ఇడుపులపాయలో మహానేత వైయ‌స్‌ఆర్‌ 17వ వర్ధంతి

వైయ‌స్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించిన వైయ‌స్‌ జగన్‌

కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న వైయ‌స్‌ జగన్‌

ఇడుపులపాయ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయలోని వైయ‌స్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్‌కు చేరుకున్న వైయ‌స్‌ జగన్‌.. తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మహానేత వైయ‌స్‌ఆర్‌ సతీమణి వైయ‌స్‌ విజయమ్మ, వైయ‌స్‌ భారతి తదితర కుటుంబ సభ్యులు కూడా ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించారు.

వైయ‌స్‌ఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు. పూలమాలలు, పుష్పగుచ్ఛాలు సమర్పించి మహానేతకు అంజలి ఘటించారు. ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం డాక్టర్‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్మరించుకున్నారు. ప్రజల గుండెల్లో మహానేత వైయ‌స్‌ఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
 

Back to Top