తాడేపల్లి: చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లంటూ ప్రచారం చేసుకోవటంపై మండిపడ్డారు. పోలవరానికి ఎవరి హయాంలో ఏం చేశారో లెక్కలతో సహా ట్వీట్ చేశారు. చంద్రబాబూ..ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం నుంచి పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి పోలవరం ఎడమ కాలువలోకి వదిలారు. దాన్ని చూపిస్తూ ‘పోలవరం నీళ్లు తెచ్చేశాం’ అంటూ డప్పు కొట్టుకోవడం ఏంటి?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ తన ట్వీట్‌లో ‘ చంద్రబాబూ.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మీరు వరుసగా చేస్తున్న పబ్లిసిటీ ఈవెంట్లన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే కదా? మొన్న వెలిగొండ… ఇవాళ పోలవరం ఎడమ కాలువ… ఇంకోరోజు ఇంకోటి. మీరు మొదలుపెట్టని, మీరు పూర్తిచేయని ప్రాజెక్టులకు మీ పేరు చెప్పుకోవడం, మీ అనుకూల మీడియాతో వాటి సృష్టికర్తలు మీరు అన్నట్టుగా భజన చేయించుకోవడం మీకు అలవాటే. ఒకవేళ అరకొర పనులు చేసినా, అవి కూడా అంచనాలు పెంచేసి దోచేయడానికే. ఏ సాగునీటి ప్రాజెక్టును తీసుకున్నా మీ మోడస్ ఆపరెండీ, మీ ధోరణి, మీ నైజం ఇదే. పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా? మరెందుకు ఈ డ్రామా? అసలు పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79% పనులు వైఎస్సార్‌గారి హయాంలోనే పూర్తైతే, ఇప్పుడు ఆ పనులన్నింటి మీద నిలబడి “అంతా నేనే చేశా” అని చెప్పుకోవడం చంద్రబాబు మీకే చెల్లింది! రాష్ట్రానికి శాపంలా మారాయి.. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014–19 మధ్య మీరు చేసిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలు, చేసిన తప్పిదాలు, అవినీతి, దోపిడీ… ఇవన్నీ రాష్ట్రానికి శాపంలా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘‘మందుచూపు, సరైన ప్రణాళిక, ప్రాధాన్యతలు పాటించకుండా, పద్ధతీపాడూ లేకుండా మీరు తప్పులు చేస్తే, ఆ చేసిన తప్పులను సరిదిద్దడానికి మా ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అరకొరగా చేసి ప్రాజెక్టును చెల్లాచెదురు చేశారు. చివరకు స్పిల్‌వేకు పనులు పూర్తికాకుండానే, నదీ ప్రవాహాన్ని డైవర్ట్ చేయకుండానే, మెయిన్‌డ్యాం పునాది పనుల్లో భాగమైన డయాఫ్రంవాల్ చేపట్టారు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ నిర్వాకాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడం ఒక్కటే కాకుండా, వరదల వల్ల వచ్చిన నీరు, అప్పటికి పాక్షికంగా చేసిన స్పిల్‌వే ద్వారా డైవర్ట్ కాక, ఎగున అరకొరగా చేసిన కాఫర్ డ్యాంవల్ల, ఆ గ్యాప్‌ల ద్వారా నీరు చొచ్చుకుని వచ్చి, మెయిన్ డ్యాం కింద పునాదులు, అంటే డయాఫ్రంవాల్ కొట్టుకుపోయి నష్టంకూడా జరిగింది. వీటన్నింటినీ సరిదిద్దుతూ ముందుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే పనులు, కాఫర్ డ్యాంలను పూర్తిచేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన పనులను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లాం, ప్రణాళికా బద్ధంగా. పోనీ ఇప్పుడైనా సవ్యంగా చేస్తున్నారంటే అదీ లేదు. ప్రాజెక్టును మళ్లీ సుడిగుండంలోకి నెడుతున్నారు పోలవరం ఎత్తు సంగతి తేల్చండి అన్నింటికంటే ముఖ్యంగా పోలవరం ఎత్తు సంగతి తేల్చాలి.‘‘పోలవరం FRL 45.72 మీటర్లు అయితే, నీటినిల్వను 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. తాము 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని కేంద్రం చెబుతోంది. మరి పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? పూర్తి సామర్థ్యంతో నీటిని ఎలా నిల్వ చేస్తారు? నిర్వాసితులకు ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి చంద్రబాబు? మరోవైపు ఉత్తరాంధ్రకు గొప్ప మేలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తపట్నం పంపుల నుంచి వచ్చే నీళ్లతోనే ఉత్తరాంధ్రకు మేలు జరిగిపోతుందా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సంగతేంటి? ఈ స్కీంకు వైఎస్సార్ 2009లోనే రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతి ఇస్తే, మా ప్రభుత్వంలో మారిన ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో రూ.17,050.20 కోట్లకు అంచనాలను సవరించి పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చాం. కీలకమైన Package-1, Package-2 పనులను టెండర్లు, అగ్రిమెంట్ల దశ వరకు తీసుకెళ్లాం. భూసేకరణకు ప్రత్యేక యూనిట్లు కూడా ఏర్పాటు చేశాం. మరి మీ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉత్తరాంధ్ర మీద ప్రేమ ప్రసంగాల్లోనేనా? చంద్రబాబు.. పోలవరం విషయంలో డ్రామాలు మానండి. పనులపై దృష్టిపెట్టండి. 41.15 మీటర్లు కాకుండా, 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులో పోలవరాన్ని పూర్తిచేయండి. దీనివల్ల పూర్తిస్థాయి స్టోరేజీ సాధ్యపడుతుంది, తద్వారా పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడంతోపాటు, పూర్తి గ్రావిటీతో కుడి, ఎడమ కాలువల ద్వారా నీళ్లు అందించగలుగుతాం. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతలతో సంబంధం లేకుండానే గ్రావిటీతోనే పోలవరం ఎడమకాల్వతోపాటు, కుడికాల్వకు నీళ్లు పుష్కలంగా పంపగలం. మరి ఇది చేయకుండా ఇన్ని డ్రామాలు ఎందుకు?’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.