వైయ‌స్ఆర్‌ వర్దంతి రోజే పోలవరం ఎడమ కాలువలోకి నీళ్ళు

ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటే, దీనికి చంద్రబాబే ప్రత్యక్ష సాక్షి

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ

విశాఖపట్నంలోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

మరో ఈవెంట్ లా చంద్రబాబు అనకాపల్లి టూర్

పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు నీళ్లు తెస్తున్నట్లు కొత్త డ్రామా

పురుషోత్తపట్నం నుంచి నీళ్లు తెచ్చి పోలవరం అని బిల్డప్

ఉత్తరాంధ్రను మరోసారి మోసం చేసిన చంద్రబాబు

గుడివాడ అమర్నాథ్ ఫైర్

పోలవరంపై చంద్రబాబుకు ఏనాడూ చిత్తశుద్ది లేదు

ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని చెప్పలేదా?

ప్రాజెక్టు ఎత్తు 41 మీటర్లకు తగ్గిస్తే ఒప్పుకున్నారు

దీంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తీవ్ర అన్యాయం

గుడివాడ అమర్నాథ్ ధ్వజం

ఉత్తరాంధ్రకు చంద్రబాబు సాష్టాంగ నమస్కారం పెట్టాల్సిందే

చంద్రబాబు పాలనలో ప్రతిసారీ ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయమే 

జగన్ హయాంలోనే ఉత్తరాంధ్రకు పోర్టులు, ప్రాజెక్టులు, కాలేజీలు

చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే అవన్నీ ఆగిపోయాయి

గుడివాడ అమర్నాథ్ ఆక్షేపణ

విశాఖపట్నం:  పురుషోత్తపట్నం లిఫ్ట్ నుంచి పోలవరం ఎడమ కాలువలోకి నీళ్లు ఎత్తి పోసి, ఉత్తరాంధ్రకు పోలవరం జలాల్ని తీసుకొచ్చానంటూ గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని వైయ‌స్ఆర్‌సీపీ  నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు టూర్ ఓ డ్రామాలా సాగిందని, ఉత్తరాంధ్ర ప్రజల్ని మరోసారి మోసం చేసిన చంద్రబాబు.. వారికి సాష్టాంగ నమస్కారం చేయడం తప్పులేదన్నారు. ఉత్తరాంధ్రలో ఎన్నో పోర్టులు, ప్రాజెక్టులు, కాలేజీలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అభివృద్దికి చిరునామాగా నిలిచారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాకుండా ద్రోహిగా మిలిగిపోతున్నారని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. 
ప్రెస్ మీట్లో గుడివాడ అమర్నాథ్ ఇంకేమన్నారంటే...

మరో ఈవెంట్ లా చంద్రబాబు అనకాపల్లి టూర్ 

అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు  పర్యటన మరో ఈవెంట్ లా సాగిపోయింది. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి వెళ్లినా కొత్త కొత్త స్కిట్లు చేస్తున్నారు. ఇది కూడా ఓ అలాంటి స్కిట్ లాగా సాగింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఉత్తరాంధ్రకు తెస్తున్నట్లు కొత్త డ్రామాకు తెరలేపారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావాలని, ఈ ప్రాంతంలోని లక్షల ఎకరాలకు నీళ్లు అందాలని, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం బాగుండాలని అందరూ ఆశిస్తున్నారు. నిజంగానే పోలవరం నుంచి నీళ్లు వచ్చి ఉంటే అందరూ సంతోషించే వాళ్లం. కానీ పురుషోత్తపట్నం నుంచి లిఫ్ట్ ద్వారా గోదావరిలో నీళ్లను పోలవరం ఎడమ కాలువలో వదిలి, దాన్ని పోలవరం నుంచే నీళ్లు వస్తున్నట్లు చంద్రబాబు కొత్త డ్రామా చేశారు. తద్వారా మరోసారి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసే కార్యక్రమం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై నాలుగు దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. 1982-83లో అంజయ్య గారు దీనికి పునాదులు వేసారు. ఆ తర్వాత వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని రాష్ట్రంలో చర్చ జరిగేది, జాతీయ ప్రాజెక్టుగా దీన్ని చూసేవారు. కానీ చంద్రబాబుకు రైతులన్నా, వ్యవసాయం అన్నా ఎప్పుడూ చిన్నాచూపే. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చి, కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం దాదాపు ఆరు వేల ఎకరాలకు పైగా భూసేకరణ కూడా చేశారు. తద్వారా ఎడమ ప్రధాన కాలువలో దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తి చేశారు. కానీ ఇప్పుడు పురుషోత్తపట్నం దగ్గర లిఫ్ట్ నుంచి నీళ్లు ఎత్తిపోసి ఉత్తరాంధ్రకు పోలవరం నీళ్లు ఇచ్చానని చెప్పుకోవడం రాజకీయాల్లో సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా ?

పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న చంద్రబాబు

చంద్రబాబుకు ఏరోజూ పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అక్కడి రైతుల గురించి కానీ, దాదాపు 38 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని కానీ ఆలోచన లేదు. పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని ఈ దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చి చెప్పిన విషయం మర్చిపోయారా ? పోలవరం ఎడమ ప్రధాన కాలువలో ఐదారు శాతం మిగిలి పోయిన పనుల్ని భారీగా అంచనాలు పెంచేసి సొంత మనుషులకు పనులు అప్పగించిన విషయం చంద్రబాబు మర్చిపోయారా ? ఇది మీకు ఓ అవినీతి ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రజల నుంచి దేశ ప్రధాని వరకూ తెలుసు. 2024 ఆగస్టులో మీరు ప్రభుత్వంలోకి వచ్చాక జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 45.72 మీటర్ల ఎత్తులో ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లు ఉంటే చాలని ఒప్పుకుని వచ్చిన విషయం మర్చిపోయారా ? ఈ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి అదే కేబినెట్ భేటీలో ఉండి దీనికి అంగీకరించిన విషయం వాస్తవం కాదా ? పోలవరంలో 41 మీటర్ల ఎత్తులో నీళ్లు నిల్వచేస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అర్దం లేకుండా పోతుందన్న విషయం మీకు తెలియదా ? ఉత్తరాంధ్రలోని విశాఖ వంటి ప్రధాన నగరానికి దాదాపు 23-24 టీఎంసీ నీరు దీని ద్వారా అందించాల్సి ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా సాగు నీరు అందించాల్సి ఉంది. ఇవన్నీ 45 మీటర్ల ఎత్తులో నీరు నిలబెడితేనా సాధ్యమన్న విషయం మీకు తెలియదా ?  2005లోనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం అనుమతులు తెచ్చి, కేటాయింపులు అన్నీ ఖరారు చేశారు. కానీ ఇప్పుడు మీరు దాదాపు 10 టీఎంసీల నీరు అవసరమైన డేటా సెంటర్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారు. వీటి వల్ల విశాఖ నగరానికి ఇబ్బంది లేకుండా పోలవరం నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయని చంద్రబాబు అబద్దాలు చెప్పుకుంటున్నారు. డేటా సెంటర్ల మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుమానాల ఆధారంగా స్దానికులు వీటిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తుంటే, వారిపై మీరు నోరుపారేసుకుంటున్నారు. ఎవరు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని వ్యతిరేకించినా వారిని దేశద్రోహులుగా, రాష్ట్రానికి ఆటంకాలు కల్పించే వారిలా చిత్రీకరిస్తారా ? మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎవరూ ఏమీ మాట్లాడకూడదా ?

ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు మరో మోసం

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతీసారీ లక్షల కోట్లు సంపాదించడం, వాటిని తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చుచేయడం, తిరిగి మళ్లీ వేల కోట్లు సంపాదించే కార్యక్రమాలు మొదలుపెడతారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు సాష్టాంగ నమస్కారం పెట్టాల్సిందే. గతంలో ఉమ్మడి ఏపీలో, విభజన తర్వాత కూడా ఉత్తరాంధ్రకు ఏమీ చేయలేదు కాబట్టి వారికి సాష్టాంగ నమస్కారం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ 16 ఏళ్ల హయాంలో ఉత్తరాంధ్రకు మేలు చేసే ఒక్క ప్రాజెక్టు అయినా చంద్రబాబు చేపట్టారా ? మీరు చెప్పినా ఓకే, మీ తాబేదారులు చెప్పినా సరే. పైపెచ్చు పోలవరం సభ జరిగినా, గూగుల్ సభ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ఫోబియా పట్టుకుంది. మీ ప్రతీ మాటలో జగన్మోహన్ రెడ్డి గారి భయం కనిపిస్తోంది. మీ చేతుల్లో నుంచి అధికారం చేజారిపోతోందని, ప్రజలకు వెన్నుపోటు పార్టీ చేసిన మోసం ప్రజలు గ్రహించారు, మళ్లీ ఓటేయరన్న భయం మీలో కనిపిస్తోంది. అందుకే నిత్యం జగన్నామస్మరణం చేస్తున్నారు. పోలవరం నుంచి ఎక్కడికక్కడ నీళ్లు లీక్ అయిపోతున్నాయి, అయినా ప్రచార యావ మాత్రం తగ్గడం లేదు. ఎలాగో హెరిటేజ్ ఫ్రెష్, హెరిటేజ్ మిల్క్ లాగే హెరిటేజ్ ఈవెంట్స్ అని పెట్టుకుని, ఆ డబ్బులు కూడా మీరే తీసేసుకోండి. మీ ఈవెంట్ మేనేజ్ మెంట్, ప్రచార యావ, మార్కెటింగ్ వ్యూహాల కోసం భారీగా డబ్బులు ఖర్చుపెట్టి, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. పోలవరం ప్రాజెక్టులో మీరు చేసినవన్నీ పాపాలే. డయాఫ్రమ్ వాల్, స్పిల్ వే, కాఫర్ డ్యామ్ విషయాల్లో మీరు చేసిన డిజైన్లు, పాడిన పాటలు, మీరు చేసిన పిక్నిక్ లు, సభలకు ఖర్చుపెట్టిన డబ్బుతో మరో పోలవరం ప్రాజెక్టు కట్టొచ్చు. 

ఉత్తరాంధ్ర అభివృద్ది ప్రదాత జగనే 

ఇవాళ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. మీరు కానీ, మీ పార్టీ నేతలు కానీ ఎవరు వస్తారో రండి. 2019-24 మధ్యలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఎదుర్కొని, ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొని ఉత్తరాంధ్ర ప్రాంతంలో మేం చేసిన కార్యక్రమాలు చంద్రబాబు 16 ఏళ్ల పాలనలో ఎప్పుడూ చేసి ఉండరు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్ధుల కోసం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాం. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, 700 కోట్లతో ఉద్దానం  వాటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేశాం. 4500 కోట్లు పెట్టి మూలపేట పోర్టు, 5 వేల కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్టు కట్టించాం. విజయనగరంలో మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం విద్యార్ధులు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో సెంట్రల్ యూనివర్శిటీ, పార్వతీపురంలో మెడికల్ కాలేజీ, సీతంపేటలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, విశాఖలో టూరిజం ప్రాజెక్టుల కోసం భీమిలి దగ్గర అన్నవరంలో రిసార్ట్ నిర్మాణం చేపట్టాం. టెంపుల్ టూరిజంలో భాగంగా సింహాద్రి అప్పన్న ఆలయం సమీపంలో టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ పక్కనే మరో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, దాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగా వాడాలనుకున్నాం. కానీ ప్రభుత్వం మారగానే దాన్ని ఇప్పటివరకూ వాడకుండా అలాగే వదిలేశారు. నర్సీపట్నం, పాడేరులో మెడికల్ కాలేజీలు, లక్ష కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు తెచ్చాం. డేటా సెంటర్లు, ఇన్ఫోసిస్ క్యాంపస్, కైలాసగిరి మీద సైన్స్ మ్యూజియం, పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ ఇలా ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ చంద్రబాబు వచ్చాక పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీలు ఆగిపోయాయి, సీతంపేట సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆగిపోయింది. గిరిజనుల ప్రాజెక్టులు ఆగిపోయాయి, మత్సకారుల ప్రాజెక్టులు ఆగిపోయాయి. అందుకే చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు సాష్టాంగ పడాల్సిందే అని చెప్తున్నాం. మీరు ఎన్ని మోసాలు చేసినా ఉత్తరాంధ్ర ప్రజలు గెలిపిస్తుంటే, తిరిగి వారిని మోసం చేస్తూనే ఉన్నారు. ఊరూపేరు లేని కంపెనీలు తీసుకురావడం, వందల ఎకరాలు, వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడం, చివరికి కంపెనీలు రాకపోవడం చూస్తూనే ఉన్నాం. 

రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి రోజే దేవుడు రాసిన స్క్రిప్ట్

ఈ రెండున్నరేళ్లలో ఉత్తరాంధ్రలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మరో రెండున్నరేళ్లు పూర్తయితే మరో ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే అన్నీ చేస్తామని మళ్లీ అబద్దాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. ఉత్తరాంధ్రకే వలసలు వస్తాయని చంద్రబాబు చెప్తున్నారు. ఆయన ఉంటే వలసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇక్కడి ప్రజలు వర్షాల్లేక కరువుతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ లో వరి దాదాపు 55 వేల హెక్టార్లలో నాట్లు పడేవి. చంద్రబాబు దయ వల్ల ఐదు వేల హెక్టార్లు మాత్రమే జరిగింది. అంటే నూటికి 90 శాతం రైతులు ఏమైపోతున్నారు, వారి భవిష్యత్తు ఏంటనేది చంద్రబాబు ఆలోచించడం లేదు. కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఈవెంట్ చేసి, డ్రామాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి వెళ్లిపోతానంటే ఎలా? రాష్ట్రంలో భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతున్నాయి. అయినా డేటా సెంటర్లతో నష్టం లేదని అబద్దాలు చెప్తున్నారు. పర్యావరణానికి జరిగే నష్టానికి ఎవరు సమాధానం చెప్తారు? మీకు ఇష్టం వచ్చిన కంపెనీలకు భూములు దోచిపెట్టేసినా ఎవరూ ప్రశ్నించకూడదు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తే అదే చదవాలి. అంతేగా చంద్రబాబుగారూ..? కాబట్టి మీరు పోలవరం నుంచి ఒక్క ఎకరానికి నీరు ఇచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేం సంతోషిస్తాం. ఇవాళ మీరు విడుదల చేసిన నీరు పోలవరం నుంచి తెచ్చారా, పురుషోత్తపట్నం నుంచి ఎత్తిపోశారా చంద్రబాబు సమాధానం చెప్పాలి. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎలా ఉందంటే, రాష్ట్రంలో ఉన్న పేదవాడి భవిష్యత్తు కోసం ప్రాణాలు వదిలిన రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి రోజే, ఆయన నిర్మించిన పోలవరం ఎడమ కాలువలో నీళ్లు వచ్చాయి. మరి చంద్రబాబు ఇవాళ అనుకుని పెట్టారో, ఆయన జాతకం ఎలా నడుస్తుందో తెలియదు. రైతాంగం కోసం రాజశేఖర్ రెడ్డి గారు పడిన తపన, కట్టిన ప్రాజెక్టుల క్రెడిట్ చోరీ చేయాలని చంద్రబాబు ఎంత అనుకున్నా వాస్తవాలు మాత్రం దాగవు. నిజం ఆలస్యంగా తెలిసినా ప్రజలు అర్దం చేసుకుంటారు. ఇప్పటికైనా చంద్రబాబు లెంపలేసుకుని, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని, వైయ‌స్ఆర్‌సీపీని తిట్టడం ఆపి హామీల్ని ఎలా నిలబెట్టుకోవాలో చంద్రబాబు ఆలోచించుకోవాలని గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు.

Back to Top