రాజమహేంద్రవరం: పురుషోత్తపట్నం ఎత్తిపోతల నీటిని పోలవరం నీళ్లుగా చూపిస్తూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ప్రస్తుతం అనకాపల్లికి తీసుకెళ్తున్నది పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీరు కాదని, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి పంపులతో ఎత్తిపోసి పోలవరం ఎడమ కాలువలోకి వదులుతున్న నీరని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్ హయాంలో నిర్మించిన కాలువలను ఉపయోగించుకుంటూ, తానే పోలవరం నీళ్లు తీసుకొచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకోవడం వాస్తవాలను వక్రీకరించడమేనని తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏమన్నారంటే.. - పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లుగా ఎలా చెబుతారు? “అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రస్తుతం కాలువలోకి వస్తున్న నీళ్లు పోలవరం రిజర్వాయర్ నుంచి వచ్చినవి కావు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి పంపులతో ఎత్తిన నీటిని పోలవరం ఎడమ కాలువలోకి వదులుతున్నారు. రైతులకు నీళ్లు రావడం మాకు సంతోషమే. కానీ పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లుగా ప్రచారం చేయడం మాత్రం సరికాదు.” - పోలవరం కాలువ నిర్మాణంలో వైయస్‌ఆర్ పాత్రను దాచలేరు “పోలవరం ఎడమ ప్రధాన కాలువ పొడవు 181.5 కిలోమీటర్లు. ఇందులో 79 శాతం పనులు వైయస్‌ఆర్ హయాంలోనే పూర్తయ్యాయి. తూర్పు గోదావరి, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో అవసరమైన భూసేకరణలో కూడా అత్యధిక భాగం అప్పుడే జరిగింది. 2005 నుంచే కాలువ పనులు ప్రారంభించి, పర్యావరణ, అటవీ, సాంకేతిక, ఆర్థిక అనుమతులను సాధించి పోలవరాన్ని వైయస్‌ఆర్ మాటల్లో కాకుండా పనుల్లో ముందుకు తీసుకెళ్లారు. ఆ కాలువను ఉపయోగించుకుని ఇప్పుడు తానే నీళ్లు తెచ్చినట్లు చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా?” - జగన్ ప్రభుత్వం పోలవరాన్ని మళ్లీ గాడిలో పెట్టింది “చంద్రబాబు హయాంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్‌లు, స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ వంటి కీలక పనులపై జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 48 రేడియల్ గేట్ల ఏర్పాటు, కాపర్ డ్యామ్‌లు, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే వైపు మళ్లించింది. మరోవైపు ఎడమ ప్రధాన కాలువలో మట్టి, కాంక్రీట్, ఇతర నిర్మాణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లింది. ఈ వాస్తవాలను దాచిపెట్టి గత ప్రభుత్వాలు చేసిన పనులన్నింటికీ చంద్రబాబు తానే కర్తనని చెప్పుకోవడం చరిత్రను వక్రీకరించడమే.” - విశాఖ డేటా సెంటర్లకు నీటి సరఫరాపైనా సమాధానం చెప్పాలి “పోలవరం పూర్తి స్థాయి ఎఫ్‌ఆర్‌ఎల్ 45.72 మీటర్లు కాగా, ప్రస్తుతం తొలి దశను 41.15 మీటర్లకు పరిమితం చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ, గ్రావిటీ ద్వారా నీటి సరఫరా లేకుండా పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తి పోలవరం నీళ్లుగా ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏమిటి? విశాఖలో డేటా సెంటర్లకు నీరు సరఫరా చేస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఈ నీటిని వాటి కోసం ఉపయోగించబోతున్నారా? పోలవరం పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఎప్పుడు సాధిస్తారు, ఎర్త్ కమ్ రాక్ డ్యామ్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల నీటిని ఇంకెన్నాళ్లు పోలవరం నీళ్లుగా చెబుతారో చంద్రబాబు ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాలి.”