తాడేపల్లి: రామోజీ రావు చనిపోవడం వల్లే మార్గదర్శి కేసులో ఆయనపై వచ్చిన ఫిర్యాదును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని, ఆయనపై క్రిమినల్ కేసు కొట్టేసినా, సివిల్ కేసు మాత్రం కొనసాగుతుందని వైయస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన, ఆయన వసూలు చేసిన డిపాజిట్లు సక్రమం అని, ఆయన కడిగిన ముత్యం అని క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని అంబటి తేల్చిచెప్పారు. మార్గదర్శి కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు. ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... రామోజీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈ నెల 20న డిస్మిస్ చేసింది. రామోజీరావుపై విమర్శ చేయడం బాధాకరమైన అంశంగానే భావిస్తున్నాను. మరణించిన వ్యక్తి గురించి మాట్లాడాల్సిన రావడం బాధ కలిగించే అంశం. అయినా అనివార్య పరిస్ధితుల్లో ఆయన గురించి మాట్లాడాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శి పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత రామోజీరావు గారి పత్రికతో పాటు ఎల్లో మీడియా, వివిధ యూట్యూబ్ ఛానల్స్ కడిగిన ముత్యంలా వచ్చారని, మట్టిలో మాణిక్యమని, మహాత్ముడని పొగడ్తలు ప్రారంభించారు. చంద్రబాబు కూడా రామోజీరావు మహాత్ముడు, ఊరూరా విగ్రహాలు పెట్టాలని కూడా చెప్పేలా ఉన్నారు. ఎందుకంటే రామోజీరావు మరణం తర్వాత ఆయన సంస్మరణ కార్యక్రమానికి 12 కోట్లు ప్రజా ధనం ఖర్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబు. అందుకే మార్గదర్శి కేసులో ప్రజలకు వాస్తవాలు చెప్పాలనుకుంటున్నాం. చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి రామోజీరావు, ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాకపోయినా తెలుగు దేశాన్ని నడిపించే ఓ మహత్తర శక్తి కలిగిన వ్యక్తి. అలాంటి రామోజీరావు గారి మీద 2008లో ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అది రామోజీరావు గారి మీద కాదు కానీ ఆయన నడుపుతున్న మార్గదర్శి ఫైనాన్స్ మీద. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట వ్యతిరేకంగా రాష్ట్రంలో, దేశంలో డిపాజిట్లు సేకరిస్తుందని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2008లో అప్పటి ప్రభుత్వం విచారణ జరిపి రామోజీరావుపై కేసు కూడా నమోదు చేశారు. ఆర్బీఐ 45ఎస్ సెక్షన్ ప్రకారం మార్గదర్శి ఫైనాన్స్ చేస్తోంది క్రిమినల్ నేరమని, ఇలా వసూలు చేయకూడదని కేసులో పేర్కొన్నారు. రామోజీ టీవీ ఛానళ్లు అమ్మి డిపాజిట్లకు డబ్బులు చెల్లించలేదా ? ఈ దేశంలో ఆర్బీఐ ప్రజల్ని ఆర్ధిక సంస్థలు ముంచకుండా వాటి మీద కొన్ని ఆంక్షలు పెడుతుంది. అందుకు అంగీకరించిన సంస్థలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయాలి. కాకపోతే లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలని ఆర్బీఐ చేసిన చట్టాల ప్రకారం రామోజీరావు ఫైనాన్స్ సంస్థ చేస్తున్నది చట్టవ్యతిరేక కార్యకలాపమని ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేయకముందే ఆర్బీఐ మార్గదర్శికి నోటీసు ఇచ్చింది. ఇందులో రామోజీరావు మార్గదర్శి పేరుతో డిపాజిట్ల సేకరణ తప్పు అని, తక్షణం ఆపేయాలని ఆదేశించింది. ఎందుకంటే ఆయన హిందూ అవిభాజ్య కుటుంబాన్ని నడుపుతున్నారు కాబట్టి, దానికి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు కాబట్టి. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేస్తే.. మార్గదర్శి ఇలా సేకరించిన రూ.2600 కోట్లు తిరిగి డిపాజిటర్లకు చెల్లించాలని ఆర్బీఐ తేల్చిచెప్పేస్తే ఆయన దగ్గరున్న టీవీ ఛానళ్లను అమ్మేసి చెల్లించడం ప్రారంభించారు. ఇదంతా ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు పెట్టిన తర్వాతే. రామోజీరావు చట్ట వ్యతిరేకంగా చాలా కాలం డిపాజిటర్ల నుంచి డబ్బులు సేకరించింది. కాబట్టే మేం ఆయన బతికి ఉన్నప్పుడే వైట్ కాలర్ క్రిమినల్, ఆర్దిక నేరస్తుడని ఆరోపించాం. చనిపోయినంత మాత్రాన బాధ్యత తీరిపోదు రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో రామోజీరావు ఉండవల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని కోరితే ఎవరికీ తెలియకుండానే దాన్ని కొట్టేశారు. ఇది చాలా విచిత్రం. అప్పుడున్న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోలేదు. ఫిర్యాదు దారు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఏడాది తర్వాత విషయం తెలిసి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో చాలా న్యాయపరమైన అంశాలపై చర్చ జరిగింది, ఇందులో రామోజీరావు తప్పు చేశారని కూడా చెప్పింది. ఆర్బీఐ కూడా తప్పని చెప్పింది. కానీ ఈ మధ్య జనవరి 9న ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఆర్బీఐ ఓ లేఖ రాసింది. ఇందులో ఈ కేసును మేం ఇక పట్టించుకోబోమని ఆర్బీఐ చెప్పింది. ఇలా ఎందుకు చెప్పిందో ఎవరికీ తెలియదు. కాబట్టే అనుమానాలు మొదలయ్యాయి. కాబట్టి రామోజీరావుకు ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు. కేవలం చనిపోయిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు ఉండవు. ఒక వ్యక్తి మరణిస్తే అతనిపై ఉన్న క్రిమినల్ కేసు ముగుస్తుంది కానీ, ఆర్దిక బకాయిలు మాత్రం చెల్లించాల్సిందేనని ఈ మధ్యే తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. బ్యాంకులో డాక్యుమెంట్లు పెట్టి రుణం తీసుకుంటే, అవి తప్పుడు డాక్యుమెంట్లని తేలితే , రుణగ్రహీత చనిపోయినా, కేసు కొట్టేస్తారు కానీ, వారసులు బకాయిలు, ఫైన్ చెల్లించాల్సిందే. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్ ప్రకారం ఇలా డిపాజిట్లు సేకరిస్తే దానికి రెట్టింపు జరిమానా విధించే హక్కు ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ లో కేవలం విచారణ చేశాం, రామోజీరావు తప్పు చేయలేదు, 45ఎస్ ను ఉల్లంఘించలేదు, డిపాజిట్లు వసూలు చేసుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు. ఆయన చనిపోయారు కాబట్టి సుప్రీంకోర్టు కేసును డిస్మిస్ చేసి ఉంటుంది. ఉండవల్లి ఈ కేసును అంత ఈజీగా వదిలిపెట్టరు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతారని మేం అనుకోవడం లేదు. ఆర్బీఐ ఏదైనా రాజీపడ్డా కూడా, అది కూడా తప్పని మనం గమనించాలి. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి గారు ఆ మధ్యన పార్లమెంట్ లో దీనిపై ఓ ప్రశ్న అడిగారు. దీనికి కేంద్రం సమాధానం ఇచ్చింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ ఉల్లంఘించి హిందూ అవిభాజ్య కుటుంబాలు డిపాజిట్లు వసూలు చేయకూడదని, చేస్తే జరిమానా సహా చర్యలుంటాయని కేంద్రమంత్రి పార్లమెంట్ లో చెప్పారు. అయినా ఈ కేసును మేం ఇక పట్టించుకోం అని ఆర్బీఐ చెప్పడం పిచ్చితనమే. ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించి రామోజీరావు నేరం చేశారు, ఆయన మరణించడం వల్ల క్రిమినల్ కేసులు రద్దవుతాయి కానీ సివిల్ కేసులు రద్దు కావు. దీనిపై ఆర్బీఐ చర్యలు తీసుకునే విధంగా ప్రజాస్వామ్యయుతంగా అందరూ పోరాడాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపై తన పోరాటం కొనసాగిస్తారని అనుకుంటున్నాం. మార్గదర్శి చిట్స్ కూడా చాలా అన్యాయంగా చేస్తున్నారు. చంద్రబాబు అండతో రామోజీరావు చట్ట వ్యతిరేకంగా చాలా కార్యకలాపాలు చేశారు. ఆయన బ్రతికి లేకపోయినా, వారసులుగా ఉన్న వారు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్ధిక అంశాలపై ఆయన వారసులు సమాధానం చెప్పాల్సిందే. రామోజీరావు బతికున్నంత సేపూ చంద్రబాబుకు సేవ చేసుకున్నారు. ఎన్టీఆర్ ను దుర్మార్గుడిగా చిత్రీకరించే యత్నం చేశారు. కాబట్టి చంద్రబాబు ఆయన రుణం తీర్చుకునేందుకు ప్రజాధనంతో సంస్మరణ సభలు పెట్టే స్థితికి వచ్చారు. చెరుకూరి రామోజీరావు కడిగిన ముత్యమూ కాదు, రాపడని వజ్రమూ కాదు, గొప్ప వ్యక్తీ కాదు, చట్టాల్ని ఉల్లంఘించి దుర్మార్గ ప్రభుత్వాల సాయంతో పెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న వైట్ కాలర్ క్రిమినల్ అని అంబటి రాంబాబు పునరుద్ధాటించారు.