విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో భారీగా అవకతవకలు, కుంభకోణం జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, గత వైయస్సార్సీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ నియామకాలపై ఏకకాలంలో సీబీఐ విచారణ వేయాలని మాజీ సీఎం వైఎస్.జగన్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శాసనసభలోనూ, బయటా తోకముడిచారని ఆయన తేల్చి చెప్పారు. అనకాపల్లి జిల్లాలో తీవ్ర వర్షాభావ, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్రకటించకుండా, కరువు ప్రాంతంగా గుర్తించకుండా చంద్రబాబు ఈవెంట్ మేనేజ్‌మెంట్ రాజకీయాలకు పరిమితమయ్యారని మండిపడ్డారు. మరోవైపు విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ల ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయంటూ మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వేల కోట్ల రాయితీలు, భూములు కట్టబెడుతూ నగరాన్ని తీవ్ర నీటి సంక్షోభం, పర్యావరణ ముప్పులోకి నెడుతున్నారని ఆయన విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తీవ్రంగా నిలదీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... కొడుకును కాపాడుకోవడానికే చంద్రబాబు ఆరాటం.. సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి పర్యటనలో స్వచ్ఛాంధ్ర పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాలకు సీఎం వచ్చినప్పుడు రైతుల సమస్యలు, బకాయిలపై ప్రకటనలు ఆశిస్తారు. కానీ డీఎస్సీ అక్రమాల నుంచి తన కొడుకు లోకేష్‌ను ఎలా కాపాడుకోవాలనే తాపత్రయమే చంద్రబాబు ప్రసంగాల్లో కనిపిస్తోంది. గత వారం మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన సవాల్ విసిరారు. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ నియామకాలు, కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ కుంభకోణం.. ఈ రెండింటిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. నిజాలు నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోంది? ఆధారాలున్నా అక్రమాలపై నోరు మెదపని విద్యాశాఖ మంత్రి.. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరిట 372 మందికి నేరుగా అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్కో ఉద్యోగానికి రూ.14 లక్షల చొప్పున బేరసారాలు సాగిన ఆడియో, వీడియో క్లిప్పింగులు బయటపడినా ప్రభుత్వం సమాధానం చెప్పదు. అసెంబ్లీలో నిందితులను రిమాండ్‌కు పంపామని చెప్పి, స్టేషన్ బెయిలిచ్చి పంపించి, వారిని కాపాడుతూ తండ్రీకొడుకులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. పరీక్షలు నిర్వహించే వ్యవస్థలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే, పేపర్ లీక్ బండారం బయటపడుతుందని భయపడి అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కూడా రాలేదు. వైయస్సార్సీపీ హయాంలో 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం. కూటమి ప్రభుత్వం కేవలం 15 వేల పోస్టులు తీసి 3 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. లోకేష్ తోడల్లుడు, కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులతోనే పోస్టుల దోపిడీ.. ఒలింపిక్ విజేత పీవీ సింధుకు ఉద్యోగం ఇచ్చిన ఉదంతాన్ని ఈ అక్రమాలకు పోలుస్తారా? గుర్తింపు లేని సంఘాల సర్టిఫికెట్లతో విద్యాశాఖ మంత్రి తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకాలు పెట్టి తమ వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. ఇందుకోసం జీవో నెం. 23, 56 లను తెచ్చి తమ వాళ్లతో అప్లై చేయించి, ఆ వెంటనే గేట్లు మూసివేసి 372 మందికి అక్రమంగా పోస్టింగులు ఇచ్చారు. ఈ కుంభకోణంపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోయింది. డేటా సెంటర్ల పేరిట లక్షల ఉద్యోగాలంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు.. డేటా సెంటర్ల ద్వారా 1,80,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి లోకేష్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 1 గిగావాట్ డేటా సెంటర్‌కు 400 నుంచి 500 మందికి మించి ఉద్యోగాలు రావు. మేము గతంలో అదానీ డేటా సెంటర్‌కు అనుమతులు ఇచ్చినప్పుడు 25 వేల ఉద్యోగాలు ఇచ్చే ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలనే స్పష్టమైన నిబంధన పెట్టాం. కానీ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా భూములు, వేల కోట్ల రాయితీలు కట్టబెడుతోంది. డేటా సెంటర్ల నీటి అవసరంపై రోడ్‌మ్యాప్ ఏది? డేటా సెంటర్లకు మేం వ్యతిరేకం కాదు.. కానీ వాటికి అవసరమైన నీరు, విద్యుత్, పర్యావరణ రక్షణపై ప్రభుత్వ రోడ్‌మ్యాప్ ఏంటో చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 10 గిగావాట్ల డేటా సెంటర్లకు జీవోలు ఇచ్చారని, వాటికి సుమారు 10 టీఎంసీల నీరు అవసరమవుతుందని చెబుతున్నారు. ఈ నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? విశాఖలోనే రిజర్వాయర్లు ఎండిపోయి, ప్రజలకు మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందుతున్న పరిస్థితుల్లో కొత్త డేటా సెంటర్లకు నీటి కేటాయింపులు ఎలా చేస్తారు? పవర్ గ్రిడ్‌పై భారం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పర్యావరణ ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటారు? ప్రభుత్వం ముందుగా ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. గతంలో పోలవరం ద్వారా విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన నీటి ప్రణాళికను కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలి. పోలవరం ఎత్తు కుదింపుతో విశాఖకు నీటి ముప్పు.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల నుంచి 41 మీటర్లకే పరిమితం చేయడానికి కేంద్రంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు. దీనివల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. విశాఖ తాగునీరు, పరిశ్రమల అవసరాలకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు పాలన వల్ల 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముడసర్లోవ సహా విశాఖలోని అన్ని రిజర్వాయర్లు ఎండిపోయి, ప్రజలకు 3 రోజులకు ఒకసారి కూడా నీరందని దుస్థితి వచ్చింది. వర్షాభావ పరిస్థితులతో అనకాపల్లిలో 56 వేల హెక్టార్లకు గాను కేవలం 5 వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగైంది. అనకాపల్లితో పాటు రాష్ట్రాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలి. ప్రజలను దోచుకోవడమే చంద్రబాబుకు 'కిక్' మంచి చేస్తే తనకు కిక్ వస్తుందని చంద్రబాబు అనకాపల్లిలో సెలవిచ్చారు. ఎంపీ సీఎం రమేష్ కోసం పంచదార్ల కొండను తవ్వేసినందుకా మీకు కిక్ వచ్చింది? నర్సీపట్నం మెడికల్ కాలేజీని ప్రైవేటుకు అమ్మకానికి పెట్టినందుకా? కిక్ వచ్చింది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.36 కోట్ల బకాయిలు ఎగ్గొట్టినందుకా? విశాఖలో ఎకరం భూమిని 99 పైసలకే కట్టబెట్టినందుకా? గీతం సంస్థ పేరిట రూ.5,000 కోట్ల భూములను కబ్జా చేసినందుకా? పూడిమడకలో రూ.200 కోట్ల ఫిషింగ్ హార్బర్ పనులను ఆపేసి మత్స్యకారుల పొట్ట కొట్టినందుకా చంద్రబాబుకు కిక్ వస్తోంది? అందుకే ప్రజల్లో వైయస్. జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం. ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లిషు మీడియం ఘనత వైయస్ జగన్ దే. అనకాపల్లి సభలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడితే చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదం. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా ప్రభుత్వ పాఠశాల పేద పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడించారా? పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య, గోరుముద్ద అందించిన వైఎస్ జగన్ సంస్కరణల వల్లే నేడు ఆ విద్యార్థులు అలా మాట్లాడగలుగుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, 947 పాఠశాలలు మూతపడ్డాయని నీతి ఆయోగ్ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ప్రజలను మోసం చేసి.. రీల్స్‌తో కాలక్షేపమా? చంద్రబాబు చెప్పే స్వర్ణాంధ్ర ఎక్కడుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి, ప్రభుత్వ ఆస్తులు, పోర్టులు, మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టి ప్రజలకు ఏ భరోసా ఇస్తున్నారు? జగన్ హయాంలో ప్రజలకు నమ్మకం కలిగేలా సంక్షేమం, అభివృద్ధి జరిగితే.. ఇప్పుడు చంద్రబాబు పాలనలో అమ్మకాలే కనిపిస్తున్నాయి. ఇక డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు జగన్ విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా మంత్రులు రీల్స్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. గోవాడ రైతులకు బకాయిలెప్పుడు చెల్లిస్తారు? గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడతారన్న నమ్మకం చంద్రబాబు ప్రభుత్వంపై లేదు. కనీసం చెరుకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు, పనిచేసిన కార్మికులకు జీతాలు చెల్లించాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కోసం రూ.89.90 కోట్లు ఇచ్చి 24 వేల మంది రైతుల భవిష్యత్తును కాపాడాం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వచ్చే నెలాఖరులోగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి బకాయిలు చెల్లించడంతో పాటు ఫ్యాక్టరీ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి రైతులను పెద్ద ఎత్తున ఉద్యమంలోకి తీసుకొస్తాం. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి భూములు కొట్టేయాలని స్ధానిక ఎంపీ, కూటమి నేతలు చూస్తున్నారు. దీనిపై ఆధ్వర్యంలోనే రైతులను రోడ్డుపైకి తెచ్చి పోరాటం చేస్తాం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎంతమంది కలిసి వచ్చినా వైయస్సార్సీపీ ఒంటరిగానే ప్రతి పంచాయతీ, వార్డు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానంలో పోటీ చేస్తుందని మాజీ మంత్రి అమర్నాధ్ స్పష్టంచేశారు. గతంలో చంద్రబాబులా తోకముడిచి పారిపోయే నైజం మా నాయకుడిది కాదని... గెలుపోటములతో సంబంధం లేకుండా యుద్ధం చేసి తీరుతామని హెచ్చరించారు.