తాడేపల్లి: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై పదిహేడేళ్లు గడిచినా.. పేదల గుండెల్లో ఆయన వేసిన చెరగని ముద్ర చెక్కుచెదరలేదు. రైతుల కోసం ఉచిత విద్యుత్, పేదల కోసం ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి కోసం జలయజ్ఞం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన వైయస్‌ఆర్‌ను రాష్ట్ర ప్రజలు కన్నీటి నివాళులతో స్మరించుకున్నారు. మహానేత ఆశయాలను గుర్తుచేసుకుంటూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వైయస్‌ఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నుంచి తీసుకొచ్చిన జలాలతో జలాభిషేకాలు, ధాన్యాభిషేకం, అన్నదానాలు, పేదలకు పండ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలతో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రతి ఊరిలోనూ మారుమోగిన ‘వైయస్‌ఆర్ అమర్ రహే’ నినాదాలు.. మహానేతకు ప్రజల గుండెల్లో ఉన్న అభిమానానికి, ఆయన పాలనపై ఉన్న చెరగని జ్ఞాపకాలకు ప్రతీకగా నిలిచాయి. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో వైయస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, పలు సేవా కార్యక్రమాలు, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. - శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో వైయస్‌ఆర్ సంక్షేమ రంగానికి కొత్త భాష్యం చెప్పారని స్మరించుకున్నారు. రణస్థలం పతివాడపాలెం గ్రామంలో రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి సాయికుమార్ పాల్గొని వైయస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, 108 పథకాల సేవలను గుర్తుచేసుకున్నారు. పోలాకి మండలం ఈదులవలసలో ముద్దడ బాల భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. టెక్కలిలో వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్‌ఆర్ సంక్షేమ పాలనపై మీడియా సమావేశం నిర్వహించారు. - విజయనగరం విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పి.వి.వి. సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె.వి. సూర్యనారాయణ రాజు తదితరులు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లిమర్ల మొయిద జంక్షన్‌లో రామతీర్థం ప్రాజెక్టు నీటితో వైయస్‌ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గంలో డాక్టర్ తలే రాజేష్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించి వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. సిరిపురపు జగన్మోహన్‌రావు, తలే భద్రయ్య, పాలవల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి రామభద్రపురం మండలం బూసయవలసలో శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో తోటపల్లి రిజర్వాయర్ నీటితో వైయస్‌ఆర్ విగ్రహాలకు నీలాభిషేకం చేశారు. సాలూరులో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో బోసుబొమ్మ కూడలిలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కురుపాం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తోటపల్లి ప్రాజెక్టు జలాలతో వైయస్‌ఆర్ విగ్రహాలకు జలాభిషేకం చేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. - విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి గాజువాక పాత గాజువాక జంక్షన్‌లో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తిప్పల శ్రీనివాస దేవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు ధర్మానగర్‌లో కె.కె.రాజు ఆధ్వర్యంలో జలయజ్ఞం ద్వారా నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల నీటితో వైయస్‌ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాడేరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. - తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ కాకినాడ రూరల్‌లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పోలవరం, జంజావతి, సోమశిల వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో వైయస్‌ఆర్ కృషిని గుర్తుచేసుకున్నారు. తునిలో జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పోలవరం ఎడమ కాలువ పనుల్లో వైయస్‌ఆర్ హయాంలో జరిగిన పురోగతిని గుర్తుచేశారు. పిఠాపురంలో వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, అనంతరం మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనపర్తి కెనాల్ రోడ్డులో డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. 108, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను గుర్తుచేసుకున్నారు. రామచంద్రపురంలో పిల్లి సూర్యప్రకాశ్, పిల్లి సుభాష్‌చంద్రబోస్ పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్ చిత్రపటానికి, అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుటి విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజోలులో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో డాక్టర్ పినిపే శ్రీకాంత్ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. - పశ్చిమగోదావరి, ఏలూరు పాలకొల్లులో గాంధీ బొమ్మల సెంటర్‌లో గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌కు నివాళులర్పించారు. గుణ్ణం నాగబాబు, చెల్లం ఆనందప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో చినిమిల్లి వెంకటరాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వీరవాసరం మండలం నౌడూరు సెంటర్‌లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్‌రాజు, కవురు శ్రీనివాస్, చినిమిల్లి వెంకటరాయుడు తదితరులు వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తణుకులో మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన ఆశయాల బాటలో నడవాలని ప్రతిజ్ఞ చేశారు. ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామంలో మంతెన యోగీంద్ర కుమార్ వైయస్‌ఆర్ విగ్రహానికి నీటితో అభిషేకం చేసి నివాళులర్పించారు. దెందులూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఏలూరు పట్టణంలో మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంతో పాటు మార్కెట్ యార్డు, కోడేలు రోడ్డు, వెన్నవల్లి వారి పేట, తూర్పు వీధి, ఫిల్‌హౌస్ పేట, చిరంజీవి బస్టాండ్, వంగాయగూడెం, ఫైర్ స్టేషన్, సెయింట్ ఆన్స్ కాలేజ్, శనివారం పేట ప్రాంతాల్లోని వైయస్‌ఆర్ విగ్రహాలకు నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కైకలూరు సంత మార్కెట్ వద్ద మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. కొయ్యలగూడెంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైయస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం పేదలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు. - కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కంట్రోల్ రూమ్ వద్ద మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పోలవరం ప్రాజెక్టు నీటితో వైయస్‌ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించి 100 మందికి పైగా రక్తదానం చేశారు. వీరులపాడు మండలం పెద్దాపురంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు వైయస్‌ఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేశారు. తిరువూరు రోలుపడి గ్రామంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉయ్యూరు బస్టాండ్ వద్ద దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అవనిగడ్డలో పార్టీ కార్యాలయంలో, అనంతరం వంతెన సెంటర్‌లోని వైయస్‌ఆర్ విగ్రహానికి సింహాద్రి రమేష్‌బాబు, సింహాద్రి వికాస్ నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతంలో జోగి రమేష్ వైయస్‌ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. - గుంటూరు, పల్నాడు, బాపట్ల అమరావతి గ్రామంలో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొని వైయస్‌ఆర్‌కు నివాళులర్పించారు. గురజాల మాచవరం మండలం మండపాల సెంటర్‌లో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజా సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లోని వైయస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ప్రశాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. బాపట్లలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొల్లూరులో వరికూటి అశోక్‌బాబు వైయస్‌ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించిన మహానేతగా వైయస్‌ఆర్‌ను స్మరించుకున్నారు. - ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తదితరులు వైయస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో గుండ్లకమ్మ నీటితో వైయస్‌ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జున, బత్తుల బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలో డాక్టర్ అశోక్‌కుమార్ చింతలపూడి వైయస్‌ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కొండపి గుర్రంపోడియంలో డాక్టర్ ఆదిమూలపు సురేష్ వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, నూతనంగా ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. దోర్నాల నటరాజు సెంటర్‌లో వెలిగొండ ప్రాజెక్టు జలాలతో జలాభిషేకం, పాలాభిషేకం చేసి, అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. యర్రగొండపాలెంలో పార్టీ కార్యాలయం నుంచి వైయస్‌ఆర్ విగ్రహం వరకు యాత్ర నిర్వహించి పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్ పంపిణీ చేశారు. కనిగిరి చింతలపాలెంలో దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కాపురంలో అన్నా రాంబాబు గడియార స్తంభం సెంటర్‌లోని వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం బైక్ ర్యాలీగా తూర్పు వీధిలోని విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. - నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్వర్ణముఖి, నెల్లూరు–సంగం బ్యారేజీలు, సోమశిల–కండలేరు జలాశయాల నుంచి జలాలను సేకరించి జలాభిషేకం చేశారు. నెల్లూరు టౌన్ గాంధీబొమ్మ సెంటర్‌లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నెల్లూరు రూరల్ కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో ఆనం అరుణమ్మ, ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు వైయస్‌ఆర్‌కు నివాళులర్పించారు. కొడవలూరు నార్త్ రాజుపాలెం సెంటర్‌లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు అనిల్‌బాబు తదితరులు వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఉదయగిరిలో రాజగోపాల్‌రెడ్డి వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. - వైయస్ఆర్ కడప, అన్నమయ్య జమ్మలమడుగులో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి సాయిరాం థియేటర్ వద్ద వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఎర్రగుంట్లలో డా. మూలే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కడప వైయస్‌ఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో పి. రవీంద్రనాథ్‌రెడ్డి, కె. సురేష్‌బాబు, అంజాద్‌బాషా వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మైదుకూరు బ్రహ్మంగారిమఠంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైయస్‌ఆర్‌కు నివాళులర్పించారు. పోరుమామిళ్లలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణ, వైయస్‌ఆర్ ఆలయం, సిద్ధవరం పంచాయతీ అగ్రహారం, కొరపాటిపల్లి కాలువకట్ట వద్ద ఉన్న వైయస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్ చిత్రపటానికి, టోల్‌గేట్ సెంటర్‌లోని కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. రాజంపేటలో పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ సమీపంలోని వైయస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. - కర్నూలు, నంద్యాల పాణ్యం మండల కేంద్రంలో వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సద్దల సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా పాములపాడులో మండల అధ్యక్షుడు నాగరాజు, చౌడయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. పగిడ్యాలలో పుల్యాల నాగిరెడ్డి, పుల్యాల దివ్య నాగిరెడ్డి ఆధ్వర్యంలో మహానేతను స్మరించుకున్నారు. వెలుగోడులో శిల్పా భువనేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సెంటర్‌లోని వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆత్మకూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం వైయస్‌ఆర్ స్మృతివనంలో చిత్రపటానికి పూలమాలలు వేశారు. నల్లకాల్వ సమీపంలోని వైయస్‌ఆర్ స్మృతివనం వద్ద షేక్ సలామ్‌బాబు, పొసిమ్ రెడ్డి సునీల్‌రెడ్డి, హరీష్‌రెడ్డి నివాళులర్పించారు. మంత్రాలయం కోసిగి మండలంలోని వైయస్‌ఆర్ సర్కిల్‌లో రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. కర్నూలు కల్లూరు అర్బన్ షరీన్‌నగర్‌లో హంద్రీ–నీవా జలాలతో వైయస్‌ఆర్ విగ్రహానికి అభిషేకం చేసి నివాళులర్పించారు. కోడుమూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్య పరీక్షలు, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించి వాహన సౌకర్యం కల్పించారు. - అనంతపురం, శ్రీ సత్యసాయి అనంతపురం పార్టీ కార్యాలయం, జెడ్పీ ఆవరణలోని వైయస్‌ఆర్ విగ్రహాలకు అనంత వెంకటరామిరెడ్డి పూలమాలలు వేశారు. సర్వజన ఆసుపత్రికి పోర్టబుల్ సక్షన్ మెషిన్‌ను వితరణ చేశారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో డాక్టర్ శంకరయ్య, కట్టుబడి తానిషా, షేక్ బాబా సలామ్ రోగులకు బెడ్‌షీట్లు పంపిణీ చేశారు. శింగణమలలో డా. సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కృష్ణానది జలాలతో వైయస్‌ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేసి, ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పంపిణీ, అన్నదానం చేశారు. కళ్యాణదుర్గం వైయస్‌ఆర్ పార్క్‌లో తలారి రంగయ్య, బి. తిప్పేస్వామి, ఎం. ఉమామహేశ్వరనాయుడు తదితరులు నివాళులర్పించారు. హిందూపురం వైయస్‌ఆర్ బస్టాండ్ వద్ద గుడ్డంపల్లి వేణురెడ్డి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కదిరిలో బి.యస్. మక్బుల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి మున్సిపాలిటీ వద్ద ఉన్న వైయస్‌ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. పెనుకొండ, రొద్దం మండల కేంద్రాల్లో ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. - తిరుపతి, చిత్తూరు పలమనేరు మార్కెట్ యార్డ్ వద్ద మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూతలపట్టు బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లెలో డాక్టర్ ఎం. సునీల్‌కుమార్ వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, పూజ చేసి హారతి ఇచ్చారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కూడా నివాళులర్పించారు. నగరి విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమరెడ్డి వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సుమారు 500 మందికి అన్నదానం నిర్వహించారు.