కాకినాడ: కాకినాడలో జరిగిన దురదృష్టకర ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సాదిక్ రైఫిల్ షూటింగ్ అకాడమీ ప్రారంభోత్సవానికి ఆహ్వానం మేరకు వెళ్లి, ముస్లిం పెద్దలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఆ సందర్భంగా సాదిక్‌ను కలవడం మినహా ఆ తర్వాత ఎప్పుడూ ఆయనను కలవలేదని స్పష్టం చేశారు. సాదిక్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ శ్రేణులు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. కాకినాడలో తాను ఏంటో, తన గురించి ప్రజలకు పూర్తిగా తెలుసని అన్నారు. సాదిక్ అకాడమీలో తన బంధువుల పిల్లలతో పాటు పోలీసు సిబ్బంది పిల్లలు కూడా రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నారని తెలిపారు. రెండున్నరేళ్లుగా మౌనంగా ఉన్నా.. కాకినాడలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ద్వారంపూడి అన్నారు. గత రెండున్నరేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని, త్వరలో అన్ని అంశాలను బయటపెడతానని స్పష్టం చేశారు. ఒక దుర్ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ రంగు పులమడం సరికాదని ద్వారంపూడి అన్నారు. ఈ ఘటనలో నూకరాజు కుటుంబానికి న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి, వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.