తిరుపతి: టీటీడీలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని, అందులో భాగంగానే డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా పనిచేస్తూ అవినీతికి ఎలాంటి అవకాశం ఇవ్వని అధికారిపై ఏసీబీ దాడులు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 80 మంది అధికారులతో ఆరు నెలల పాటు విచారణ జరిపినా ఏమీ తేలలేదని, చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేయడం వెనుక టీటీడీలో నెలకొన్న ఆధిపత్య పోరే కారణమా అని భూమన ప్రశ్నించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రాబల్యాన్ని దెబ్బతీసేందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో రవిచంద్ర, చైర్మన్ బీఆర్ నాయుడు కలిసి అదనపు ఈవో వెంకయ్య చౌదరిపై చర్యలకు ప్రయత్నిస్తున్నారన్న అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన అధికారిని వేధించడం సరికాదని, లోకనాథం యాదవ్ కుటుంబం ఆర్థికంగా బలమైన కుటుంబమని, ఆయన తాత మునిస్వామి యాదవ్ కోటీశ్వరుడిగా ఉన్నారని తెలిపారు. నిజాయితీపరుడైన అధికారిపై మచ్చ వేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, టీటీడీ ఉద్యోగులు లోకనాథం యాదవ్‌కు అండగా నిలవాలని భూమన కరుణాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు.