శెట్టూరు ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాలి

  మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు  చంద్రశేఖర్‌ యాదవ్ డిమాండ్‌

అనంతపురం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో గోడ కూలి విద్యార్థి మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు జి. చంద్రశేఖర్‌ యాదవ్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన వసతి, ఆహారం, విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. హాస్టల్‌ భవనాల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించి, ప్రమాదకరంగా ఉన్న గోడలు, భవనాలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ విషాదం జరిగేది కాదని పేర్కొన్నారు. ఘటనకు దారితీసిన కారణాలు, హాస్టల్‌ భవనం పరిస్థితిని అధికారులు ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారనే అంశాలపై ప్రత్యేక అధికారుల బృందంతో విచారణ జరపాలని కోరారు.

మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం

గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్‌ యాదవ్‌ కోరారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటు, అవసరమైన అన్ని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర సంక్షేమ వసతి గృహాల భవనాలపై ప్రత్యేక భద్రతా ఆడిట్‌ నిర్వహించాలని కోరారు. ప్రమాదకరంగా ఉన్న గోడలు, భవనాలు, పైకప్పులు, విద్యుత్‌ వైరింగ్‌, మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను తక్షణమే పరిశీలించి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని సూచించారు. నిర్మాణం పూర్తికాని మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే విద్యార్థుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

 ప్రతి హాస్టల్‌లో నెలవారీ భద్రతా తనిఖీలు

ప్రతి సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థుల భద్రతపై నెలవారీగా తనిఖీలు నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించే విధానం అమలు చేయాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే వార్డెన్లు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.  విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థి నాయకులను హాస్టళ్లలోకి అనుమతించని ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని చంద్రశేఖర్‌ యాదవ్‌ కోరారు. విద్యార్థుల భద్రతను ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే అంశంగా కాకుండా ప్రభుత్వం ముందస్తు బాధ్యతగా పరిగణించాలని స్పష్టం చేశారు. శెట్టూరు ఘటనపై బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది.
 

Back to Top