తాడేపల్లి: రాష్ట్రంలోని దేవాలయాలు, హిందూ ధర్మం పరిరక్షణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా పూర్తిగా విఫలమైందని, ఇందుకు పెద్దకాకానిలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రాలు మాయం కావడమే నిదర్శనమని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. దేవాలయాల్లో నగలు, ఆస్తులకు భద్రత కల్పించలేని ప్రభుత్వం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి భ్రమరాంబ అమ్మవారికి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించే సమయంలోనే అమ్మవారి మెడలోని పుస్తెల తాడు మాయం కావడంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన నిలదీసారు. ఏకంగా అమ్మవారి పుస్తెల తాడే మాయమైందంటే, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి, దేవదాయ శాఖ పనితీరుకు అద్దం పుడుతోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ప్రభుత్వం, దేవాదాయ శాఖ, అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. అత్యంత పవిత్రమైన పెద్దకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసంలో బ్రహ్మరాంబ అమ్మవారి మెడలో ఉండాల్సిన మంగళసూత్రాలు మాయమవడం వెనుక ఎవరి పాత్ర ఉందో తేల్చి చెప్పాలని నిలదీసారు. ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్లారా..? దేవాలయ భద్రతా వ్యవస్థ ఏం చేస్తోంది? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఇంకా ఆయన ఏం మాట్లాడరంటే... దేవాదాయ శాఖ అసమర్థతకు నిదర్శనం అమ్మవారి పుస్తెల తాడు మాయం ఘటనపై దేవాదాయ శాఖ దర్యాప్తు చేయాలి. పుస్తెల తాడు మాయంపై సమాధానం చెప్పాల్సినది దేవాదాయ శాఖ ఉన్నతాధికారులైతే, అర్ధరాత్రి సమయంలో అర్చక స్వాములను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించడం ఏమిటి? అర్చకులను అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? వారి వేషధారణ మార్చుకుని రావాలని ఆదేశాలు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి? దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం రక్షణ కల్పించలేదా? పెద్దకాకాని దేవస్థానంలో ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు. గత రెండేళ్లుగా హుండీలో బంగారం, ఉంగరాలు, నగదు మాయమవడం, హుండీ లెక్కింపులో అవకతవకలు, దేవస్థాన ప్రాంగణంలో మాంసాహారం తినడం వంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గతంలో బంగారు వడ్డాణానికి సంబంధించిన వస్తువు మాయమైనప్పుడు కూడా దానిని బయటకు రాకుండా రీప్లేస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇన్ని ఘటనలు జరుగుతున్నా దేవాదాయ శాఖ ఎందుకు స్పందించడం లేదు? భక్తుల మనోభావాలతో ఎందుకు ఆటలాడుతున్నారు? దేవాలయాల నిర్వహణపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడం లేదు? విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో కూడా హుండీ లెక్కింపులో ప్రైవేట్ వ్యక్తులు బంగారం తీసుకెళ్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత వహించకపోవడం దారుణం. దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. మరి పెద్దకాకాని అమ్మవారి మెడలోని మంగళసూత్రాలు ఎలా మాయమయ్యాయో ప్రభుత్వం చెప్పాలి. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. వారి జీతభత్యాలు, ఆరోగ్య సదుపాయాలు, నివాసాలు, ఇళ్ల స్థలాల వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అర్చకుల సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలి. వేేద పారాయణానికి పాతర వేస్తారా..? అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పారాయణదారుల నియామకానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, జీఓ కూడా జారీ చేసింది. వేద విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వేద పారాయణదారుల పోస్టులను పెంచి, వారికి పారితోషికాలు అందించేలా చర్యలు చేపట్టాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియను రెండేళ్లపాటు నిర్లక్ష్యం చేసి, ఇటీవల మాత్రమే 700 మందికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను చేపట్టడం దురదృష్టకరం. దీన్ని బట్టి హిందూ ధర్మం, వేద విద్య, దేవాలయాల పరిరక్షణ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అన్నదాన భవనం, లడ్డూ తయారీ కేంద్రం, భక్తుల సౌకర్యాలకు సంబంధించిన మౌలిక వసతులపై ముందుచూపుతో ప్రణాళికలు రూపొందించాం. దేవాలయాల అభివృద్ధి అంటే కేవలం ప్రచారం కాదు.. భక్తులకు వాస్తవంగా సౌకర్యాలు కల్పించాలి. అది చేసి చూపించాం. ఆలయాల పరిక్షణ కోసం కార్యాచరణ ప్రకటిస్తాం పెద్దకాకాని దేవస్థానంలో మంగళసూత్రాలు మాయమైన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఎఫ్‌ఐఆర్ నమోదులో జరిగిన ఆలస్యంపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అర్చకులను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించిన ఘటనపై విచారణ జరపాలి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో సీసీ కెమెరాలు, భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలి. దేవాలయాల నగలు, హుండీ ఆదాయం, దేవుడి ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాలి. పంచదారుల కొండ, సాధుకొండ, రాములవారి కొండ తదితర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి. అర్చకుల సమస్యలను పరిష్కరించి వారికి మెరుగైన సంక్షేమ సదుపాయాలు కల్పించాలి. దేవాలయాల పరిరక్షణ, హిందూ ధర్మ రక్షణ విషయంలో ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. దేవుడి నగలకే భద్రత లేని పరిస్థితి ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, భక్తుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి, దేవాలయాల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం.