విజయవాడ: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన నివాళులు అర్పిస్తూ పోస్టు చేశారు. ప్రజల సంక్షేమానికి అంకితమైన నాయకుడు ప్రజల సంక్షేమం కోసం తనను తాను అంకితం చేసుకున్న దూరదృష్టి గల నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. వ్యవసాయం, వైద్య సేవలు, విద్య, సామాజిక సంక్షేమ రంగాల అభివృద్ధికి వైయస్‌ఆర్ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని గవర్నర్ తెలిపారు. వైయస్‌ఆర్ అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో మహానేత చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.