విశాఖపట్నం: విశాఖపట్నం మారికవలసలో ఉన్న ప్రతిష్టాత్మక గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను అర్ధాంతరంగా తరలించడాన్ని నిరసిస్తూ, పేద గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నేతలు తీవ్రంగా ఎండగట్టారు. గురుకుల పాఠశాలను యథావిధిగా అక్కడే కొనసాగించాలని, పాఠశాల తరలింపు కోసం జారీ చేసిన వివాదాస్పద జీవో నంబర్ 69, దాని అనుబంధ మెమోను తక్షణమే రద్దు చేయాలని పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ మంత్రి పి. బాలరాజు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి, జీసీసీ మాజీ చైర్మన్ శోభ స్వాతిరాణి డిమాండ్ చేశారు. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ నిర్బంధాలు, లాఠీఛార్జీలు, అర్ధరాత్రి అరెస్టులతో అణచివేతకు పాల్పడటం కూటమి ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలకు నిదర్శనమని వారు మండిపడ్డారు. జీవో 69 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే... మారికవలస గురుకులం గిరిజనుల హక్కు.. జీవో 69ని తక్షణమే ఉపసంహరించుకోవాలి కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ & శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడు: విశాఖపట్నం మారికవలసలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను యథావిధిగా అక్కడే కొనసాగించాలి. దీనికి సంబంధించిన జీవో నంబర్ 69, దానికి అనుబంధంగా ఇచ్చిన మెమోను తక్షణమే రద్దు చేయాలి. అక్కడి నుంచి ఇతర పాఠశాలలకు బలవంతంగా తరలించిన దాదాపు 480 మంది విద్యార్థులను వెంటనే తిరిగి మారికవలస పాఠశాలలోనే చేర్పించి తరగతులు ప్రారంభించాలి. మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు స్పష్టమైన గిరిజన పక్షపాతి. రాష్ట్రంలో ఆదివాసీ బిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి తరపున నిలబడి పోరాడుతుంది.గత 20 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులుగా తీర్చిదిద్దిన ఇంతటి ప్రతిష్టాత్మక పాఠశాలను ఎత్తివేసి కాలేజీ పెడతామనడం అర్థరహితం.మీరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తే మేం స్వాగతిస్తాం; కానీ ఉన్న పాఠశాలను మూసేసి, విద్యార్థులను గెంటేసి కాలేజీ పెడతామంటే సహించేది లేదు, దానికోసం అద్దె భవనాలు తీసుకోండి. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి 12 గంటలకు పాడేరు ఐటీడీఏ పీవో విద్యార్థులను మారికవలసకు తీసుకొచ్చి నాటకం ఆడారు. మరుసటి రోజే గురుకుల సెక్రటరీ వచ్చి ఇక్కడ స్కూల్ ఉండదని మాట మార్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తల్లిదండ్రులకు మద్దతుగా వెళ్లిన మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులను అక్రమంగా గృహనిర్బంధం చేయడం, బలవంతంగా ఈడ్చుకెళ్లి కేసులు పెట్టడం దుర్మార్గం. దాదాపు 422 మంది తల్లిదండ్రులు హాజరై పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన కాపీలను అధికారులకు ఇచ్చినా, మళ్లీ సంతకాలు కావాలని మోసపూరిత ప్రకటనలు చేయడం సిగ్గుచేటు. ప్రవేశ పరీక్షల్లో మెరిట్ సాధించి ఉత్తమ ఆంగ్ల మాధ్యమ చదువుల కోసం నగరానికి వచ్చిన విద్యార్థులను మళ్లీ మారుమూల గ్రామాలకు పంపే కుట్రను చంద్రబాబు సర్కారు అమలు చేస్తోంది. ఈ ప్రభుత్వానికి చేతకాకపోతే రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే; వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు రాగానే ఈ జీవోలను రద్దు చేయించి మారికవలస గురుకులాన్ని పునఃప్రారంభిస్తాం. మాటల గారడీలు వద్దు.. జీవో 69 రద్దుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి పి. బాలరాజు, మాజీ మంత్రి: పాఠశాల ఎత్తివేత కోసం జారీ చేసిన ఉత్తర్వులను, మెమోను తక్షణమే ఉపసంహరించుకుని ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోవాలి. మా బిడ్డలు ఇక్కడే చదువుకుంటారని నిరసన తెలుపుతున్న తల్లిదండ్రుల పట్ల, వారికి అండగా నిలిచిన మా పట్ల ప్రభుత్వం కరుడుగట్టిన నేరస్తుల మాదిరిగా అమానుషంగా వ్యవహరించింది. ధర్నా చేస్తున్న ప్రాంతంలో కనీసం కూర్చోవడానికి తెచ్చుకున్న పట్టలు, తినడానికి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా పోలీసులు లాక్కెళ్లి స్టేషన్లలో పెట్టడం దారుణం. ముఖ్యమంత్రి పర్యటన ఉందని చెప్పి అర్ధరాత్రి వేళ దొంగతనంగా బస్సుల్లో పిల్లలను తరలించాల్సిన అవసరం ప్రభుత్వానికి, అధికారులకు ఎందుకు వచ్చింది? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు మేం వ్యతిరేకం కాదు; దాన్ని ఖాళీగా ఉన్న వైటీసీ భవనాల్లో గాని, ఇతర నూతన ప్రాంగణాల్లో గాని అవసరమైన వసతులు కల్పించి నిర్వహించండి. నాడు దివంగత నేత వైఎస్సార్ 17 ఎకరాల్లో ఈ గురుకులాన్ని ప్రారంభిస్తే, మా నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు మెడికల్ కాలేజీలు తెచ్చి పేదల ఉన్నత చదువులకు బాటలు వేశారు. 422 మంది తల్లిదండ్రులు నేరుగా సంతకాలు పెట్టి ఇచ్చిన తీర్మానం కలెక్టర్‌కు, ఉన్నతాధికారులకు కనిపించడం లేదా? మళ్లీ రాతపూర్వక లేఖలంటూ ఎవరిని మభ్యపెడుతున్నారు? ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపాల్‌ను, 35 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు; అక్కడ పిల్లలకు తిండి లేదు, క్లాసులు జరగడం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో చదువులు ఎలా సాగుతాయి? నోటి మాటలతో మోసపూరిత హామీలు ఇవ్వడం కాదు, జీవో 69ని రద్దు చేసి పాఠశాల యథాతథంగా కొనసాగుతుందని అధికారిక రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి. ప్రభుత్వ వేధింపులు తాళలేక కొందరు విద్యార్థులు పారిపోతామని తల్లిదండ్రులకు చెబుతున్నారు; ఆ పిల్లలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. అకడమిక్ ఇయర్‌లో విద్యార్థులను గెంటేయడం దుర్మార్గం కె. భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, పాడేరు: విద్యా సంవత్సరం మధ్యలో 480 మంది గిరిజన విద్యార్థులను ఉన్నఫళంగా రోడ్డున పడేసి వేరే స్కూళ్లకు బదిలీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మెరిట్ విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్ ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఉన్న అద్భుతమైన మారికవలస గురుకులాన్ని బలవంతంగా ఖాళీ చేయించడం గిరిజనులకు ద్రోహం చేయడమే. 480 మందికి మాత్రమే వసతి, క్లాస్‌రూమ్‌లు, టాయిలెట్లు ఉన్న మారికవలస క్యాంపస్‌లో అదనంగా మరో 600 మందిని తెచ్చి మొత్తం 1000 మందిని ఎలా సర్దుబాటు చేస్తారు? శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులను, మహిళా ప్రజాప్రతినిధులను అన్యాయంగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి పర్యటన సజావుగా సాగడం కోసం, ఏ నిరసనలు లేకుండా తప్పించుకోవడానికే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కలిసి ఈ తాత్కాలిక డ్రామాలకు తెరతీశారు. తరలించిన విద్యార్థులందరినీ వెనక్కి తెచ్చేవరకు మరియు క్యాంపస్‌లో వారి వసతి సౌకర్యాలను పరిశీలించే వరకు మా పోరాటం ఆగదు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్థాయి వ్యక్తి తల్లిదండ్రులకు ఒక మాట చెప్పి, అర్ధరాత్రి పూట మోసపూరితంగా వ్యవహరించడం శోచనీయం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడూ పేదల పక్షాన ఉండవు; ప్రభుత్వ విద్యా వ్యవస్థను దెబ్బతీసి కార్పొరేట్లను పెంచి పోషించడమే ఆయన నైజం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రస్తుతానికి అద్దె భవనాల్లో నడపాలి; ఈ ఏడాది సమయం తీసుకుని కొత్త క్యాంపస్ నిర్మించి అక్కడ ప్రారంభించాలి. గిరిజన బిడ్డల భవిష్యత్తుకు రవ్వంత ఇబ్బంది కలిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, ఆదివాసీ సమాజం తరపున గట్టిగా పోరాడుతుంది. గిరిజనులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి శోభ స్వాతిరాణి, జీసీసీ మాజీ చైర్మన్: గత 20 ఏళ్లకు పైగా ఎంతో మంది ఏజెన్సీ పేద బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన విశాఖలోని ఏకైక గిరిజన ఆశాకిరణం మారికవలస గురుకులం. 11 ఏజెన్సీ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులను ఎక్కడికి తరలించారో, వారు తిండి తిన్నారో లేదో తెలియక గత పది రోజులుగా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాడేరులో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించాలని చూడటం, ఇప్పుడు మారికవలస స్కూల్‌ను మూసేయడం గిరిజనులపై చంద్రబాబు సర్కారు చేస్తున్న కక్ష సాధింపు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రశ్నించినందుకు ఉదయం 5 గంటల నుంచే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన మహిళా నేత పుష్పశ్రీవాణి గారి పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. రాష్ట్రంలో హోం మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మహిళలై ఉండి కూడా మహిళా ప్రజాప్రతినిధులపై ఇంతటి పోలీసు దౌర్జన్యాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నెల రోజులుగా మారికవలస పాఠశాల వివాదంపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా గిరిజన సంక్షేమ మంత్రి గానీ, విద్యాశాఖ మంత్రి గానీ స్పందించకపోవడం దారుణం. తమ పిల్లలు ఏ స్కూల్‌లో ఉన్నారో తెలుసుకునేందుకు వచ్చిన తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు దాటవేయడం క్షమించరాని నేరం. శాంతియుతంగా గేటు ముందు ధర్నా చేస్తున్న విద్యార్థి, గిరిజన సంఘాల నేతలను లాఠీలతో అణచివేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ప్రభుత్వం మొండిపట్టు వీడి జీవో 69ని రద్దు చేయాలి; సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చి మారికవలస గురుకులాన్ని యథాతథంగా నడపాలి.