నంద్యాల జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రైతుల పొలాలకు నీరు అందే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో శనివారం శిల్పా చక్రపాణి రెడ్డి పర్యటించారు. ముందుగా రైతులతో సమావేశమై సాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి సాగునీరు అందక ఎండిపోయిన భూములు, పంట పొలాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతుల పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను అందించకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని అన్నారు. రైతుల సాగునీటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రైతుల హక్కైన తెలుగుగంగ కాలువకు సాగునీటిని సాధించుకునేందుకు త్వరలోనే బలమైన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైతులకు సాగునీరు అందే వరకు వారితో కలిసి అలుపెరగని పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, మండల వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.