వైయ‌స్‌ఆర్‌ ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతాం

పేదల జీవితాల్లో సమూల మార్పు తెచ్చిన మహానేత.. వైయ‌స్‌ఆర్‌: ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం : దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, యువనేత ధర్మాన రామ్‌ మనోహర్‌నాయుడు వైయ‌స్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పేదల కష్టాలను అర్థం చేసుకుని, సామాజిక అంతరాలను తగ్గిస్తూ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన మహానేత వైయ‌స్‌ఆర్‌ అని తెలిపారు. పేదలకు భూమి, ఇళ్లు, విద్య, వైద్యం అందించడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్‌, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేదలకు ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలతో ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

వైయ‌స్‌ఆర్‌ హయాంలో లక్షలాది ఎకరాల భూమిని పేదలు, ఆదివాసీలకు పంపిణీ చేశారని ధర్మాన ప్రసాదరావు గుర్తుచేశారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసి లక్షలాది కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసిందన్నారు.

విద్య ఒక్కటే ఆర్థిక, సామాజిక అంతరాలను తొలగించే శక్తివంతమైన ఆయుధమని వైయ‌స్‌ఆర్‌ నమ్మారని, అందుకే పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. ఆ పథకం ద్వారా పేద కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితాల్లో ఎదిగారని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందుబాటులోకి తెచ్చిన ఘనత వైయ‌స్‌ఆర్‌దేనని ధర్మాన ప్రసాదరావు అన్నారు. గతంలో వైద్యం చేయించుకోలేక పేద కుటుంబాలు పడిన ఇబ్బందులను ఆరోగ్యశ్రీ తొలగించిందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలతో వైయ‌స్‌ఆర్‌ ప్రజలకు భరోసా కల్పించారని తెలిపారు.

ప్రభుత్వాలు ప్రజల ఆస్తులకు ట్రస్టీలుగా వ్యవహరించాల్సి ఉంటుందని, పేదల ఆస్తులను కాపాడి సామాజిక అసమానతలను తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. వైయ‌స్‌ఆర్‌ ఆశయాల సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

వైయ‌స్‌ఆర్‌ కార్యక్రమాలను అమలు చేయడానికి వైయ‌స్ఆర్‌సీపీ పుట్టిందని, ఆ పునాదులపైనే పార్టీ ముందుకు సాగుతోందని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. వైయ‌స్‌ఆర్‌ కుటుంబంతో, వైయ‌స్ఆర్‌సీపీతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, పార్టీ బలోపేతానికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తన శక్తిమేర కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు.
 

Back to Top