చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామంలో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమరెడ్డి పాల్గొని వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి వైయస్‌ఆర్ అనేక పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా వైయస్‌ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వారి కష్టాల్లో అండగా నిలిచిన వైయస్‌ఆర్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరువలేరని తెలిపారు. ఆయన మరణించి సంవత్సరాలు గడిచినా సంక్షేమ పాలనను, ప్రజా సేవలను ఇప్పటికీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. వర్ధంతి సందర్భంగా ఇల్లత్తూరు గ్రామంలో సుమారు 500 మంది ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఆర్కే రోజా, పురుషోత్తమరెడ్డి పాల్గొని ప్రజలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.