బెంగళూరు: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బెంగళూరులో వైయస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కేఆర్ పురంలోని శబరి ఆశ్రమధామంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పార్టీ నాయకులు, అభిమానులు కలిసి మహానేతకు ఘన నివాళులర్పించారు. వైయస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆశ్రమంలోని వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆశ్రమానికి అవసరమైన పండ్లు, ఇతర నిత్యావసర సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమార్ పులివెందుల మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులుగా ఎదిగారని తెలిపారు. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న తమలాంటి ఎంతోమంది నేడు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడగలిగామని, తమ జీవితాల్లో వైయస్‌ఆర్ అందించిన విద్యా అవకాశాలకు ఎంతో రుణపడి ఉన్నామని పేర్కొన్నారు. వైయస్‌ఆర్ కేవలం సంక్షేమ పథకాలను అమలు చేసిన నాయకుడు మాత్రమే కాదని, విద్య, వైద్యం, సంక్షేమం ద్వారా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన మహానేత అని కొనియాడారు. వైయస్‌ఆర్‌పై ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ చెరిగిపోదని, అదే అభిమానంతో వైయస్‌ఆర్ కుటుంబం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల తమ అనుబంధం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి చంద్ర, తంబళ్లపల్లి రాజశేఖర్, మారుతి, అశోక్ తదితర నాయకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.