తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్థంతి కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత వైయస్సార్ విగ్రహానికి పూలు సమర్పించిన పార్టీ నేతలు, ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్సార్ దార్శనికత, మానవత్వం, సంక్షేమాబాటను గుర్తు చేసుకున్న పార్టీ నేతలు, నాయకులు. ఇంకా నాడు మహానేత వైయస్సార్ ఎంతో ముందుచూపుతో చేపట్టి, పనులు కొనసాగించి, నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లో ముఖ్యమైన గుండ్లకమ్మ, పులిచింతల, వెలిగొండ నుంచి తీసుకొచ్చిన జలాలతో ఆయన విగ్రహానికి అభిషేకం చేశారు. ఇంకా ఆయా ప్రాంతాల్లో పండిన వరితో మహానేత విగ్రహానికి ధాన్యాభిషేకం కూడా చేశారు. ప్రత్యేకంగా రక్తదాన శిబిరం నిర్వహణతో పాటు, పేదలకు వస్త్రదానం చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన వైయస్సార్ అభిమానులకు అన్న ప్రసాద వితరణ చేశారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహల్లా, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ ఎస్టీ విభాగం (మైదాన ప్రాంతం) అధ్యక్షుడు సురేంద్ర, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ సీఈసీ సభ్యుడు మండపాటి శేషగిరిరావు, మంగళగిరి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తితో పాటు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ నేతలు.. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానాన్ని ‘వైయస్సార్ పాలనకు ముందు.. వైయస్సార్ పాలన తర్వాత’ అని సగర్వంగా విభజించి చూసే పరిస్థితి అని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ నాడు తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి విప్లవం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని వారు కొనియాడారు. కరవు నేలలను సస్యశ్యామలం చేసిన బృహత్తర జలయజ్ఞం, రైతన్నలకు ఎంతో అండగా నిల్చిన ఉచిత విద్యుత్, పేదవాడి ప్రాణానికి కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, నిరుపేద బిడ్డల తలరాతలను మార్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి చరిత్రాత్మక పథకాలతో వైయస్సార్ కోట్లాది మంది గుండెల్లో చిరంజీవిగా కొలువు దీరారని ఉద్ఘాటించారు. మహానేత వైయస్సార్ సంకల్ప బలంతో, ఆ తర్వాత వైయస్ జగన్ అంకితభావంతో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను నేడు చంద్రబాబు ‘క్రెడిట్ చోరీ’ చేస్తూ ప్రజలను భ్రమల్లో ముంచాలని చూస్తున్నారని వైయస్సార్‌సీపీ నేతలు ఆక్షేపించారు. పేదవాడి కన్నీరు తుడిచి, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలను అందించిన ఆ మహనీయుడి ఆశయాలు సజీవంగా నిలబడాలన్నా, రాష్ట్రానికి నిజమైన స్వర్ణయుగం తిరిగి రావాలన్నా జగన్‌గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి చారిత్రక అవసరమని స్పష్టం చేశారు. అందుకు ఆయన్ను మళ్లీ సీఎం చేయడమే ఏకైక మార్గమని వారు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యనేతలు ఎవరు, ఏం మాట్లాడారంటే..: వైయస్సార్ పాలన చరిత్రను తిరగ రాసింది. చంద్రబాబుది పచ్చి మోసం :సజ్జల రామకృష్ణారెడ్డి. వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్. – మహామనీషి వైయస్సార్ మన నుంచి దూరమై 17 ఏళ్లయినా కోట్లాది మంది ప్రజలు ఆయనను తమ కుటుంబ సభ్యుడిలా గుండెల్లో పెట్టుకుని రోజూ తలుచుకుంటున్నారు. తన ఐదేళ్ల పాలనతోనే సమాజంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి ఇంటినీ సృషించి శాశ్వత ముద్ర వేసిన ఏకైక నాయకుడు రాజశేఖర్‌రెడ్డిగారు మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలంతా ‘ఈరోజు వైయస్సార్ ఉంటే బాగుండేది’ అని నిత్యం ఆకాంక్షిస్తున్నారు. రైతుకు నీళ్లు అందిస్తే మిగిలినవన్నీ వాళ్లే చేసుకోగలరని బలంగా నమ్మి ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా చేపట్టిన రైతు బాంధవుడు వైయస్సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద ఒకేసారి 86 ప్రాజెక్టులు చేపట్టి కరవు నేలలను సైతం సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనదే. నేడు రెండు రాష్ట్రాల్లోని ప్రతి నీటి బొట్టు వెనుక వైయస్సార్ పేరు కాదనలేని చరిత్ర. పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పరుగులు పెట్టించి సాకార దిశగా నడిపించింది రాజశేఖర్ రెడ్డి గారే. ఉచిత విద్యుత్ అసాధ్యమన్న నాటి కేంద్ర పెద్దలను ఒప్పించి, సొంత పెట్టుబడితో బోరింగ్ వేసే అన్నదాతల శ్రమకు ప్రభుత్వం అండగా నిలవాలని ఉచిత విద్యుత్ అందించిన దార్శనికుడు వైయస్సార్. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లయినా తెలంగాణ పల్లెల్లో సైతం ‘మా రాజన్న’ అంటూ అక్కడి రైతులు ఆయనను ఇంట్లోని పెద్ద దిక్కులా ఆరాధిస్తున్నారు. వెలిగొండ పై ఎగతాళి చేసిన చరిత్ర చంద్రబాబుది: 1996లో ఎన్నికల కోసం వెలిగొండకు కొబ్బరికాయ కొట్టి, ఆ తర్వాత ‘శ్రీశైలం నుంచి చెంబులతో నీళ్లు తెచ్చి పోయాలా’ అని ఎగతాళి చేసిన చరిత్ర చంద్రబాబుది. వెలిగొండను రియల్ వరప్రదాయినిగా మారుస్తూ టన్నెల్స్ తవ్వించి ప్రాజెక్టు రూపురేఖలను సమూలంగా మార్చింది మహానేత వైయస్సార్. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఎక్కడ? వ్యవసాయాన్ని పండుగలా మార్చిన వైయస్సార్ ఎక్కడ? నేడు చంద్రబాబు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లి తనకేమీ సంబంధం లేకపోయినా డబ్బా కొట్టుకుంటున్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తెస్తే.. నేడు చంద్రబాబు వాటికి నిధులు ఆపేసి పేదల గొంతు నులుముతున్నారు. వైయస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా వైయస్.జగన్: తండ్రి ఆశయాలకు మెరుగులు దిద్దుతూ వైయస్.జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి విక్రయం దాకా జగన్ మోహన్ రెడ్డి గారు రైతుకు కొండంత అండగా నిలిచారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతి రోజూ రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి నెడుతోంది. వైయస్ జగన్ తిరిగి అధికారంలోకి రావడం పార్టీ కంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యవసరం. వైయస్ జగన్ గారి నాయకత్వంలో మళ్లీ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని నిలబెట్టడమే మనం వైయస్సార్‌కు అర్పించే నిజమైన నివాళి. ప్రాజెక్టులపై చంద్రబాబుది క్రెడిట్ చోరీ. ప్రజాస్వామ్యవాదులంతా జగన్‌కు అండగా నిలవాలి. :లేళ్ల అప్పిరెడ్డి. ఎమ్మెల్సీ. – వైయస్సార్, వైయస్ జగన్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులకు నేడు కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా స్టిక్కర్లు వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రను వైయస్సార్ పాలనకు ముందు, వైయస్సార్ పాలన తర్వాత అనేంతగా ఆయన సంక్షేమ చరిత్ర లిఖించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న తపనతో రూపాయి ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రాణాలు కాపాడేందుకు ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులను తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిది. వైయస్సార్ అకాల మరణం తర్వాత ఆయన ఆశయ సాధన కోసమే వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రజల పక్షాన నిలిచారు. నా తండ్రి రెండు అడుగులు వేస్తే.. పేదల కోసం నేను నాలుగు అడుగులు ముందుకు వేస్తా’ అని చెప్పిన మాటకు కట్టుబడి వైయస్.జగన్ అద్భుత పాలన అందించారు. రాష్ట్రంలో మళ్లీ వైయస్సార్ స్వర్ణయుగం రావాలన్నా, పేదల బతుకులు బాగుపడాలన్నా జగన్‌గారి పరిపాలన మాత్రమే ఏకైక మార్గం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్సార్‌సీపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం, వైయస్సార్ ఆశయ పాలన పునఃస్థాపన కోసం ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలి.