తాడేపల్లి : డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అక్రమాలపై కూటమి ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ కోటా పేరుతో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందని ఆయన ధ్వజమెత్తారు. డిఎస్సీలో ఇంతటి భారీ స్కామ్ జరిగినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత లేకుండా దబాయిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ వేయాలని సవాల్ విసిరారు. మరోవైపు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో, అటు డీఎస్సీ, ఇటు ఏపీపీఎస్సీ రెండింటిపైనా ఒకేసారి సీబీఐ విచారణ జరిపించాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... సీబీఐ పేరు వింటేనే గుండెల్లో దడ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణ వేయాలని మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా సవాల్ విసిరారు. కానీ సీబీఐ పేరు వింటేనే చంద్రబాబు, లోకేష్‌లకు గుండెల్లో దడ పుడుతోంది, బీపీ పెరిగిపోతోంది. ఏపీపీఎస్సీపై సిట్‌లు వేసి కాలయాపన చేస్తూ, డీఎస్సీలో జరిగిన బహిరంగ అక్రమాలపై మాత్రం నోరు మెదపడం లేదు. ఒక సిట్ రిపోర్టు తమకు అనుకూలంగా రాలేదని మరో సిట్ వేయడం వీరి రాజకీయ కుట్రలకు నిదర్శనం.నిజంగా పారదర్శకతపై నమ్మకం ఉంటే డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలి. పరీక్ష లేకుండా 372 పోస్టులు ఇవ్వడం ఏ చట్టంలో ఉంది? ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పరీక్ష రాయకుండా, ఎలాంటి రూల్ బుక్ లేకుండా స్పోర్ట్స్ కోటా కింద 372 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెట్టిన ఘనత నారా లోకేష్‌కే దక్కుతుంది. ఈ 372 పోస్టుల కోసమే నాలుగు జీవోలు తెచ్చి నచ్చినట్టు గేట్లు ఎత్తడం, మూయడం చేశారు. టీడీపీ నాయకుడు ఇచ్చిన గుర్తింపు లేని సర్టిఫికెట్లతో కేవలం పార్టిసిపెంట్లకు ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును నాశనం చేశారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వాళ్లకే మెరిట్ లిస్ట్‌లో మొదటి ర్యాంకు వచ్చే విచిత్రాలు డీఎస్సీలో జరిగాయి. మండలిలో నిలదీస్తే పారిపోయిన మంత్రి లోకేష్.. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ లేకపోవడంతో సింహాల్లా మాట్లాడుతున్న తండ్రికొడుకులు శాసన మండలిలోకి వచ్చేసరికి మౌనంగా ఉంటున్నారని విమర్శిస్తున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండలిలో ఉండి కూడా డీఎస్సీ అక్రమాలపై మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోయారు.మండలిలో నాలుగు రోజులు సమావేశాలు జరిగితే రెండు రోజులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభలో ఉండి కూడా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు. బయట ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను శాసనమండలిలో చూపించే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? మీరు ఎంత దూరం పారిపోయినా యువతకు సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన తప్పులకు, ఉద్యోగాల భర్తీపై వస్తున్న ఆరోపణలకు లోకేష్ ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాల్సిందే. డీఎస్సీపై సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి. ఇక డీఎస్సీ అక్రమాలపై బీజేపీ, జనసేన నాయకులు కూడా స్పందించాలి. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించే ధైర్యం వారికి ఉందా లేదా చెప్పాలి. ఇది డబుల్ ఇంజిన్ స్కామ్‌ల సర్కార్.. రాజధాని పేరుతో తండ్రి స్కామ్ నడిపిస్తుంటే, డీఎస్సీ పేరుతో కొడుకు స్కామ్ నడిపిస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు, తండ్రీకొడుకుల డబుల్ ఇంజిన్ స్కామ్‌ల ప్రభుత్వం. ప్రశ్నించడానికే పుట్టామన్న పవన్ కళ్యాణ్ గానీ, బీజేపీ నాయకులు గానీ ఈ బహిరంగ దోపిడీపై ఎందుకు నోరు విప్పడం లేదు? డీఎస్సీ అవినీతిపై సీబీఐ విచారణ వేసే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ నిరుద్యోగ యువత పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. డీఎస్సీ స్కామ్‌పై బీజేపీ, జనసేన మౌనం ఎందుకు? డీఎస్సీ వ్యవహారంపై మీ వైఖరి ఏంటో బీజేపీ, జనసేన స్పష్టంగా చెప్పాలి. జీవోలు మార్చగలరేమో కానీ ప్రజల ప్రశ్నలను మాత్రం మార్చలేరు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి నేతల కుటుంబ సభ్యులపై వస్తున్న గంజాయి, రోడ్డు ప్రమాదాల ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు? ఒకే రకమైన ఘటనల్లో వేరొకరికి ఒకరకమైన న్యాయం, కూటమి నేతల కుటుంబ సభ్యులకు మరో న్యాయం ఎందుకని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో గంజాయి రహిత పాలన అని చెప్తూ కూటమి నేతలే యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారని మండిపడ్డ ఆయన... పోలీసులే స్వయంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి నేతల పిల్లలు తప్పులు చేస్తే చూసీచూడనట్లు వదిలేస్తూ, ఇతరులపై అక్రమ కేసులు బనాయించడం వెన్నుపోటు పార్టీ కూటమి సర్కార్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు.