగెటివ్‌గా మాట్లాడలేదు

మతం మార్చాలనుకుంటే ముందు సాయిరెడ్డినే మార్చేవారు

మీడియా దృష్టిలో పడేందుకే సాయిరెడ్డి తపన

ఇంకా స్పందించకపోతే జనం నిజమని నమ్మే ప్రమాదం

సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి

పార్టీలో తన తర్వాత స్థానం జగన్ సాయిరెడ్డికి ఇచ్చారు

కానీ నేను నంబర్ వన్ అని అన్యాయంగా మాట్లాడారు

వైయ‌స్ఆర్‌సీపీలో జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కడే నాయకుడు

సాయిరెడ్డి అయినా నేను అయినా కార్యకర్తలమే

పదవుల్ని కీర్తి కిరీటాలుగా ఎప్పుడూ భావించలేదు

సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత

సాయిరెడ్డికి వైయ‌స్ హయాం నుంచీ పదవులిచ్చారు

ప్రాధాన్యం తగ్గిస్తే రెండోసారి రాజ్యసభ ఎంపీ ఎలా దక్కింది?

కాంగ్రెస్‌లో కోటరీ పదాన్ని వైయ‌స్ఆర్‌సీపీకి రుద్దుతారా?

వైయ‌స్ఆర్‌సీపీలో నాడూ, నేడు జరుగుతోంది టీమ్ వర్కే

సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ

తనతో పాటు ఇబ్బందులు పడ్డారని సాయిరెడ్డిని జగన్ గౌరవించారు

అది తన సొంత ప్రతిభే అనుకోవడం సాయిరెడ్డి మూర్ఖత్వం

సొంత పార్టీకి మీడియా స్పేస్ కోసం జగన్ గారిపై విమర్శలా?

సాయిరెడ్డి వ్యాఖ్యలతో జగన్, వైయ‌స్ఆర్‌సీపీ గౌరవం తగ్గవు

తేల్చిచెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీపై, పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, తనపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శనంగా ఉన్నాయని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైయ‌స్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ పదవులు అనుభవించిన సాయిరెడ్డి.. ఇప్పుడు సొంత రాజకీయాల కోసం జగన్ మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారానికి దిగారని, కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకున్న కోటరీ పదాన్ని వైయ‌స్ఆర్‌సీపీపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సాయిరెడ్డికి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో గౌరవం ఇచ్చారని, అయినా సొంత అజెండాతో పార్టీ వదిలివెళ్లిపోయి, రెండేళ్ల తర్వాత తిరిగి అదే పార్టీపై బురద జల్లడం ఎవరి ప్రయోజనాల కోసమని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

వైయ‌స్ జగన్ వ్యక్తిత్వ హననం కోసం పుట్టుకొచ్చిన కొత్త పాత్ర

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు తన తండ్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు. తర్వాత ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. కాంగ్రెస్ పార్టీతో అప్పటి కుమ్మక్కై ప్రజల అజెండాను పక్కనబెట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని ఇప్పటివరకూ దాడులు చేస్తూనే ఉంది. వాటన్నింటినీ అధిగమించి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం ద్వారా ఓ వ్యవస్థగా మారారు. సుదీర్ఘకాలం ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సత్తా ఉన్న పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీని ఆయన తీర్చిదిద్దారు. అదే క్రమంలో రికార్డు స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఐదేళ్లలోనే 15-20 ఏళ్లకు తగినంతగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కూడా సక్సెస్ అయ్యారు. దీంతో ఆయనపై వ్యక్తిత్వ హననం కూడా పెరిగింది. అందులో భాగంగా కొత్త పాత్రలు వస్తాయి. వాటి ఎక్స్‌పైరీ డేట్ పూర్తయితే మరిన్ని పాత్రలు వస్తాయి. సోషల్ మీడియా పేరుతో ఉన్న వేలాది ఫేక్ మీడియా ఫ్యాక్టరీలు కూడా వస్తాయి. ఇందులో వాళ్లకు కావాల్సిన పాత్రలకు మీడియాలో భారీగా ప్రాచుర్యం కూడా వస్తుంది. ప్రజలకు చంద్రబాబు, వాళ్ల ముఠా సంజాయిషీ ఇవ్వాల్సిన అంశాలన్నీ పక్కకుపోయి వీటిపైనే చర్చంతా నడుస్తుంది. ఇలాంటి విషయాలపై మేం మాట్లాడకపోతే ప్రజలు అదే నిజమని అనుకునే పరిస్థితి వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి గారు ఓ నాయకుడు కాదు, ఆయన పెట్టింది ఓ పార్టీ కాదు, ఆయన చుట్టూ ఓ పెద్ద కోటరీ ఉంటుంది, ఆయన ఏ నిర్ణయం కూడా తీసుకోలేరని అంతా అనుకోవాలి. పబ్లిసిటీ కోసం చంద్రబాబు, ఆయన ముఠా చేసుకునే పనులన్నీ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు. నిజంగా ప్రజలకు అవసరమైన అంశాలపై చర్చలన్నీ తగ్గిపోతాయి. వాటిపై చర్చ జరిగితే వారికి మైనస్ మార్కులు పడతాయి కాబట్టి. చంద్రబాబు కానీ, ఆ పార్టీకి సిద్ధాంతకర్తలుగా ఉన్న మీడియా కానీ ఏ రోజూ ప్రజల గురించి ఆలోచించలేదు. అందులో అప్పుడప్పుడు వచ్చిపోతున్న కొత్త పాత్ర విజయసాయిరెడ్డి.

వైయ‌స్ జగన్ మీద సాయిరెడ్డివి అన్యాయమైన మాటలు

విజయసాయిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి గారి వల్ల వైయ‌స్ఆర్‌సీపీలో ప్రముఖ పాత్ర పోషించి, ఆయన సొంత కారణాల వల్ల బయటికి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెడతానంటున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచీ చాలా మంది వచ్చారు, కొందరు వెళ్లిపోయారు. పోయిన వాళ్ల గురించి జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడలేదు, మమ్మల్నీ మాట్లాడనివ్వరు. ఏదేమైనా స్థిరమైన, బలమైన, నిబద్ధత కలిగిన పార్టీగా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు సాగుతూనే ఉంటుంది. 2024 ఎన్నికల్లో అంత పెద్ద ఎదురుదెబ్బ తగిలినా, ఈ రెండేళ్లలో సంస్థాగతంగా తిరిగి పుంజుకుని స్థానిక సంస్థలైనా, సార్వత్రిక ఎన్నికలైనా, అవి ఎప్పుడొచ్చినా వాటికి సన్నద్ధంగా ఉన్నాం. చంద్రబాబులా వేరే ఎత్తులు వేసి కోర్టులకు వెళ్లడం లేదు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 44 లక్షల మందిని తొలగిస్తే, వాటిని క్లియర్ చేసి ఎన్నికలకు వెళ్లాలని కోర్టులకు వెళ్లాం. వైయ‌స్ఆర్‌సీపీకి ఎన్నికలంటే ఎప్పుడూ భయం లేదు. ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున ఓట్లు తీసేశాక, ఉన్న ఓట్లతోనే ఎన్నికలు నిర్వహించడం సరికాదని మాత్రమే చెబుతున్నాం. 40 ఏళ్లతో వైయ‌స్ కుటుంబంతో సంబంధం ఉన్న విజయసాయిరెడ్డి.. జగన్ మోహన్ రెడ్డికి మతమార్పిడులతో సంబంధం ఉందని దారుణమైన, అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నాడు. అలా చేయాలని ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు ముందు విజయసాయిరెడ్డినే మార్చి ఉండేవారు కదా. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి హయాం నుంచి కూడా అన్ని మతాల్ని మేం ఎలా గౌరవిస్తామో తెలుసు. వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో టీటీడీ మెంబర్‌గా సాయిరెడ్డి పనిచేసినప్పుడు అక్కడ అన్యమతస్తుల తొలగింపు, ఏడు కొండల వ్యవహారంలో తీసుకున్న చర్యలు ఆయనకూ తెలుసు. అయినా మసి గుడ్డ వేసి తుడుచుకోమన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సాయిరెడ్డి అర్జంటుగా ప్రజల దృష్టి తనపై పడాలని తపన పడుతున్నారు, ఈ మాట అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడులో వేస్తారని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా సరే ఎవరూ మాట్లాడలేదు. సాయిరెడ్డికి అవకాశం ఇవ్వకూడదనే, ఆయన ట్రాప్‌లో పడకూడదనే మా పార్టీ నేతలు స్పందించలేదు. దీంతో ఇలా లాభం లేదని మరో లేఖ పెట్టారు. ఆ మీడియా ఎప్పటిలాగే దీనిపై చొక్కాలు చించుకుంటోంది. వైయ‌స్ఆర్‌సీపీ అంటే ఏమీ లేదు, ఇక జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన కోటరీ మాత్రమేనని విష ప్రచారం చేస్తోంది.

వైయ‌స్ఆర్‌సీపీలో వైయ‌స్ జగనే నాయకుడు, మేం కార్యకర్తలమే

సాయిరెడ్డి రాసిన లేఖలో నా మీద కూడా మాట్లాడారు. దీనిపై మాట్లాడకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుందని స్పందించాల్సి వస్తోంది. జగన్ మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో అంత స్థాయిలో కూర్చోబెట్టింది సాయిరెడ్డినే. మేమంతా సహాయ పాత్రల్లోనే ఉన్నాం. పదవులనేవి ఓ బాధ్యత కాబట్టి, నేను వాటిని ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. జగన్ మోహన్ రెడ్డి గారి స్థానం నంబర్ టూ, సజ్జల రామకృష్ణారెడ్డి స్థానం నంబర్ వన్ అని అన్యాయంగా మాట్లాడారు. ముందు నుంచీ వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కర్త, కర్మ, క్రియ జగన్ మోహన్ రెడ్డి గారే. ముందు నుంచీ ఆయన తండ్రి ఆలోచనలతో పార్టీని నడుపుతున్నది జగన్ మోహన్ రెడ్డి గారే. పాలన, ప్రభుత్వం మానవత్వంతో చేయాలనే ఆలోచన ఆయనది. ఆ అజెండాతోనే ఆయన అడుగులు వేస్తే, దాన్నే విశ్వసించి ప్రజలు అధికారం ఇచ్చారు. 99.9 శాతం ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేసి ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కరే నాయకుడు. మిగిలిన వాళ్లంతా కార్యకర్తలమే. ఎందుకంటే సాయిరెడ్డి అయినా నేను అయినా రాజకీయం వృత్తిగా ఎంచుకున్న వాళ్లం కాదు. సాయిరెడ్డి ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా, నేను జర్నలిస్టుగా ఉండి, వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారి హఠాన్మరణం తర్వాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాం. 2014 వరకూ సాక్షికి ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉంటూనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు కాబట్టే చెప్పలేదు.

సాయిరెడ్డికి వైయ‌స్ఆర్‌ హయాం నుంచీ పదవులు

పార్టీ అవసరాలు తెలుసుకుని, వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా భావించాను. పదవుల్ని కీర్తి కిరీటాలుగా ఎప్పుడూ భావించలేదు. అందుకే నాకు ఏ పదవులు ఉన్నా లేకపోయినా, రకరకాల కామెంట్స్ చేసినా ఆ రొచ్చులో ఎందుకు పడాలని స్పందించలేదు. హోదాల వల్ల వచ్చే కిరీటాల కంటే వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి విజన్‌కు తగినట్లుగా, పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ చేశాను. నా వరకూ ఓ విజనరీతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తుంటాను. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంటే, అందులో నా పాత్ర ఉందంటే అదృష్టమే కదా. అలా చూస్తే సాయిరెడ్డికి ఈ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రేమ చూపించేవారు. పార్టీలో ఇచ్చిన పదవులు చూస్తే ఆయనకు అన్యాయం జరిగిందో లేదో తెలుస్తుంది. పార్టీ నుంచి ఆయన ఎందుకు బయటికి వెళ్లారో కూడా తెలియదు. అప్పట్లో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని చెప్పారు. సజ్జల పాత్ర ఉందా అని అడిగితే అస్సలు సంబంధం లేదని చెప్పారు. పైగా నా ప్రాతినిధ్యాన్ని ఎవరూ తగ్గించలేరని కూడా చెప్పుకున్నారు. పదవుల రీత్యా చూస్తే వైయ‌స్ రాజశేఖరరెడ్డి గారు ఉండగా కాంగ్రెస్ హయాంలో టీటీడీలో రెండు సార్లు సభ్యుడు, తర్వాత ఓ బ్యాంక్ డైరెక్టర్, 2016లో రాజ్యసభ సభ్యుడు, 2017లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ ప్యానెళ్ల ఛైర్మన్ పదవులు, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, రెండోసారి రాజ్యసభ సభ్యుడు ఇలా పనిచేశారు. పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గించడానికి ప్రయత్నించారని సాయిరెడ్డి చెప్పారు. అలా అయితే రెండోసారి రాజ్యసభ పదవి ఎందుకిస్తారు? టీఎంసీ తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంట్‌లో రెండో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులూ లేవు. అందరూ కార్యకర్తలే అయినా ఫీల్డ్‌లో ఉన్నవాళ్లకు ఎక్కువ గౌరవం, ప్రాధాన్యం ఉండేది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను, ప్రత్యర్థుల తప్పుల్ని ఎత్తిచూపడం కానీ చేశాను. ఇలా మేం అంతా కలిసి టీమ్ వర్క్ చేశాం. ఎక్కడో కాంగ్రెస్‌లో వినిపించే కోటరీ పదాన్ని తీసుకొచ్చి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దడం ఏంటో అర్థం కాలేదు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా వైయ‌స్ఆర్‌సీపీని నిలబెట్టి దేశ చరిత్రలోనే అతి పెద్ద విజయాలతో రికార్డు సృష్టించారు. దీనికి కారణం ఆయనకు ఉన్న నిబద్ధత, స్పష్టత. మరో కారణం పార్టీలో ఎవరికి ఇచ్చిన పాత్రలు వాళ్లు నిర్వర్తించడం, అలాంటి టీమ్‌ను నడపగల జగన్ మోహన్ రెడ్డి గారి సామర్థ్యం. రాష్ట్రంలో ఇలాంటి పార్టీ మరొకటి లేదు. ఇప్పుడు ప్రజా సమస్యలు కాకుండా... లేని అజెండా, సున్నితమైన అంశాల్ని తెరపైకి తీసుకొచ్చి కోటరీ అనడం, నాయకత్వం లేదనడం సాయిరెడ్డికే చెల్లింది.

మీడియాలో స్పేస్ కోసం మాపై విమర్శలా?

ఓ నాయకుడి తలలో ఉన్న ఆలోచనతో రూపుదిద్దుకున్న పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. ఎలాంటి తప్పటడుగులు వేయకుండా, అధికారంలో ఉన్నా, ఎన్నికల్లో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలి ప్రతిపక్షంలో ఉన్నా, రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి మీద, అన్ని వర్గాల అభివృద్ధి మీద ఎలాంటి గందరగోళం లేని పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమే. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్లే ఇది సాధ్యమవుతోంది. మా లాంటి నాయకులకు ఇది అరుదైన అవకాశం. జర్నలిస్టులుగా ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీని చూసి, వైయ‌స్ఆర్‌సీపీ లాంటి పార్టీ ఒకటి ఉంటే బావుంటుందని అనుకునే వాళ్లం. ప్రజల గురించి ఆలోచనే లేని వాడు కాబట్టి ఆయన స్థిరంగా నిలడలేడు. ఊతకర్రల సాయంతో ఓసారి అధికారంలోకి వస్తాడు, మరోసారి పక్కకుపోతాడు. మళ్లీ ఇంకెవరితోనే జట్టుకట్టి మళ్లీ అధికారంలోకి వస్తాడు. అది ఆయన రాజకీయాల తీరు. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకున్నా రాజీపడకుండా విశ్వసనీయత కాపాడుకుంటూనే ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఓ బ్రాండ్ కాబట్టి ఇంత పెద్ద ఎదురుదెబ్బలు తగిలినా నిలబడి నడిపిస్తున్నారు. ఇందులో కోటరీలు ఎందుకుంటాయి, ఎక్కడ ఉంటాయి సాయిరెడ్డికే తెలియాలి. తనతో పాటు ఇబ్బందులు పడ్డారన్న కారణంతో మిగిలిన వాళ్ల కంటే సాయిరెడ్డి మీద జగన్ మోహన్ రెడ్డి గారికి కొంచెం సానుకూలత ఉండేది. అది ఆయన సొంత ప్రతిభ అని అనుకునేవారు. ఆయన ఇప్పుడు పార్టీ పెట్టుకున్నా మంచిదే. అయితే ఆ పార్టీ పెట్టడానికి, పేపర్‌లో, మీడియాలో స్పేస్ కోసం జగన్ మోహన్ రెడ్డి గారినో, పార్టీని ఏదో అంటానంటే ఎల్లకాలం ఎవరూ వదిలిపెట్టరు. కొంతకాలం చూద్దామని వదిలేసినా, ఎల్లకాలం అలాగే చేస్తానంటే మన సాయిరెడ్డి అనే దగ్గరి నుంచి భిన్నంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఆయన నిజమైన రాజకీయాలు చేస్తానంటే చేయొచ్చు. వైయ‌స్ఆర్‌సీపీకి సంబంధించినంత వరకూ సాయిరెడ్డి చెప్పే మాటలు కుటిలత్వం, నీచబుద్ధి బయటపడుతుందే తప్ప జగన్ మోహన్ రెడ్డి గారి గౌరవం కానీ, పార్టీ ప్రతిష్ఠ కానీ తగ్గేదేమీ ఉండదు.

డిబేట్లు పెట్టుకునే వాళ్లకు శునకానందం ఉంటే ఉండొచ్చు. నాకు టీడీపీతో సంబంధం లేకపోతే కేసులు ఎందుకు పెట్టారని కూడా అడుగుతున్నారు, జగన్ మోహన్ రెడ్డి గారిపై కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టినప్పుడు రాజకీయాల్లో లేని సాయిరెడ్డి గారు ఎవరికి తెలుసు? ఆయన అప్పట్లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉంటే, నేను సాక్షిలో ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్నాను. ఒప్పందం చేసుకున్నాను కాబట్టి నేను అరెస్టు కాలేదంటున్నారు, మరి సాయిరెడ్డి ఇప్పుడు ఎలా తప్పించుకుంటున్నారు. దీన్ని బట్టి చూసినా ఎవరు కుమ్మక్కయ్యారో తెలుస్తుంది. కేవలం ప్రజా సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్తులో సాయిరెడ్డి ఇలాంటి లేకి వ్యాఖ్యలు చేసినా మా నాయకుల్ని పట్టించుకోవద్దని చెబుతున్నాం. నేను కూడా స్పందించవద్దనే నిర్ణయించుకున్నాను. జగన్ మోహన్ రెడ్డి గారు వైయ‌స్ఆర్‌సీపీని పెట్టడం వల్లే సాయిరెడ్డి అనే వ్యక్తి గురించి నలుగురికీ తెలిసింది. మాకు జర్నలిస్టులుగా ప్రజలతో, నాయకులతో కొంతయినా సంబంధం ఉంది. కానీ సాయిరెడ్డి సోషల్ మీడియా పుణ్యమాని మీడియా పెడతాను, పార్టీ పెడతా అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నాడంటే దాని పునాది జగన్ మోహన్ రెడ్డి గారే. అలాంటి నాయకుడికి సంబంధించి సాయిరెడ్డి చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే, ఆయన ఎక్కడికి దిగజారాడో తెలుస్తుంది.

మీడియా ప్రశ్నలకు సమాధానాలిస్తూ..

తనపై నేను దాడి చేశానని సాయిరెడ్డి చెబుతున్నాడన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... 2016లోనే నమోదైన కేసులకు చంద్రబాబు ఇప్పుడు అరెస్టులు చేయిస్తున్నాడు. కాబట్టి సాయిరెడ్డి తనపై హత్యాయత్నం సెక్షన్ 307 కింద నాపై ఫిర్యాదు చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టొచ్చు, కానీ ఒక్కసారిగా ఊహించనంత స్థాయి వచ్చే సరికి, తాను గొప్ప అనే ఆలోచనలు వస్తుంటాయి. దాని నుంచి వచ్చిన ఆలోచనలే పార్టీ పెట్టడం, పాదయాత్రలు చేయాలనుకోవడం. కానీ వీళ్ల స్థాయి కింద ఉండే కార్యకర్తలకు కూడా తెలుసు. ఆ రొచ్చులోకి మేం వెళ్లాలనుకోవడం లేదు.
 

Back to Top