రైతుల కష్టాలు, కన్నీళ్లు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా?

రాయలసీమకు నీటి విడుదల ఎప్పుడు?

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటి మూడో సంవత్సరంలోకి వచ్చినా రైతుల కష్టాలు మాత్రం తీరలేదని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ఏడాది పంట నష్టం, రెండో ఏడాది గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఈ ఏడాది పంటలు సాగు చేయలేని దుర్భిక్ష పరిస్థితులు రైతులను వెంటాడుతున్నాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో 873 అడుగుల నీటి నిల్వ ఉన్నప్పటికీ రాయలసీమకు సాగు, తాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.

కానాల చెరువును పరిశీలించిన శిల్పా రవి

ఆదివారం నంద్యాల మండలం కానాల చెరువును స్థానిక నాయకులు, రైతులతో కలిసి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిశీలించారు. చుక్కనీరు లేక చెరువు ఎండిపోయిందని, గత రెండేళ్లుగా నష్టపోతున్న రైతులు ఈ ఏడాదైనా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుందని ఆశించారని, వారి ఆశలు నిరాశగా మారాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులే పంటలు సాగు చేయవద్దని సూచిస్తున్న పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ వనరులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు నిలిపివేశారు?

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని శిల్పా రవి అన్నారు. సాగునీరు లేక రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి, తాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు, పశువులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేసి రాయలసీమ ప్రజలను ఆదుకోవాలని కోరారు.

రైతులకు బీమా, అన్నదాత సుఖీభవ ఎక్కడ?

రైతులకు కనీసం పంటల బీమా కూడా అందడం లేదని, అన్నదాత సుఖీభవ పథకం ఊసే లేదని శిల్పా రవి పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు.

కానాల చెరువు మట్టి తవ్వకాలపై శ్వేతపత్రం

కానాల చెరువులో మట్టి తవ్విన గుంతలు కనిపిస్తున్నాయని, ఆ మట్టిని ఏ ప్రాజెక్టు అవసరాల కోసం తవ్వారు, దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత, మైనింగ్‌ వారికి ఎంత, ఇరిగేషన్‌ శాఖకు ఎంత అందిందో ప్రభుత్వం వెల్లడించాలని శిల్పా రవి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ విజయశేఖర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రంగారావు, పీడీ ఉసేన్‌, శంకర్‌, కాసిం, మరియదాస్‌, కరీం, పక్రుద్దీన్‌, అల్లూరయ్య, సన్నా, జమాల్‌ బాషా, ఫరూక్‌, నాగవుశేని, మధుగౌడ్‌, పకీర్‌ సా తదితరులు, గ్రామ రైతులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
 

Back to Top