తాడేపల్లి: డిఎస్సీతో పాటుగా ఏపీపీఎస్సీపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వానికి విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఉందా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ సవాల్ విసిరారు. ఏపీపీఎస్సీపై ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని వైఎస్ జగన్మహన్ రెడ్డి స్పష్టంగా సవాల్ విసిరారని ఆయన గుర్తు చేసారు. ఆ సవాల్‌ను స్వీకరించి విచారణకు ఆదేశించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని నిలదీసారు. అలాగే డీఎస్సీ జరిగన అక్రమాలు, అవకతకలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ సంస్థతో విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సీబీఐ విచారణ జరిపించే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేశ్ కు ఉందా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగన మీడియా సమావేశంలో జుపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, సంఖ్యాబలం ఉందని అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా అధికారంలో ఉంటారని అనుకోవద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. నిరుద్యోగుల ఆవేదనకు, విద్యార్థుల ప్రశ్నలకు, తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. డీఎస్సీపై విచారణ జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది” అని జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... వరుసగా జీఓలు, మార్పులు వెనుక మర్మమేంటి..? డీఎస్సీ అనేది ప్రభుత్వం నిర్వహించే నియామక ప్రక్రియ. అందులో నిబంధనలు, జీవోలు మారుస్తూ వెళ్లడం వల్ల అభ్యర్థుల్లో అనేక అనుమానాలు ఏర్పడ్డాయి. పరీక్షలో అర్హత సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పక్కన పెట్టడం ఎందుకు జరిగిందనే అనుమానాలు అందిరిలోనూ బలంగా ఉన్నాయి. డీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ అయిందా? ప్రశ్నలు బయటకు వెళ్లాయా? అక్రమాలకు ఎవరు బాధ్యులు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధపడాలి. ప్రతిపక్షం ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా, విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీయడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ప్రజలు ఇప్పుడు గత పాలనను, ప్రస్తుత పాలనను స్వయంగా బేరీజు వేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం అప్పట్లో ఏపీపీఎస్సీ నిర్వహిస్తే ఒక్క ఆరోపణ కూడా లేదు. కానీ ఇప్పుడు డిఎస్సీని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తే అనేక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ఆధారాలు బలంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఐదేళ్ల పాటు ప్రజలకు జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిందే. ప్రజల సమస్యలపై పోరాడితే బాధ్యత వహించి సమాధానం చెప్పాల్సిందే. ఏపీపీఎస్సీపై బురదజల్లే ప్రయత్నం ఎందుకు? ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ. దాని పనితీరుపై ఆరోపణలు ఉంటే వాటిపైనా విచారణ జరిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు స్వయంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, పరీక్ష జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ కూడా విచారణకు సిద్ధమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే ఒక వ్యవస్థలో లోపాలను చూపించి, మరో వ్యవస్థపై బురదజల్లడం సరికాదు. చంద్రబాబు, లోకేశ్ వ్యవహార తీరు చూస్తుంటే డీఎస్సీ అంశాన్ని పక్కదారి పట్టించాలనే ప్రయత్నం జరుగుతోంది. పీపీఎస్సీలో ఏమైనా తప్పులు జరిగాయని మీకు అనుమానం ఉంటే దానిపైనా విచారణ చేయండి. కానీ ఇప్పుడు డీఎస్సీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం ఎందుకు? మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే.. డీఎస్సీ నిర్వహణలో తప్పులు జరిగాయని ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అంగీకరించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేసి జరిగిన తప్పులకు బాధ్యత వహించాలి. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఉంటే బాధ్యత తీసుకుని మంత్రి పదవికి రాజీనామా చేయడం తప్పిదం ఏమీ కాదు. నిజాయితీగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు. లోకేశ్ రాజీనామాకు సంబంధించి కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మాత్రమే కాదు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల గత కొన్నాళ్లుగా చేసిన పోరాటాలు, ఉద్యమాల నుంచి రేకెత్తిన డిమాండ్. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ ఆత్మావలోకన చేసుకుని డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధపడాలి. లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. స్పోర్ట్స్ కోటా అక్రమాలపై సమాధానం చెప్పాలి స్పోర్ట్స్ కోటా విషయంలో ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు చట్టబద్దంగా లేవు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రత్యేక అవకాశాలను, పాఠశాలల్లో క్రీడలను బోధించాల్సిన ఉపాధ్యాయుల నియామకాల్లోని స్పోర్ట్స్ కోటాతో కలిపి చూడటం సరికాదు. విద్యార్థులకు క్రీడలను బోధించాల్సిన ఉపాధ్యాయుడికి సంబంధిత నైపుణ్యం, అర్హతలు ఉండాల్సిన అవసరం ఉంది. అర్హతలు, నైపుణ్యాల విషయంలో చంద్రబాబు, లోకేశ్ రాజకీయంగా రాజీ పడ్డారు. రాజకీయ రాజీతో విద్యార్థుల, యువత, నిరుద్యోగులు, భవిష్యత్ తరాలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యా రంగంలో చేపట్టిన నాడు–నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శనంగా నిలిచాయి. ఎంతోమంది నిపుణులు, విద్యావేత్తల ప్రశంసలను పొందాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను పెంచేందుకు గత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయ కక్షలకు వేదికగా మార్చడం సరికాదు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే వారికే మంచిది.