తాడేపల్లి : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను రాజశేఖర్ తదితరులు మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైయస్‌ఆర్ ఐదేళ్ల పాలన సమాజంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి ఇంటినీ స్పృశించి శాశ్వత ముద్ర వేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానాన్ని ‘వైయస్‌ఆర్ పాలనకు ముందు.. వైయస్‌ఆర్ పాలన తర్వాత’గా చూసేలా ఆయన సంక్షేమ, అభివృద్ధి విప్లవం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కార్యక్రమాలతో కోట్లాది మంది జీవితాల్లో వైయస్‌ఆర్ మార్పు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి నీటిబొట్టు వెనుక వైయస్‌ఆర్ ముద్ర ఉందని సజ్జల స్పష్టం చేశారు. జలయజ్ఞం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 86 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత వైయస్‌ఆర్‌దేనని, పులిచింతల, పోలవరం ప్రాజెక్టులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. రైతుకు నీళ్లు అందితే తన జీవితాన్ని తానే మార్చుకోగలడనే నమ్మకంతో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు గతంలో ఎగతాళి చేసిన చరిత్ర ఉందని సజ్జల పేర్కొన్నారు. వెలిగొండను వరప్రదాయినిగా మార్చేలా టన్నెల్స్ తవ్వించి ప్రాజెక్టు రూపురేఖలను మార్చింది వైయస్‌ఆర్ అని తెలిపారు. వైయస్‌ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం నిధులు తగ్గించడం ద్వారా పేదలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. వైయస్‌ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని సజ్జల తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిలిచారని, వైయస్ జగన్ తిరిగి అధికారంలోకి రావడం పార్టీకి మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు అత్యవసరమని అన్నారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టడమే వైయస్‌ఆర్‌కు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. క్రెడిట్ చోరీ సిగ్గుచేటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వైయస్‌ఆర్, వైయస్ జగన్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులకు నేడు కూటమి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని క్రెడిట్ తీసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైయస్‌ఆర్ సంక్షేమ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రాణాలను కాపాడేందుకు ఆరోగ్యశ్రీ, 108 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మహానేతకే దక్కుతుందని తెలిపారు. వైయస్‌ఆర్ అకాల మరణం తర్వాత ఆయన ఆశయ సాధన కోసం వైయస్ జగన్ వైయస్ఆర్‌సీపీని స్థాపించి ప్రజల పక్షాన నిలిచారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ‘నా తండ్రి రెండు అడుగులు వేస్తే.. పేదల కోసం నేను నాలుగు అడుగులు ముందుకు వేస్తా’ అన్న మాటకు అనుగుణంగా వైయస్ జగన్ పాలన సాగించారని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ వైయస్‌ఆర్ స్వర్ణయుగం రావాలంటే వైయస్ జగన్ నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా మహానేత ఆత్మకు శాంతి చేకూరాలని, ప్రజా శ్రేయస్సు కోసం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సర్వమత ప్రార్థనల్లో ప్రార్థించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు.