రామచంద్రపురం: వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే వార్డుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే వైయస్ఆర్‌సీపీ లక్ష్యమని తెలిపారు. రామచంద్రపురం టౌన్ 10వ వార్డులోని తోటవారి వీధిలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైయస్ఆర్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారి అవసరాలను గుర్తించి పరిష్కారానికి కృషి చేసేందుకు గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. 10వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి మరింత ప్రాధాన్యతనిస్తూ మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటితో సంబంధం, ప్రతి కుటుంబానికి అండగా నిలవడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం వైయస్ఆర్‌సీపీ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.