అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైయస్ఆర్‌సీపీ మేధావుల ఫోరమ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి కట్టుబడి తానిషా, వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ బెడ్‌షీట్లు అందజేశారు. మహానేత వైయస్‌ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో రోగులకు అవసరమైన బెడ్‌షీట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైయస్‌ఆర్ ఎల్లప్పుడూ పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూడో జాతీయ క్రీడాకారిణి కట్టుబడి కౌసర్ భాను, వైయస్ఆర్‌సీపీ ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, వైయస్ఆర్‌సీపీ నాయకులు కోదండపాణి, జయరాం, రాధాకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.